సీఐ ప్రభాకర్ గౌడ్‌కు పసి బిడ్డను అప్పగిస్తున్న 1098 సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు
అనంతపురం ,గుత్తి : అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడబిడ్డ ఆలయం వద్ద కనిపించింది. గుక్కపట్టి ఏడుస్తుండటంతో అటుగా వచ్చిన ఆటోడ్రైవర్ అక్కున చేర్చుకున్నాడు. ఐసీడీఎస్– పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఐదు రోజుల అనంతరం పసికందును శిశుగృహకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని జెడ్ వీరారెడ్డి కాలనీకి చెందిన జావెద్ ఆటోడ్రైవర్. గత శుక్రవారం గుత్తి – అనంతపురం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వైపు ఆటోలో వెళుతుండగా పసిపాప ఏడుపు వినిపించింది. ఆటో ఆపి గాలించగా.. ఓ చోట ఆడశిశువు కనిపించింది. పాపను ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం గాలించాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు.
అప్పటికే అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయినా ఆ పాపను మనమే పెంచుకుందామని భార్య ఆయేషా కోరడంతో జావెద్ సరేనన్నాడు. బుధవారం కాలనీలోని అంగన్‌వాడీ కార్యకర్త సుబ్బరత్నకు విషయం తెలిసింది. వెంటనే 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారమిచ్చింది. 1098 కో–ఆర్డినేటర్ బాలాజీ, సభ్యులు రామకృష్ణ, అశ్వనిలు జెడ్ వీరారెడ్డి కాలనీకి వెళ్లి జావెద్, ఆయేషా దంపతుల వద్ద ఉన్న ఆడశిశువును తీసుకుని పోలీసు స్టేషన్‌లో సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్‌ఐ చాంద్‌బాషాకు అప్పగించారు. పోలీసులు ఆ శిశువును ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదమ్మ ద్వారా అనంతపురంలోని శిశుగృహకు తరలించారు. పట్టుమని పది రోజుల వయసు కూడా లేని పసిబిడ్డను అలా వదిలేయడానికి ఎవరికి మనసు వచ్చిందోనంటూ ప్రజలు శాపనార్థాలు పెట్టారు.