బాబు తీరుపై కామ్రేడ్ల కన్నెర్ర
రాజంపేట :
జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపుతున్న వివక్షను ఎండగడుతూ రాజంపేటలో కామ్రేడ్లు మంగళవారం ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాపై చూపుతున్న పక్షపాత ధోరణిని మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముక్తకంఠంతో హెచ్చరించారు. జిల్లా సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ, ఆటో కార్మిక సంఘం, ఏఐఎస్‌ఎఫ్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. జిల్లాలో నిరుద్యోగుల భవిష్యత్ కోసం సెయిల్ ఆధ్వర్యంలో తక్షణం ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ కేంద్రంతో పాటు ఉపాధి ఆధారిత పరిశ్రమను రాజంపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు, డ్వాక్రా సంఘాల రుణాలను తక్షణం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి మహేశ్, ఏఐటీఎస్ సీనియర్ నాయకుడు రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి సులోచనమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడు శివరామకృష్ణ దేవరా, జిల్లా సహాయ కార్యదర్శి సురేశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్, ఆటో వర్కర్స్ యూనియర్ అధ్యక్షుడు బలిజిపల్లె శ్రీనివాసులు మాట్లాడారు.