సాక్షి, అమరావతి: దసరా పురస్కరించుకుని పిల్లలకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేందుకు దాదాపు అందరూ సమాయత్తమవడం సహజం. ఇదే అదనుగా దొంగలు తమ చేతికి పని చెప్పేందుకు రెడీ అయ్యే అవకాశముండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇళ్లు వదిలి వెళ్లేవారు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే తాము ఒక కంట (సీసీ కెమెరా ద్వారా) కనిపెట్టే వీలుంటుందంటున్నారు. రోజుల తరబడి యజమానులు ఇళ్లలో లేకపోతే చోరీలు జరిగే ప్రమాదాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా సమాచారం ఇచ్చే వారి ఇళ్లకు పోలీసులు ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎల్‌హెచ్‌ఎంఎస్) పరికరాన్ని అమరుస్తున్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు ఆదరణ
రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన ఈ ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానం కొన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు ఇచ్చింది. వైఎస్సార్ కడప, కర్నూలు, తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరంలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. మిగిలిన జిల్లాల్లోను దీనిని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, దీన్ని విస్తృతంగా అమలుచేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉంది. తొలుత వీధుల్లో ఏర్పాటుచేసే సీసీ కెమెరాలను ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్ చేసేలా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.
ఆ తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా వీటిని ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించేందుకు దశల వారీ కార్యాచరణ చేపట్టనున్నారు.
ప్రజలు కూడా సమకూర్చుకోవాలి
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ కోసం 8,37,469 విజ్ఞాపనలు వచ్చాయి. వాటిలో 3,91,793 విజ్ఞప్తులను పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. తొలి ప్రయత్నంగా 25,152 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చగలిగారు. పరికరాల కొరతే ఇందుకు ప్రధాన కారణం. అదే ప్రజలు వీటిని సమకూర్చుకుని పోలీసులకు సమాచారమందిస్తే పోలీసులు ఆ ఇల్లు లేదా కార్యాలయంపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతారని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఒకవేళ పరికరాలను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఉంటే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
సీసీ కెమెరాలతో నిఘా
ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ఆ కేసును సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదిస్తున్నారు. క్లిష్టమైన కేసుల్లో సైతం నేర పరిశోధనలో ఆధారాలు అందిస్తున్నది ఇవే. అందుకే పోలీసులు బహిరంగ ప్రదేశాలు, జన సంచారం ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆలయాలు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలతోపాటు పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఇప్పుడు వీటిని ఇంతటితో సరిపెట్టకుండా యజమానులు లేని ఇళ్లకూ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఊరెళ్తే ఇలా చేయండి..
1.ఎవరైనా కొద్దిరోజులపాటు తమ ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
2.పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్‌హెచ్‌ఎంఎస్ యూనిట్ అమర్చుతారు.
3.తాళం వేసినఆ ఇంట్లోకిఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అలారంతో కూడిన సంకేతాలు వెళ్తాయి.
4.పోలీసులు వెంటనే అప్రమత్తమైఏ ఇంట్లో అపరిచితులు చొరబడ్డారో గుర్తించి క్షణాల్లో వారిని పట్టుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment