ఓ యాప్‌తో మీ ఇల్లు, వస్తువులు సురక్షిం కానున్నాయి. ఇంటికి తాళం వేసి దూర ప్రయాణాలకు వెళ్లేవారు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే పోలీసులు తయారుచేయించిన ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్’ మీ వస్తువులకు రక్షణగా నిలవనుంది. ఇంటి దొంగలకు ముకుతాడు వేసేందుకు ఖాకీలు సన్నద్ధమయ్యారు.
చిలకలూరిపేటటౌన్/చిలకలూరిపేట/పట్నంబజారు(గుంటూరు) /పిడుగురాళ్ళ: జిల్లాలో గత ఏడాది 205 ఇంటి దొంగతనాలు జరిగాయి. 2015లో 216 చోటు చేసుకున్నాయి. వీటిలో చాలా కేసులను పోలీసులు ఛేదించినా ఇప్పటికీ దొంగతనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 141 చోరీలు జరిగాయి. ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నూతంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ (యాప్) ను రూపొందిం చింది. అదే లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్).
వాచ్ రిక్వెస్ట్ ఫామ్‌ని పూర్తి చేయండిలా...
రిజిస్ట్రేషన్ ద్వారా లభించిన యూజర్ ఐడీతో యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏరోజు ఎన్ని గంటలకు ఊరికి వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు.. వంటి వివరాలు నమోదు చేయాలి. వెంటనే రిక్వెస్ట్‌ను అనుమతించినట్లు సందేశం వస్తుం ది. దీంతో ఊరు వెళ్లేలోపు పోలీసులు ఇంటికి చేరుకుని సీసీ కెమెరాలు అమరుస్తారు. దొంగలు ఇంట్లోకి చొరబడగానే కెమెరాల ద్వారా స్టేషన్‌కు సమాచారం అందుతుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పట్టుకుంటారు. దీనికిగాను పోలీసులు ఎలాంటి రుసుమును వసూలు చేయరు.
రిజిస్టర్ ఇలా...
ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారు ముందుగా ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ యాప్‌ను గూగుల్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. అందులో కోరిన వివరాలను పొందుపరచాలి. పేరు, మొబైల్ నంబర్, జిల్లా, టౌన్, డోర్ నంబర్, చిరునామా పట్టికలను సరైన వివరాలతో పూర్తి చేయాలి. ఆ తర్వాత వాటి కిందనే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే పట్టికలు కనిపిస్తాయి. వాటి కింద గూగుల్ లొకేషన్ పాయింట్ సంకేతంతో గెట్ మై లొకేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసే ముందుగా మీ మొబైల్ లొకేషన్‌ను ఆన్‌లో ఉంచుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎవరి ఇంటి నుంచి వారే పూర్తి చేయాలి. లేకపోతే వివరాలు నమోదు కావు.
ఇప్పటి వరకు అనేక రిజిస్ట్రేషన్లు..
యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలోని ప్రధాన ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్లు కూడా అధికంగానే ఉన్నాయి. గుంటూరు అర్బన్ పరిధిలో 545 రిజిస్ట్రేషన్లు కాగా వాటిలో 32 రిక్వెస్ట్ వాచ్‌లు జరిగాయి. అందులో 27 నివాసాల్లో ఎటువంటి ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేసి అర్బన్ పోలీసులు సఫలీకృతం అయ్యారు. మరో నాలుగు కెమెరాలు రన్నింగ్‌లో ఉండగా, మరో నివాసానికి త్వరలో రిక్వెస్ట్ ఆధారంగా బిగించాల్సి ఉంది. అలాగే, గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ఈ విధానాన్ని పిడుగురాళ్ళ, తెనాలి, వినుకొండ, చిలుకలూరిపేట, బాపట్ల, రేపల్లె, నర్సరావుపేట నియోజకవర్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు 4,091 రిజిస్ట్రేషన్లు రాగా, 85 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను సద్వినియోగం చేసుకున్నారు. మరో 5 నివాసాల్లో రన్నింగ్‌లో ఉండగా, నాలుగు భవిష్యత్తులో రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని వినియోగించేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు.
అక్షాంశ, రేఖాంశాలతో సమస్యలు...
లాటిట్యూడ్, లాంగిట్యూడ్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది తికమకపడుతుంటారు. ఇంటి దగ్గర నుంచి వివరాలు నమోదు చేసినా లొకేషన్ సరిగ్గా లేని కారణంగా ఫెయిల్ అని వస్తుంది. ఉదాహరణకు గుంటూరు నగరానికి చెందిన వారైతే.. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి గుంటూరు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ (అక్షాంశ, రేఖాంశాలు) అని టైప్ చేస్తే పక్క చిత్రంలో చూపించిన విధంగా ఫలితం వస్తుంది. వాటిని కాపీ చేసుకుని లేదా గుర్తుంచుకుని తిరిగి యాప్‌ని ఓపెన్ చేసి పొందుపరిస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్) వస్తుంది. దాన్ని ఓటీపీ బాక్స్‌లో సబ్‌మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ విజయవంతం అయినట్లు సంకేతం వస్తుంది. దాంతోపాటు ఆరు అంకెల యూజర్ ఐడీ కూడా వస్తుంది. ఇక మీరు ఎప్పుడు ఊరెళ్లినా యాప్‌ని ఓపెన్ చేసి మీ యూజర్ ఐడీని ఓపెన్‌చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. వెంటనే పోలీసులు మీ ఇంటి గుమ్మం ముందు సీసీ కెమెరాలతో ప్రత్యక్షమౌతారు.
మా లక్ష్యం జీరో ఎఫెన్స్...
ఇంటి దొంగతనాలను నూరు శాతం నియంత్రించి ప్రజల విలువైన వస్తువులకు భద్రత కల్పించడమే మా ధ్యేయం. 2015తో పోల్చుకుంటే 2016లో ఇంటి దొంగతనాలు కొద్దిగా తగ్గాయి. వాటిని జీరో స్థాయికి తీసుకొచ్చేందుకే నూతన యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాం. దొంగతనాలకు పాల్పడే వారిలో అత్యధికులు చెడు వ్యసనాలకు బానిసైన యువతే ఉంటున్నారు. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, సంపన్నులతో పాటు సామాన్యులు సైతం యాప్‌ని వినియోగించుకోవచ్చు. దీని కోసం ప్రజలు మాకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
– సీహెచ్ విజయరావు, అర్బన్ జిల్లా ఎస్పీ; సీహెచ్. వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ