
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాయి లౌకిక్, సుష్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుష్మిత కోసం లౌకిక్ డీఏఓ(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్ కొన్నట్లు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్షను కూడా రద్దు చేసింది.
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్‌పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ మేరకు సిట్‌కు జనార్దన్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment