పాత గుంటూరులో పోలీస్ నిఘాలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన దొంగ (ఫైల్)
పాత గుంటూరుకు చెందిన ఓ కుటుంబం అంతా కలసి గత ఏడాది నవంబరులో చెన్నైలో బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏర్పాటు చేసి వెళ్లారు. అయితే, వారు వెళ్లిన రెండు రోజుల తర్వాత ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు తాళ్లూరి దేవయ్య చోరీకి యత్నించాడు. కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తమై నిమిషాల వ్యవధిలో వెళ్లి అతడిని అరెస్టు చేశారు.
గుంటూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళుతున్నారా...అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించక తప్పదు...రెండు రోజుల్లో వస్తాం కదా..అంటూ నిర్లక్ష్యంగా ఇంటికి తాళాలు వేసి వెళ్లారంటే దొంగలకు అవకాశం ఇచ్చినట్టే. విలువైన వస్తువులు, నగదు ఇంట్లో బీరువాలో భద్రపరిచాం అనుకుంటే పొరపాటు పడ్డట్టే..తీరా దొంగలు దోచుకువెళ్లాక లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. అదమరిస్తే అంతే సంగతి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పండుగలు, శుభకార్యాలు, విహారయాత్రలు ప్రయాణం ఎక్కడికైనా కావచ్చు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ కలసి బయటకు వెళ్లే సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పోలీసులు కాపాలా కాస్తారులే అనుకుంటే పొరపాటే అవుతుంది. పోలీసుల కదలికలను గమనిస్తూ చోరీలకు పాల్పడే దొంగలు మరింత జాగ్రత్తలు పాటిస్తారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, ఇంటి దస్తావేజులు, నగదును బ్యాంకు లాకర్లోనే భద్రపరుచుకోవాలి. ఊరెళ్లుతున్న విషయాన్ని ఇంటి పక్కల వారికి తెలియజేయాలి. ఎప్పుడు వెళ్లేది..ఎప్పుడు తిరిగి వస్తాం అనే విషయాలను కూడా తెలియజేస్తే మరీ మంచిది. ఎందుకంటే వారు కూడా పరిశీలిస్తూ ఉంటారు. అవకాశం ఉంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి వెనుక వైపు, ప్రధాన ద్వారాలకు సెంటర్ లాకింగ్ ఉంటే వాటిని ధ్వంసం చేయడం కష్టం. చోరీలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌నువినియోగించుకోవాలి
జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న పోలీస్ సేవలను వినియోగించుకోవడం మరచిపోకూడదు. ఆన్‌లైన్‌లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ల(ఎల్‌హెచ్‌ఎంఎస్) యాప్‌ను మన దగ్గర ఉండే టచ్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో రిజస్ట్రేషన్ నమోదు చేయించుకుంటే ఊరు వెళ్లే సమయంలో రిక్వెస్ట్ పంపాలి. వెంటనే పోలీసులు ఇంటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తుంటారు. ఎవరైనా చోరీకి యత్నిస్తే నిమిషాల వ్యవధిలో ఇట్టే అరెస్టు చేస్తారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌తో నిఘా
ఇంటికి తాళం వేసి ప్రయాణాలు చేయాల్సి వచ్చిన సమయంలో తప్పనిసరిగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోండి. తద్వారా స్థానిక పోలీసులతో పాటు నిరంతర నిఘా ఉంటుంది. మీ ఇంటికి భద్రత ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను వెంటనే ఆరెస్టు చేసి చోరీలు జరగకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. –సీహెచ్. విజయారావు, అర్బన్ ఎస్పీ
ఎల్‌హెచ్‌ఎస్‌తో జియో ట్యాగింగ్
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు లాక్డ్ హౌస్ సర్వైలైన్స్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎస్)ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా సమాచారం ఇవ్వకుండా ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి నిరంతరం సిబ్బంది పహారా కాస్తుంటారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులు అటువైపు వెళ్లినా ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. –ఎస్.వి.రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment