వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న బాధితులు
బొమ్మలసత్రం: వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణం తీసింది. తల్లికి కడుపుకోత మిగిల్చింది.అలస్యంగా వెలుగుచూసిన ఈ విషాద సంఘటన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల మేరకు.. గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి ఖాజాహుస్సేన్‌కు గతేడాది ఏప్రిల్‌లో శిరివెళ్ల మండలం వనికిన్‌దిన్నె గ్రామానికి చెందిన షేక్ సోనితో వివాహమైంది. ఈయన మిలటరీలో ఎ సీసీ ఆఫీసర్ కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యకు నెలలు నిండటంతో ఇటీవల పుట్టింటికి పంపాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానిక శిరివెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
కడుపులో బిడ్డ 3 కేజీలకు పైగా ఉండటంతో సాధారణ కాన్పుకు ఇబ్బందిగా మారింది. సమస్య తీవ్రతను బట్టి వెంటనే సిజెరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన వైద్యులు తాత్సారం చేశారు. శనివారం ఉదయం 12 గంటలకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఉమ్మునీరు తాగటంతో బిడ్డ పరిస్థితి కాస్త విషమంగా ఉందని మొదట చెప్పిన వైద్యులు.. సాయంత్రం 4 గంటల సమయంలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చేర్పించినప్పుడే వైద్యులు స్పందించి కాన్పు చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని..దీనికి వారి నిర్లక్ష్యమే కారణమని ఖాజాహుస్సేన్ ఆరోపిస్తూ ఆదివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని సోని బంధువులు ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు.
సంఘటనపై విచారణ
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందాడని ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆర్‌ఎంఓ శేషారత్నం వెల్లడించారు.–శేషారత్నం, ఆర్‌ఎంఓ
Comments
Please login to add a commentAdd a comment