సాలూరు రూరల్ (పాచిపెంట): మండలంలోని విశ్వనాధపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న గిరిజన విద్యార్థిని పేటూరి జ్యోతి(19) దుర్మరణం చెందింది. దీనిపై ఎస్.ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు...బొబ్బిలి సమీపంలో కోమటిపల్లి గ్రామంలోని భాస్కర కళాశాలలో జ్యోతి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. జ్యోతి కళాశాలకు వెళ్లేందుకు మండలంలోని పద్మాపురం పంచాయతీ ఫిరంగివలస గ్రామం నుంచి బుధవారం ఉదయం బయల్దేరి రోడ్డుకు చేరుకుని ఆటోకై ఎదురు చూసింది.
ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తన బంధువులైన దీసరి రాజు, సత్యవతి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్కింది. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై సాలూరు వైపు వస్తుండగా విశ్వనాధపురం జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న ఒడిశా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీసరి రాజుకు కుడి కాలు విరిగిపోయి తలకు దెబ్బతగలగా, సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కళాశాలకు వెళ్తానని చెప్పిన కూతురు మృత్యు ఒడిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పేటూరి సత్య, కృష్ణవతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.
ఎమ్మెల్యే సంతాపం
సాలూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేటూరి జ్యోతి మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడంతో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆస్పత్రికి చేరుకొని సంతాపం తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను మృతురా>లి తండ్రి కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీసరి రాజు, ఆయన భార్య సత్యవతిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment