LHMS app
-
ప్రజారక్షణలో మెరిసి.. అవార్డులతో మురిసి
కడప అర్బన్ : ప్రజారక్షణకు కృషి చేస్తున్న వైఎస్సార్ జిల్లా పోలీసులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2020 నుంచి ఇప్పటి (2022) దాకా ప్రతిషాత్మక అవార్డులను దక్కించుకుని ప్రత్యేకత చాటారు. దిశయాప్ డౌన్లోడ్ చేయించడం, వియోగించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి పట్టణంలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థలో అంతర్భాగంగా బ్లూకోట్ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.మహిళా పోలీసు వెన్నుదన్నుగా నిలిచి గ్రామీణ, వార్ఢుస్థాయి సమాచారాలను చేరవేస్తూ నేరాల నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. వీరి పనితీరుకు, పరిజ్ఞానానికి నిదర్శనంగా అవార్డులు లభించాయి.విధుల్లో మరింత భాద్యతను పెంచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జాతీయస్థాయిలో జిల్లా పోలీసుశాఖ కీర్తిపతాక ఎగురవేసింది. పలు ప్రభుత్వ సంస్థలతో పోటీపడి డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ఇచ్చే “డిజిటల్ టెక్నాలజీ సభ’అవార్డును సొంతం చేసుకుంది. టెక్ సపోర్ట్ ఆన్‌వన్ క్లిక్ వెబ్సైట్ ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో అవసరమైన డాష్ బోర్డ్‌లో డేటాను పొందుపర్చే విధానాన్ని ఐటీ కోర్ టీం సిబ్బంది సులభతరం చేశారు. వర్చువల్ సెమినార్ ద్వారా ఈ పురస్కారాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న జిల్లా పోలీస్‌శాఖ సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ వ్యాప్తంగా పోలీస్‌శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్’అవార్డుకు ఎంపికైంది. ‘దిశ టాస్క్ ట్రాకర్’మల్టీ టాస్క్ అప్లికేషన్‌కు అవార్డు దక్కింది. అప్లికేషన్‌ను జిల్లా పోలీస్‌శాఖ ఐటీ కోర్ టీం సిబ్బంది రూపొందించారు. ఇందులో భాగస్వామ్యులైన మహిళాపోలీసులు, ఐటీ కోర్ టీమ్ జిల్లా ఎస్పీ ప్రశంసలందుకున్నారు. సృజనాత్మక అప్లికేషన్ రూపొందించినందుకు జిల్లా ఎస్పీని, రాష్ట్ర డీజీపీ కే.వీ. రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. ‘స్కోచ్ గ్రూప్’వారి నుంచి జిల్లా పోలీస్‌శాఖకు 2020 అక్టోబర్ 28న టెలీమెడిసిన్, అవేర్ అండ్ అవేక్ పబ్లిక్ త్రో సోషల్ మీడియా, 2021 నవంబర్‌లో 16న ఐఎస్ఏఆర్సీ, టెక్ సపోర్ట్ ఆన్ ఒన్ క్లిక్ ప్రాజెక్ట్‌లకు అవారు ఇచ్చారు. టెలీమెడిసిన్ ప్రాజెక్ట్‌కుగాను 2020 అక్టోబర్ 28న స్కోచ్ గ్రూప్ వారు, 29న గవర్నెన్స్ నౌ ఇండియా పోలీస్ అవార్డ్స్– జిల్లా పోలీస్‌శాఖ దక్కించుకుంది. ఐఎస్ఏఆర్సీ ప్రాజెక్ట్‌కుగాను 2021 నవంబర్ 16న స్కోచ్ గ్రూప్ వారు, ఈ ఏడాది ఆగస్టు 27న గవర్నెన్స్ నౌ ఇండియా పోలీస్ అవార్డ్స్–2022 అనే రెండు అవార్డులు దక్కాయి. జిల్లా పోలీసుశాఖలో కడప, ప్రొద్దుటూరులో ఐఎస్ఏఆర్సీ ద్వారా జిల్లా వ్యాప్తంగా 8 కమాండ్ కంట్రోల్ వ్యవస్థలుగా రూపొందాయి. బాధితుల వద్దకు నేరుగా చేరుకుని వారి సమస్యలను పరిష్కరిస్తారు. ‘దిశ’పెట్రోలింగ్ వాహనాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం ద్వారా మహిళలు ఆపదలో ఉన్న సమయంలో డయల్ 100, ‘దిశ’ఎస్ఓఎస్ క్లిక్ చేయగానే వెంటనే బ్లూకోట్ లేదా రక్షక్ సిబ్బంది, మహిళా పోలీసువారు సంఘటన స్థలానికి చేరుకుంటారు. బాధిత మహిళకు భరోసా కల్పిస్తారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేశారు. జిల్లా పోలీసుశాఖకు ఈ ఏడాది ఆగస్టు 31న జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది నవంబర్‌లో ఉమ్మడి జిల్లాలోని వీరబల్లిలో నమోదైన సైబర్ కేసును ఛేదించి బాధితుడు కోల్పోయిన రూ. 2.8 లక్షల మొత్తాన్ని అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి నుంచి రికవరీ చేశారు.న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీఆర్బీ వర్క్‌షాపులో ఏపీ నుంచి వైఎస్పార్ జిల్లాకు చెందిన సైబర్‌కేసును కేస్ స్టడీకి ఎంపిక చేసి జిల్లా ఎస్పీని ప్రసంగించేందుకు ఆహా్వనించింది. అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ వర్క్‌షాప్‌నకు హాజరై కేసు ఛేదనలో ఎదుర్కొన్న అనుభవాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు డూడికీ జ్ఞాపికను అందజేశారు. అవార్డులు బాధ్యత పెంచాయి జిల్లాలో పోలీసు అధికారుల, సిబ్బంది, ప్రజలందరి సహకారంతో 2020 నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో 8 రకాల అవార్డులు వచ్చాయి. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో విధులను నిర్వహించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాంతిభద్రతల పరిరక్షణలో సఫలీకృతులవుతున్నాం. ప్రధానంగా ‘దిశ’యాప్ వినియోగం, కేసుల పరిష్కారంలో జిల్లా పోలీసు యంత్రాంగంలో ఐటీ కోర్ టీమ్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ అవార్డులు పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతను మరింత పెంచాయి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ -
దసరాకు ఊరెళ్తున్నారా? పోలీసులకు చెప్పండి..
సాక్షి, అమరావతి: దసరా పురస్కరించుకుని పిల్లలకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేందుకు దాదాపు అందరూ సమాయత్తమవడం సహజం. ఇదే అదనుగా దొంగలు తమ చేతికి పని చెప్పేందుకు రెడీ అయ్యే అవకాశముండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇళ్లు వదిలి వెళ్లేవారు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే తాము ఒక కంట (సీసీ కెమెరా ద్వారా) కనిపెట్టే వీలుంటుందంటున్నారు. రోజుల తరబడి యజమానులు ఇళ్లలో లేకపోతే చోరీలు జరిగే ప్రమాదాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా సమాచారం ఇచ్చే వారి ఇళ్లకు పోలీసులు ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎల్‌హెచ్‌ఎంఎస్) పరికరాన్ని అమరుస్తున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు ఆదరణ రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన ఈ ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానం కొన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు ఇచ్చింది. వైఎస్సార్ కడప, కర్నూలు, తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరంలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. మిగిలిన జిల్లాల్లోను దీనిని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, దీన్ని విస్తృతంగా అమలుచేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉంది. తొలుత వీధుల్లో ఏర్పాటుచేసే సీసీ కెమెరాలను ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్ చేసేలా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా వీటిని ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించేందుకు దశల వారీ కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రజలు కూడా సమకూర్చుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ కోసం 8,37,469 విజ్ఞాపనలు వచ్చాయి. వాటిలో 3,91,793 విజ్ఞప్తులను పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. తొలి ప్రయత్నంగా 25,152 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చగలిగారు. పరికరాల కొరతే ఇందుకు ప్రధాన కారణం. అదే ప్రజలు వీటిని సమకూర్చుకుని పోలీసులకు సమాచారమందిస్తే పోలీసులు ఆ ఇల్లు లేదా కార్యాలయంపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతారని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఒకవేళ పరికరాలను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఉంటే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సీసీ కెమెరాలతో నిఘా ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ఆ కేసును సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదిస్తున్నారు. క్లిష్టమైన కేసుల్లో సైతం నేర పరిశోధనలో ఆధారాలు అందిస్తున్నది ఇవే. అందుకే పోలీసులు బహిరంగ ప్రదేశాలు, జన సంచారం ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆలయాలు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలతోపాటు పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఇప్పుడు వీటిని ఇంతటితో సరిపెట్టకుండా యజమానులు లేని ఇళ్లకూ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఊరెళ్తే ఇలా చేయండి.. 1.ఎవరైనా కొద్దిరోజులపాటు తమ ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 2.పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్‌హెచ్‌ఎంఎస్ యూనిట్ అమర్చుతారు. 3.తాళం వేసినఆ ఇంట్లోకిఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అలారంతో కూడిన సంకేతాలు వెళ్తాయి. 4.పోలీసులు వెంటనే అప్రమత్తమైఏ ఇంట్లో అపరిచితులు చొరబడ్డారో గుర్తించి క్షణాల్లో వారిని పట్టుకుంటారు. -
ఊరికి వెళ్తున్నారా.. జర జాగ్రత్త.!
ప్రొద్దుటూరు క్రైం : వేసవి మొదలైంది.. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చేశారు. వేసవిలో చాలా మంది వారి వారి బంధువుల ఊళ్లకు వెళ్తారు. ఇంకొందరు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇళ్లకు తాళం వేసి వారం–పది రోజుల పాటు స్వస్థలాలకు రాని పరిస్థితి ఉంటుంది. ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రిళ్లు చల్లని గాలి కోసం ఆరుబయట నిద్రించేవాళ్లు చాలా మంది ఉన్నా రు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చిన్నపా టి అప్రమత్తత అవసరం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇం టిపై పోలీసుల నిఘా ఉంటుంది. లేకుంటే దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్తారు జాగ్రత్త అని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌తో చోరీలకు చెక్ చోరీల నివారణకు పోలీసు శాఖలో ఏడాది క్రితం ‘లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ద్వారా పని చేసే సీక్రెట్ కెమెరా ద్వారా పోలీసులు చోరీలను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు . ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వచ్చినప్పుడు యాప్‌లో రిక్వెస్ట్ ప్రొటెక్షన్‌ను క్లిక్ చేస్తే వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుంది. కొన్ని నిమిషాల్లోని పోలీసులు ఆ ఇంటికి వచ్చి నిఘా కెమెరాను అమరుస్తారు. ఈ నిఘా కెమెరా యజమాని మొబైల్‌తో పాటు పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. కడప, ప్రొద్దుటూరులో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. తాళం వేసిన ఇంట్లోకి ఎవరైనా దొంగలు ప్రవేశించి కెమెరా ముందుకు వెళ్లగానే యజమాని సెల్‌కు, పోలీస్‌కంట్రోల్ రూంకు మెసేజ్ వెళ్లి అలారం మోగుతుంది. దీంతో కొన్ని క్షణాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుంటారు. జిల్లా వ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు.. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1,53,180 మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కడపలో 65,510, ప్రొద్దుటూరులో 50,380 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని స్టేషన్లలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, మైదుకూరులో కూడా లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చారు. యాప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బ్లూకోల్ట్స్ పోలీసులు వాహనాల్లో తిరుగుతూ ప్రజలకు యాప్ గురించి వివరిస్తూ వారి మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేస్తున్నారు. దాదాపు ప్రతి ఇంటికి స్మార్ట్‌ఫోన్ ఉంది. నియోజకవర్గంలో లక్షలు సెల్ఫోన్లు ఉండగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారు తక్కువ సంఖ్యలో ఉండటంపై పోలీసు అధికారులు విస్మయం చెందుతున్నారు. చోరీల నివారణకు ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌తో80 శాతం తగ్గిన చోరీలు లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌లో 80 శాతం మేర చోరీలు తగ్గాయి. 2016లో 79 చోరీలు, 2017లో 84 చోరీలు జరుగా 2018లో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను అనుసంధానం చేసిన తర్వాత 32 చోరీలు మాత్రమే జరిగాయి. 2016లో రాత్రి ఇళ్లకు కన్నం వేసిన చోరీలు 21, 2017లో 12 జరిగాయి. 2018లో 5 చోరీలు మాత్రమే జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 2016లో రూ. 90,48,800, 2017లో రూ. 74,44,950 విలువ చేసే సొత్తు చోరీ కాగా 2018లో రూ. 27,45,350 మాత్రమే సొత్తు చోరీ అయింది. ఎల్హెచ్ఎంఎస్కెమెరాకు దొరికిన దొంగలు ∙జిల్లాలో యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కడపలో ఏడాది కిత్రం నిఘా కెమెరా ఏర్పాటు చేసిన ఓ ఇంటిలో దొంగ ప్రవేశించగా ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి నిందితుడిని పట్టుకున్నారు. దొంగను విచారించగా అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ∙ఇటీవల ప్రొద్దుటూరులోని వైఎస్ నగర్లో ఇంట్లో చోరీకి ప్రయత్నించిన అంతర్రాష్ట్ర దొం గను పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ నిఘా కెమెరా సాయంతో పట్టుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన అతను కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చోరీలకు పాల్ప డ్డాడు. అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సహకరించండి వేసవిలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు పోలీసుశాఖకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫలితంగా చోరీలు జరగడానికి అవకాశం ఉండదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టంతో మేమే నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టిస్తాం. బంధువుల ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే ఇంట్లో ఒకరు ఉండేలా చూసుకుంటే మంచిది. అలా కాకపోతే తాళం వేసిన ఇంటి బయట రాత్రి వేళల్లో లైట్లు వెలిగేలా చూడాలి. ఇంట్లో నగదు, ఆభరణాలు పెట్టవద్దు. – శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ. -
ఆదమరిస్తే..అంతే సం‘గతి’!
పాత గుంటూరుకు చెందిన ఓ కుటుంబం అంతా కలసి గత ఏడాది నవంబరులో చెన్నైలో బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏర్పాటు చేసి వెళ్లారు. అయితే, వారు వెళ్లిన రెండు రోజుల తర్వాత ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు తాళ్లూరి దేవయ్య చోరీకి యత్నించాడు. కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తమై నిమిషాల వ్యవధిలో వెళ్లి అతడిని అరెస్టు చేశారు. గుంటూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళుతున్నారా...అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించక తప్పదు...రెండు రోజుల్లో వస్తాం కదా..అంటూ నిర్లక్ష్యంగా ఇంటికి తాళాలు వేసి వెళ్లారంటే దొంగలకు అవకాశం ఇచ్చినట్టే. విలువైన వస్తువులు, నగదు ఇంట్లో బీరువాలో భద్రపరిచాం అనుకుంటే పొరపాటు పడ్డట్టే..తీరా దొంగలు దోచుకువెళ్లాక లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. అదమరిస్తే అంతే సంగతి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పండుగలు, శుభకార్యాలు, విహారయాత్రలు ప్రయాణం ఎక్కడికైనా కావచ్చు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ కలసి బయటకు వెళ్లే సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పోలీసులు కాపాలా కాస్తారులే అనుకుంటే పొరపాటే అవుతుంది. పోలీసుల కదలికలను గమనిస్తూ చోరీలకు పాల్పడే దొంగలు మరింత జాగ్రత్తలు పాటిస్తారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, ఇంటి దస్తావేజులు, నగదును బ్యాంకు లాకర్లోనే భద్రపరుచుకోవాలి. ఊరెళ్లుతున్న విషయాన్ని ఇంటి పక్కల వారికి తెలియజేయాలి. ఎప్పుడు వెళ్లేది..ఎప్పుడు తిరిగి వస్తాం అనే విషయాలను కూడా తెలియజేస్తే మరీ మంచిది. ఎందుకంటే వారు కూడా పరిశీలిస్తూ ఉంటారు. అవకాశం ఉంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి వెనుక వైపు, ప్రధాన ద్వారాలకు సెంటర్ లాకింగ్ ఉంటే వాటిని ధ్వంసం చేయడం కష్టం. చోరీలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్నువినియోగించుకోవాలి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న పోలీస్ సేవలను వినియోగించుకోవడం మరచిపోకూడదు. ఆన్లైన్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ల(ఎల్‌హెచ్‌ఎంఎస్) యాప్‌ను మన దగ్గర ఉండే టచ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రిజస్ట్రేషన్ నమోదు చేయించుకుంటే ఊరు వెళ్లే సమయంలో రిక్వెస్ట్ పంపాలి. వెంటనే పోలీసులు ఇంటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తుంటారు. ఎవరైనా చోరీకి యత్నిస్తే నిమిషాల వ్యవధిలో ఇట్టే అరెస్టు చేస్తారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌తో నిఘా ఇంటికి తాళం వేసి ప్రయాణాలు చేయాల్సి వచ్చిన సమయంలో తప్పనిసరిగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోండి. తద్వారా స్థానిక పోలీసులతో పాటు నిరంతర నిఘా ఉంటుంది. మీ ఇంటికి భద్రత ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను వెంటనే ఆరెస్టు చేసి చోరీలు జరగకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. –సీహెచ్. విజయారావు, అర్బన్ ఎస్పీ ఎల్హెచ్ఎస్తో జియో ట్యాగింగ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు లాక్డ్ హౌస్ సర్వైలైన్స్ సిస్టమ్(ఎల్హెచ్ఎస్)ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా సమాచారం ఇవ్వకుండా ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి నిరంతరం సిబ్బంది పహారా కాస్తుంటారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులు అటువైపు వెళ్లినా ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. –ఎస్.వి.రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ -
ఊరెళుతున్నారా.. జర జాగ్రత్త
నెల్లూరు(క్రైమ్): దసరాకు ఊరెళుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పోలీసు అధికారులు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, వ్యాపారాలు ఇలా అనేక అవసరాల నిమిత్తం పల్లెసీమల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి, పట్టణాలకు వచ్చి ఇక్కడే నివాసముంటున్నారు. దసరా పండగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించి చోరులు విజృంభించి దోచుకెళ్లే అవకాశం ఉంది. అంతా అయిపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించి బోరున విలపించడం కన్నా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని పేర్కొంటున్నారు. అదేక్రమంలో ప్రయాణంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అందుబాటులో యాప్ ఇళ్ల దొంగతనాలను నివారించేందుకు పోలీసుశాఖ ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నెల్లూరు నగరవాసులు ఊరెళుతుంటే ఆ శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఊరు ఎప్పుడు వెళుతున్నారు?, తిరిగి ఎప్పుడు వస్తారు?, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేస్తే పోలీసులు ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా పెడతారు. ఇంట్లో వైర్‌లెస్‌తో కూడిన మోషన్ కెమెరాను, వైఫైని ఏర్పాటుచేస్తారు. ఇంటి యజమాని సెల్‌ఫోన్‌తో పాటు కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తారు. ఇంట్లో దొంగలుపడితే వెంటనే ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ పోలీసులను, ఇంటి యజమానిని అప్రమత్తం చేస్తుంది. దీంతో పోలీసులు ఆ ఇంటివద్దకు చేరుకొని నేరగాళ్లను పట్టుకునే అవకాశం ఉంది. అప్రమత్తత అవసరం ఇటీవల రైళ్లలో చోరీలు అధికమయ్యాయి. ప్రయాణికులు ఏమరపాటుగా ఉంటే చాలు దొంగలు విలువైన వస్తువులను తస్కరించేస్తున్నారు. కిటీకి పక్కన కూర్చొన్న మహిళలు మెడల్లో బంగారు ఆభరణాలు తెంచుకుపోవడం, బ్యాగులు, ఇతర విలువైన సామగ్రి అపహరించుకుని వెళతారు. ఆర్టీసీ ప్రయాణాల్లో దొంగతనాలు అధికమయ్యాయి. రద్దీగా ఉండే బస్టాండ్‌ల్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఇలా చేయాలి 4ప్రయాణికులు తమ సామాన్లకు గొలుసులు ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి. 4సాధారణ బోగీల్లో ర్యాక్‌లపై సామగ్రిని ఉంచకూడదు. 4మహిళలు చేతి బ్యాగుల విషయంలో ప్రత్యేకశ్రద్ధ వహించాలి. 4కిటికీల వద్ద ఆభరణాలు ధరించి నిద్రించరాదు. 4అపరిచితులతో ఎక్కుగా స్నేహం చేయకూడదు. 4తెలియని వారు ఏమి ఇచ్చినా తినకూడదు. తాగకూడదు. 4అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలి. ముఖ్యమైన ఫోన్ నంబర్లు నగర డీఎస్పీ 9440796303 చిన్నబజారు పోలీస్‌స్టేషన్ 0861–2328410, 9440796305 నవాబుపేట పోలీస్‌స్టేషన్ 0861–2328420, 9440796306 సంతపేట పోలీస్‌స్టేషన్ 0861–2331430, 9400700097 దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ 0861–2328440, 9440796308 వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ 0861–2366058, 9440796304 బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ 0861–2327766, 9440796311 నెల్లూరు సీసీఎస్ 0861–2327647, 9440700091 నెల్లూరు రైల్వే డీఎస్పీ 0861–2331169, 9440627391 నెల్లూరు రైల్వే సీఐ 0861–2331423, 9440627645 డయల్ 100, 1090 -
‘రాష్ట్రంలోనే బెస్ట్ కడప’
జిల్లా పోలీసుశాఖ అన్ని విభాగాల్లోనూబెస్ట్‌గా నిలుస్తోంది. దొంగతనాలు అరికట్టడంలో.. కమాండ్ అండ్ కంట్రోలింగ్ వ్యవస్థ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో..డయల్ 100 విషయంలో తక్కువ నిమిషాల్లో స్పందించడంలో కడప రాష్ట్రంలోనే బెస్ట్‌గా నిలిచింది.లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలోనూ మొదటిస్థానంలో ఉన్నాం. గల్ఫ్ బాధితుల ఇబ్బందుల నేపథ్యంలో పురుడు పోసుకున్నదే బంధం. మట్కా బారిన పడి నష్టపోయిన బాధితులకు అండగా నిలువడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో జిల్లాలో మరో నాలుగు పెట్రోలు బంకుల ప్రారంభానికి చర్యలుతీసుకుంటున్నాం.నేరాల అడ్డుకట్టకు సంబంధించి రౌడీల ఇళ్లకు జియోట్యాగింగ్ అమలు చేయబోతున్నాం.ఎర్రచందనం డాన్ సాహుల్‌భాయ్ కోసం వేట కొనసాగిస్తున్నామని ఎస్పీ బాబూజీ అట్టాడ స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ముచ్చటించారు. సాక్షి కడప : లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) అమలుతో జిల్లాలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయని ఎస్పీ బాబూజీ అట్టాడ పేర్కొన్నారు. సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో నేరాలతోపాటు పోలీసుల సంక్షేమానికి పాటుపడుతున్న వైనాన్ని వివరించారు. అందుకు సంబంధించి ఆయన మాటల్లోనే.... 2017 జూన్ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్ అమలుకు శ్రీకారం చుట్టగా డిసెంబరు వరకు తక్కువ కేసులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మంది ఎల్‌హెచ్‌ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తద్వారా వారు ఎక్కడికైనా వెళితే ఎవరికీ తెలియకుండా కెమెరాలు బిగించడం ద్వారా దొంగతనాలు అరికడుతున్నాం. గతంలో కడపలో కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దొంగను పట్టుకుని చరిత్రను సృష్టించాం. కమాండ్ అండ్ కంట్రోల్ రూముకు సంబంధించి బ్లూ కోట్స్ సిబ్బంది తిరుగుతుంటారు. కెమెరా పెట్టిన ఇంటికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఎప్పటికీ అబ్జర్వేషన్లో ఉంటారు. కెమెరాల ద్వారా అనుమానం రాగానే నేరుగా సిబ్బందితో వెళతారు. కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా బ్లూకోట్స్ తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వారి వాహనాలకు జీపీఆర్ఎస్ ఉండడంతో ఎక్కడ తిరుగుతున్న విషయం కూడా పరిశీలిస్తూ ఉంటారు. ప్రధానంగా బ్లూ కోట్స్ రాకతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, బస్‌స్టాప్‌లు, సినిమా థియేటర్ల వద్ద పూర్తిగా తగ్గిపోయాయి. ఇక డయల్ 100 విషయంలోనూ కేవలం ఫోన్ కాల్ వచ్చిన ఎనిమిది నిమిషాల్లోనే స్పందించే విషయంలో రాష్ట్రంలో మనమే ఫస్ట్‌గా నిలిచాం. ఈవ్‌టీజింగ్ నివారణ విషయంలో రక్షిత టీంలు బాగా పనిచేస్తున్నాయి. హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ జిల్లాలో ఆరు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. తర్వాతి స్థానాల్లో చిత్తూరు (తిరుపతి), విజయనగరం జిల్లాలు ఉన్నా యి. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో కూడా రాష్ట్రంలో మనమే బెస్ట్‌గా ఉన్నాం. చిన్నచిన్న సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపిస్తున్నాం. ప్రమాదాల నివారణకు కృషి ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.కాకపోతే కొన్ని స్వ యం కృతాపరాథంతో మరికొన్ని పొరపాట్లతో జరుగుతున్నాయి.పూర్తిగా తగ్గించడానికి కృషి చేస్తున్నాం. నిత్యం నిఘా జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నాం. అన్ని పట్టణాల్లో వీటి వినియోగం పెంచాం. తద్వారా నేరస్తులు నేరం చేయడానికి భయపడుతున్నారు. చేసినా వెంటనే దొరికిపోతున్నారు. బంద్‌లు, వినాయక నిమిజ్జనాలు, రద్దీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు నేత్ర వాహనాన్ని వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించి వాహనం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా పసిగడుతుంది. గల్ఫ్ బాధితులకు అండగా బంధం జిల్లా నుంచి జీవనాధారం కోసం ఇతర దేశాలకు వెళ్లి..అక్కడ ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు బంధం యాప్ ద్వారా విముక్తి కల్పిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 70 మందికి విముక్తి కల్పించాం. మరికొంతమందిని ఏజెంట్లు, ఇతర దేశాల ప్రతినిధులతో మాట్లాడి రప్పించే ప్రయత్నం జరుగుతోంది. మట్కాతో నష్టపోయినవారిని ఆదుకుంటున్నాం మట్కా మహమ్మారితో పూర్తిగా నష్టపోయి... కోలుకోలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుని ఆ ప్రయత్నాల్లో ఉన్న వారిని గుర్తించి ఆదుకుంటున్నాం. మట్కా మానేసి ఆర్థిక పరిస్థితులు బాగా లేక అల్లాడిపోతున్న కుటుంబాలకు పరివర్తన కార్యక్రమం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వ్యాపారాలు పెట్టిస్తున్నాం. ఇలా జిల్లాలో 20 మందికి ఉపాధి మార్గం చూపించాం. ఎక్కడికక్కడ మట్కా నిర్మూలనలో భాగంగా సాగుతున్న వ్యవహారాలపై కేసులు నమోదు చేస్తున్నాం. కానిస్టేబుళ్ల కోసం వసుధ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే కానిస్టేబుళ్ల కోసం వసుధ పేరుతో వసతి కల్పించాం. తక్కువ ధరతో వారికి ఏసీ గదుల్లో విడిది ఏర్పాట్లు కల్పిస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నాం. తద్వారా ఎక్కడో బయట లేకుండా ఇక్కడే ఉండటానికి మంచి అవకాశం ఏర్పడుతోంది. పోలీసు సంక్షేమానికి పెద్దపీట జిల్లాలో పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ప్రధానంగా కానిస్టేబుళ్లు, ఇతర అధికారులకు నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ప్రత్యేకంగా పెద్ద సూపర్ మార్కెట్ తరహాలో పెట్టి సరుకులును అందిస్తున్నాం. వారి కోసం ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసి అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నాం. పోలీసు సిబ్బందికి అతి తక్కువ బాడుగకు అందించే ఉమేష్ చంద్ర కల్యాణ మండపాన్ని ఆధునీకరించాం. ఏసీతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాం. జిల్లాలో మరో నాలుగు పెట్రోలు బంకులు జిల్లా కేంద్రమైన కడపలో ప్రస్తుతం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోలు బంకు నడుస్తుండగా, త్వ రలో ప్రొద్దుటూరు, గాలివీడు, జమ్మలమడుగు, రా జుపాలెంలో ఒక్కొక్కటి చొప్పున పెట్టబోతున్నాం. పెట్రోలు బంకుల్లో నాణ్యత పాటిస్తారు కాబట్టి వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. సాహుల్‌భాయ్ కోసం వేట ఎర్రచందనం రవాణాలో డాన్‌గా పేరుమోసిన అంతర్జాతీయ స్మగ్లర్ సాహుల్‌భాయ్ కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుత దుబాయ్‌లో తలదాచుకుంటున్న అతన్ని ఇక్కడికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఎందుకంటే ఒక పద్దతి ప్రకారం జరగాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. త్వరలోనే పోలీసు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సాహుల్‌భాయ్‌ని పట్టుకుంటాం. రౌడీల ఇళ్లకు జియో ట్యాగింగ్ జిల్లాలో రౌడీషీటర్లుగా నమోదై వారితోపాటు అల్లర్లు సృష్టించే వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాను మరింత పటిష్టం చేస్తున్నాం. అందులో భాగంగా అల్లరి మూకలుగా గుర్తింపు పొందిన రౌడీల ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయడం..రాత్రి సమయంలో ప్రతిరోజు తనిఖీ చేసి నిర్దారించుకోవడం, వేలిముద్రలు వేయించుకోవడం వంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. తద్వారా రౌడీ మూకల కదలికలు మాకు ఎప్పటికప్పుడు తెలిసేలా జియో ట్యాగింగ్ అనుసంధానం ఉంటుంది. దీంతో రౌడీల్లో కూడా మార్పుకు కృషి చేయడంతోపాటు నేరాల నియంత్రణకు ఉపయుక్తంగా ఉంటుంది. -
యాప్‌తో ఆటకట్టు
కర్నూలు: లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా పోలీసులు జిల్లాలో తొలిసారిగా ఓ దొంగను గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగర శివారులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని శ్రీరామ కాలనీలో నివాసముంటున్న సీతారామయ్య రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అనంతపురం వెళ్లాడు. ఆయన కోరిక మేరకు ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాను ఏర్పాటు చేశారు. దొంగ ఇంట్లోకి దూరగానే కంట్రోల్ రూమ్‌లో బజర్ మోగింది. ఘటన స్థలాన్ని సమీపిస్తుండగానే పోలీసు వాహనం సైరన్ శబ్దాన్ని దొంగ గుర్తు పట్టి గోడదూకి పారిపోయాడు. ఈనెల 8న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 457, 380 రెడ్ విత్ 511, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బుధవారపేటకు చెందిన పాత నేరస్తుడు కాశెపోగు అశోక్‌ను నిందితుడిగా గుర్తించారు. మంగళవారం కృష్ణానగర్ జంక్షన్లో తిరుగుతుండగా బ్లూ కోల్ట్సŠ, క్యూఆర్టీ సిబ్బంది అరెస్ట్ చేశారు. కంట్రోల్ రూమ్ తనిఖీ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఎస్పీ గోపీనాథ్ జట్టి మంగళవారం తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అదనంగా రెండు సీసీ కెమెరాల మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్ బాషా, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గుణశేఖర్, ఎస్ఐ తిమ్మారెడ్డి ఉన్నారు. -
యాప్ తో నిశ్చింత!
ఓ యాప్‌తో మీ ఇల్లు, వస్తువులు సురక్షిం కానున్నాయి. ఇంటికి తాళం వేసి దూర ప్రయాణాలకు వెళ్లేవారు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే పోలీసులు తయారుచేయించిన ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్’ మీ వస్తువులకు రక్షణగా నిలవనుంది. ఇంటి దొంగలకు ముకుతాడు వేసేందుకు ఖాకీలు సన్నద్ధమయ్యారు. చిలకలూరిపేటటౌన్/చిలకలూరిపేట/పట్నంబజారు(గుంటూరు) /పిడుగురాళ్ళ: జిల్లాలో గత ఏడాది 205 ఇంటి దొంగతనాలు జరిగాయి. 2015లో 216 చోటు చేసుకున్నాయి. వీటిలో చాలా కేసులను పోలీసులు ఛేదించినా ఇప్పటికీ దొంగతనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 141 చోరీలు జరిగాయి. ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నూతంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ (యాప్) ను రూపొందిం చింది. అదే లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్). వాచ్ రిక్వెస్ట్ ఫామ్‌ని పూర్తి చేయండిలా... రిజిస్ట్రేషన్ ద్వారా లభించిన యూజర్ ఐడీతో యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏరోజు ఎన్ని గంటలకు ఊరికి వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు.. వంటి వివరాలు నమోదు చేయాలి. వెంటనే రిక్వెస్ట్‌ను అనుమతించినట్లు సందేశం వస్తుం ది. దీంతో ఊరు వెళ్లేలోపు పోలీసులు ఇంటికి చేరుకుని సీసీ కెమెరాలు అమరుస్తారు. దొంగలు ఇంట్లోకి చొరబడగానే కెమెరాల ద్వారా స్టేషన్‌కు సమాచారం అందుతుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పట్టుకుంటారు. దీనికిగాను పోలీసులు ఎలాంటి రుసుమును వసూలు చేయరు. రిజిస్టర్ ఇలా... ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారు ముందుగా ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ యాప్‌ను గూగుల్ స్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. అందులో కోరిన వివరాలను పొందుపరచాలి. పేరు, మొబైల్ నంబర్, జిల్లా, టౌన్, డోర్ నంబర్, చిరునామా పట్టికలను సరైన వివరాలతో పూర్తి చేయాలి. ఆ తర్వాత వాటి కిందనే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే పట్టికలు కనిపిస్తాయి. వాటి కింద గూగుల్ లొకేషన్ పాయింట్ సంకేతంతో గెట్ మై లొకేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసే ముందుగా మీ మొబైల్ లొకేషన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎవరి ఇంటి నుంచి వారే పూర్తి చేయాలి. లేకపోతే వివరాలు నమోదు కావు. ఇప్పటి వరకు అనేక రిజిస్ట్రేషన్లు.. యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రధాన ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్లు కూడా అధికంగానే ఉన్నాయి. గుంటూరు అర్బన్ పరిధిలో 545 రిజిస్ట్రేషన్లు కాగా వాటిలో 32 రిక్వెస్ట్ వాచ్‌లు జరిగాయి. అందులో 27 నివాసాల్లో ఎటువంటి ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేసి అర్బన్ పోలీసులు సఫలీకృతం అయ్యారు. మరో నాలుగు కెమెరాలు రన్నింగ్‌లో ఉండగా, మరో నివాసానికి త్వరలో రిక్వెస్ట్ ఆధారంగా బిగించాల్సి ఉంది. అలాగే, గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ఈ విధానాన్ని పిడుగురాళ్ళ, తెనాలి, వినుకొండ, చిలుకలూరిపేట, బాపట్ల, రేపల్లె, నర్సరావుపేట నియోజకవర్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు 4,091 రిజిస్ట్రేషన్లు రాగా, 85 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను సద్వినియోగం చేసుకున్నారు. మరో 5 నివాసాల్లో రన్నింగ్‌లో ఉండగా, నాలుగు భవిష్యత్తులో రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని వినియోగించేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. అక్షాంశ, రేఖాంశాలతో సమస్యలు... లాటిట్యూడ్, లాంగిట్యూడ్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది తికమకపడుతుంటారు. ఇంటి దగ్గర నుంచి వివరాలు నమోదు చేసినా లొకేషన్ సరిగ్గా లేని కారణంగా ఫెయిల్ అని వస్తుంది. ఉదాహరణకు గుంటూరు నగరానికి చెందిన వారైతే.. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి గుంటూరు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ (అక్షాంశ, రేఖాంశాలు) అని టైప్ చేస్తే పక్క చిత్రంలో చూపించిన విధంగా ఫలితం వస్తుంది. వాటిని కాపీ చేసుకుని లేదా గుర్తుంచుకుని తిరిగి యాప్‌ని ఓపెన్ చేసి పొందుపరిస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. దాన్ని ఓటీపీ బాక్స్‌లో సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ విజయవంతం అయినట్లు సంకేతం వస్తుంది. దాంతోపాటు ఆరు అంకెల యూజర్ ఐడీ కూడా వస్తుంది. ఇక మీరు ఎప్పుడు ఊరెళ్లినా యాప్‌ని ఓపెన్ చేసి మీ యూజర్ ఐడీని ఓపెన్‌చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. వెంటనే పోలీసులు మీ ఇంటి గుమ్మం ముందు సీసీ కెమెరాలతో ప్రత్యక్షమౌతారు. మా లక్ష్యం జీరో ఎఫెన్స్... ఇంటి దొంగతనాలను నూరు శాతం నియంత్రించి ప్రజల విలువైన వస్తువులకు భద్రత కల్పించడమే మా ధ్యేయం. 2015తో పోల్చుకుంటే 2016లో ఇంటి దొంగతనాలు కొద్దిగా తగ్గాయి. వాటిని జీరో స్థాయికి తీసుకొచ్చేందుకే నూతన యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాం. దొంగతనాలకు పాల్పడే వారిలో అత్యధికులు చెడు వ్యసనాలకు బానిసైన యువతే ఉంటున్నారు. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, సంపన్నులతో పాటు సామాన్యులు సైతం యాప్‌ని వినియోగించుకోవచ్చు. దీని కోసం ప్రజలు మాకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. – సీహెచ్ విజయరావు, అర్బన్ జిల్లా ఎస్పీ; సీహెచ్. వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ -
దొంగను.. ఇట్టే పట్టేస్తుందట..!
► మోషన్ కెమెరాలతో ఇళ్లకు రక్షణ ► ఉచితంగా నిఘానేత్రాల ఏర్పాటు ► స్మార్ట్ యాప్‌తో రిజిస్ట్రేషన్ చాలు ► జిల్లాలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు ఆదరణ చిత్తూరు : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఈశ్వరుడు పట్టకపోవచ్చుగాని. పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీ ఇంటి దొంగల్ని ఇట్టే పట్టేస్తుంది. చిత్తూరుకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. దొంగలబెడద లేకుండా ఎక్కడికైనా, ఎన్నిరోజులైనా ధైర్యంగా వెళ్లి రావచ్చు. లాక్డ్ హౌస్ మేనేజన్ మెంట్ సిసస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్).. ఏడాది క్రితం అనంతపురం జిల్లాలో ప్రారంభమైన చిన్న పాటి స్మార్ట్ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు పోలీసులు మేల్కొంటారనే నానుడిని చెరిపేస్తూ, దొంగలు రాగానే పోలీసులు పట్టుకుంటున్నారనే పేరు తీసుకురావడానికి జిల్లా పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. తాళం వేసిన ఇళ్లపై దొం గలు పడ్డ నిముషాల వ్యవధిలో వీరిని పట్టుకోవడమే లక్ష్యంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇంతకూ ఇది ఎలా పనిచేస్తుంది..? ఎలా స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి..? మనపై ఏమైనా ఆర్థిక భారం పడుతుందా..? అనే ప్రశ్నలకు చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ పట్టుకుని మీరూ ఇలా ఫాలో అయిపోండి.. డౌన్ లోడ్ ఇలా... ముందుగా స్మార్ట్ ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ఇక్కడ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ అని టైప్ చేయాలి. ఏపీ పోలీస్ పేరిట ప్రత్యక్షమయ్యే ఓ అప్లికేషన్ కనిపిస్తుంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. తరువాత వ్యక్తి పేరు, ఫోన్ నంబరు, చిరునామాతో పాటు ఇంట్లో కూర్చుని గూగుల్ మ్యాప్‌ను అటాచ్ చేయాలి. వెంటనే మనం ఇచ్చిన ఫోన్ నంబరుకు నాలుగంకెలు ఉన్న వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని యాప్‌లో టైప్ చేస్తే మన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత మన ఫోన్ కు ఓ రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. దీన్ని ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఇక ఎప్పుడైనా ఊరికి వెళుతునప్పుడు పోలీసులు ఇంటిపై నిఘా ఉంచాలనుకుంటే యాప్‌లోకి వెళ్లి ‘రిక్వెస్ట్ పోలీస్ వాచ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తరువాత యూజర్ ఐడీ అడుగుతుంది. గతంలో సెల్‌ఫోన్ కు వచ్చిన సంఖ్యను టైప్ చేయాలి. మనం ఎప్పుడు ఊరికి వెళుతున్నాం, సమయం, తిరిగి వచ్చే తేదీ, సమయం టైప్ చేసి సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇలా పనిచేస్తుంది.. సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్ పూర్తయిన తరువాత ఇంటికి పోలీసు కానిస్టేబుల్ వస్తారు. ఇంట్లో ఆలౌట్ మిషన్ ను పోలి ఉండే ఓ మోషన్ కెమెరాను బిగించిన తరువాత మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోవచ్చు. అప్పటి వరకు కెమెరా పనిచేయదు. ఎప్పుడైతే దొంగ లోనికి ప్రవేశిస్తాడో ఆ కదలికల ద్వారా కెమెరా ఆన్ అవుతుంది. ఒక్కసారి కెమెరా ఆన్ కాగానే జిల్లా ఎస్పీకి, కమాండెంట్ కంట్రోల్ గదిలో అనుసంధానం చేసిన టీవీలోకి లైవ్ ప్రత్యక్షం అవుతుంది. అలారమ్ ద్వారా బ్లూకోట్ పోలీసుల నుంచి ఎస్పీ వరకు అలెర్ట్ చేస్తుంది. ఇక నేరుగా పోలీసులు వచ్చి దొంగను పట్టుకెళుతారు. ఒక వేళ ఇంటి యజమాని సైతం దీన్ని చూడాలనుకుంటే పోలీసులు దానికి తగ్గ ఆప్షన్ ను ఇస్తారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అందుతాయి. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 20న ప్రారంభం.. జిల్లాలో ఊహించని రీతిలో ఈ యాప్‌ను 44 వేల మంది వరకు డౌన్ లోడ్ చేసుకున్నారు. చిత్తూరు నగరంలో 8 వేల మంది వరకు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈనెల 20న ఎస్పీ రాజశేఖర్‌బాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.