TSPSC Paper Leak Case: Inspired by Munnabhai's MBBS - Sakshi
Sakshi News home page

TSPSC Case: ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, చాట్‌జీపీటీ యాప్‌తో మాస్‌ కాపీయింగ్‌.. కట్‌ చేస్తే రూ. కోటీ!

Published Thu, Jun 1 2023 1:26 PM | Last Updated on Thu, Jun 1 2023 3:42 PM

SIT investigation TSPSC Paper Leak Case Mass Copying 1 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్‌తోపాటు హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్‌ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్‌ అధికారులు ఇతడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు.

హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్ధితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేశ్‌పై ఆరోపణలున్నాయి. 

ఆస్పత్రిలో డాక్టర్‌ ద్వారా పరిచయం 
పెద్దపల్లిలో ఇరిగేషన్‌ ఏఈగా పనిచేస్తున్న రమేశ్‌కు గతంలో నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్‌ ద్వారా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి సురేష్‌ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్‌ ఇంట్లో సురేష్‌ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్‌ పేపర్ల లీకేజ్‌లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్‌కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు.

ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్‌ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్‌... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్‌ను ఒప్పించాడు. అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్‌ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్‌ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్‌ కాపీయింగ్‌కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది.
చదవండి: తెరపైకి కొత్త సీపీ..  సీఎంవోలో పని చేస్తున్న పోలీస్‌ ఉన్నతాధికారి

‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రం చూసిన రమేష్‌ అందులోని కాపీయింగ్‌ పంథాను కాస్త హైటెక్‌గా మార్చి టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్‌కు రమేష్‌ భారీ స్కెచ్‌ వేశాడు. ఇంటర్‌నెట్‌ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్‌కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్‌ డివైజ్‌ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్‌ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్‌షర్ట్‌ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్‌ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు.

ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్‌లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్‌ ద్వారా రమేశ్‌కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్‌జీపీటీ యాప్‌ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్‌ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్‌ తర్వాత మరో సిరీస్‌లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేశ్‌తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్‌ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్‌ నిర్ణయించింది.

‘లీకేజీ’ వ్యవహారంలో 50 మంది డిబార్‌
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్‌ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్‌ చేసిన అభ్యర్థులు  వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్‌కు సమరి్పంచాల్సి ఉంటుందని వెబ్‌నోట్‌ ద్వారా వెల్లడించింది. 

అయిన అభ్యర్థులు వీరే..
పులిదిండి ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్‌ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్‌ నాయక్, పి.గోపాల్‌నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్‌ నాయక్, షమీమ్, ఎన్‌.సురేశ్, డి.రమేశ్‌కుమార్, ఏ.ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుష్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్‌ కుమార్, కొంతం మురళీధర్‌ రెడ్డి, ఆకుల మనోజ్‌ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్‌కుమార్, రమావత్‌ మహేశ్,

ముదావత్‌ శివకుమార్, దానంనేని రవితేజ, గున్‌రెడ్డి క్రాంతికుమార్‌ రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్‌ రాహుల్‌ కుమార్, లవ్‌డ్యా శాంతి, రమావత్‌ దత్తు, అజ్మీరా పృథీ్వరాజ్, జాదవ్‌ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్‌ భరత్‌ నాయక్, పాశికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్‌కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్‌ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్‌ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్‌కుమార్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement