‘రాష్ట్రంలోనే బెస్ట్‌ కడప’ | Babuji Attada Special Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలోనే బెస్ట్‌ కడప’

Published Sat, Sep 15 2018 1:47 PM | Last Updated on Sat, Sep 15 2018 1:47 PM

Babuji Attada Special Chit Chat With Sakshi

జిల్లా పోలీసుశాఖ అన్ని విభాగాల్లోనూబెస్ట్‌గా నిలుస్తోంది. దొంగతనాలు అరికట్టడంలో.. కమాండ్‌ అండ్‌ కంట్రోలింగ్‌ వ్యవస్థ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో..డయల్‌ 100 విషయంలో తక్కువ నిమిషాల్లో స్పందించడంలో కడప రాష్ట్రంలోనే బెస్ట్‌గా నిలిచింది.లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలోనూ మొదటిస్థానంలో ఉన్నాం. గల్ఫ్‌ బాధితుల ఇబ్బందుల నేపథ్యంలో పురుడు పోసుకున్నదే బంధం. మట్కా బారిన పడి నష్టపోయిన బాధితులకు అండగా నిలువడం లాంటి  కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో జిల్లాలో మరో నాలుగు పెట్రోలు బంకుల ప్రారంభానికి చర్యలుతీసుకుంటున్నాం.నేరాల అడ్డుకట్టకు  సంబంధించి రౌడీల ఇళ్లకు జియోట్యాగింగ్‌ అమలు చేయబోతున్నాం.ఎర్రచందనం డాన్‌ సాహుల్‌భాయ్‌ కోసం వేట కొనసాగిస్తున్నామని ఎస్పీ బాబూజీ అట్టాడ స్పష్టం చేశారు. ఆయన  ‘సాక్షి’ ప్రతినిధితో ముచ్చటించారు.

సాక్షి కడప :   లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అమలుతో జిల్లాలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయని ఎస్పీ బాబూజీ అట్టాడ పేర్కొన్నారు. సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ  జిల్లాలో నేరాలతోపాటు పోలీసుల సంక్షేమానికి పాటుపడుతున్న వైనాన్ని వివరించారు. అందుకు సంబంధించి ఆయన మాటల్లోనే....

2017 జూన్‌ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ అమలుకు శ్రీకారం చుట్టగా డిసెంబరు వరకు తక్కువ కేసులు కనిపిస్తున్నాయి.    జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తద్వారా వారు ఎక్కడికైనా వెళితే   ఎవరికీ తెలియకుండా కెమెరాలు బిగించడం ద్వారా దొంగతనాలు అరికడుతున్నాం. గతంలో కడపలో కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దొంగను పట్టుకుని చరిత్రను సృష్టించాం. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూముకు సంబంధించి బ్లూ కోట్స్‌ సిబ్బంది తిరుగుతుంటారు. కెమెరా పెట్టిన ఇంటికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఎప్పటికీ అబ్జర్వేషన్‌లో ఉంటారు. కెమెరాల ద్వారా అనుమానం రాగానే నేరుగా సిబ్బందితో వెళతారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ద్వారా బ్లూకోట్స్‌ తిరుగుతూనే ఉంటారు.

ఎందుకంటే వారి వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ ఉండడంతో ఎక్కడ తిరుగుతున్న విషయం కూడా పరిశీలిస్తూ ఉంటారు. ప్రధానంగా బ్లూ కోట్స్‌ రాకతో దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్, ఈవ్‌ టీజింగ్, బస్‌స్టాప్‌లు, సినిమా థియేటర్ల వద్ద పూర్తిగా తగ్గిపోయాయి. ఇక డయల్‌ 100 విషయంలోనూ కేవలం ఫోన్‌ కాల్‌ వచ్చిన ఎనిమిది నిమిషాల్లోనే స్పందించే విషయంలో రాష్ట్రంలో మనమే ఫస్ట్‌గా నిలిచాం. ఈవ్‌టీజింగ్‌ నివారణ విషయంలో రక్షిత టీంలు బాగా పనిచేస్తున్నాయి. హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ జిల్లాలో ఆరు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (తిరుపతి), విజయనగరం జిల్లాలు ఉన్నా యి. లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో కూడా రాష్ట్రంలో మనమే బెస్ట్‌గా ఉన్నాం. చిన్నచిన్న సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపిస్తున్నాం.

ప్రమాదాల నివారణకు కృషి
ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.కాకపోతే కొన్ని స్వ యం కృతాపరాథంతో మరికొన్ని  పొరపాట్లతో జరుగుతున్నాయి.పూర్తిగా తగ్గించడానికి కృషి చేస్తున్నాం.

నిత్యం నిఘా
జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నాం. అన్ని పట్టణాల్లో వీటి వినియోగం పెంచాం. తద్వారా  నేరస్తులు నేరం చేయడానికి భయపడుతున్నారు. చేసినా వెంటనే దొరికిపోతున్నారు.  బంద్‌లు, వినాయక నిమిజ్జనాలు, రద్దీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు నేత్ర వాహనాన్ని వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించి వాహనం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా పసిగడుతుంది.

గల్ఫ్‌ బాధితులకు అండగా బంధం
 జిల్లా నుంచి జీవనాధారం కోసం ఇతర దేశాలకు వెళ్లి..అక్కడ ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు బంధం యాప్‌ ద్వారా విముక్తి కల్పిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 70 మందికి విముక్తి కల్పించాం. మరికొంతమందిని ఏజెంట్లు, ఇతర దేశాల ప్రతినిధులతో మాట్లాడి రప్పించే ప్రయత్నం జరుగుతోంది.

మట్కాతో నష్టపోయినవారిని ఆదుకుంటున్నాం
మట్కా మహమ్మారితో పూర్తిగా నష్టపోయి... కోలుకోలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుని ఆ ప్రయత్నాల్లో ఉన్న వారిని గుర్తించి ఆదుకుంటున్నాం. మట్కా మానేసి ఆర్థిక పరిస్థితులు బాగా లేక అల్లాడిపోతున్న కుటుంబాలకు పరివర్తన కార్యక్రమం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వ్యాపారాలు పెట్టిస్తున్నాం. ఇలా జిల్లాలో 20 మందికి  ఉపాధి మార్గం చూపించాం. ఎక్కడికక్కడ మట్కా నిర్మూలనలో భాగంగా సాగుతున్న వ్యవహారాలపై కేసులు నమోదు చేస్తున్నాం.

కానిస్టేబుళ్ల కోసం వసుధ
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే కానిస్టేబుళ్ల కోసం వసుధ పేరుతో వసతి కల్పించాం. తక్కువ ధరతో వారికి ఏసీ గదుల్లో విడిది ఏర్పాట్లు కల్పిస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నాం. తద్వారా ఎక్కడో బయట లేకుండా ఇక్కడే ఉండటానికి మంచి అవకాశం ఏర్పడుతోంది.

పోలీసు సంక్షేమానికి పెద్దపీట
జిల్లాలో పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ప్రధానంగా కానిస్టేబుళ్లు, ఇతర అధికారులకు నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ప్రత్యేకంగా పెద్ద సూపర్‌ మార్కెట్‌ తరహాలో పెట్టి సరుకులును అందిస్తున్నాం. వారి కోసం ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసి  అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నాం. పోలీసు సిబ్బందికి అతి తక్కువ బాడుగకు అందించే ఉమేష్‌ చంద్ర కల్యాణ మండపాన్ని ఆధునీకరించాం. ఏసీతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాం.

జిల్లాలో మరో నాలుగు పెట్రోలు బంకులు
జిల్లా కేంద్రమైన కడపలో ప్రస్తుతం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోలు బంకు నడుస్తుండగా, త్వ రలో  ప్రొద్దుటూరు, గాలివీడు, జమ్మలమడుగు, రా జుపాలెంలో ఒక్కొక్కటి చొప్పున పెట్టబోతున్నాం.  పెట్రోలు బంకుల్లో నాణ్యత పాటిస్తారు కాబట్టి వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతోంది.

సాహుల్‌భాయ్‌ కోసం వేట
ఎర్రచందనం రవాణాలో డాన్‌గా పేరుమోసిన అంతర్జాతీయ స్మగ్లర్‌ సాహుల్‌భాయ్‌ కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుత దుబాయ్‌లో తలదాచుకుంటున్న అతన్ని ఇక్కడికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఎందుకంటే ఒక పద్దతి ప్రకారం జరగాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. త్వరలోనే పోలీసు ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుంది. సాహుల్‌భాయ్‌ని పట్టుకుంటాం.

రౌడీల ఇళ్లకు జియో ట్యాగింగ్‌
జిల్లాలో రౌడీషీటర్లుగా నమోదై వారితోపాటు అల్లర్లు సృష్టించే వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాను మరింత పటిష్టం చేస్తున్నాం. అందులో భాగంగా అల్లరి మూకలుగా గుర్తింపు పొందిన రౌడీల ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేయడం..రాత్రి సమయంలో ప్రతిరోజు తనిఖీ చేసి నిర్దారించుకోవడం, వేలిముద్రలు వేయించుకోవడం వంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. తద్వారా రౌడీ మూకల కదలికలు మాకు ఎప్పటికప్పుడు తెలిసేలా జియో ట్యాగింగ్‌ అనుసంధానం ఉంటుంది. దీంతో రౌడీల్లో కూడా మార్పుకు కృషి చేయడంతోపాటు నేరాల నియంత్రణకు ఉపయుక్తంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement