రాజాం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకుల్లో నాణ్యత కనిపించడం లేదు. మొన్నటివరకూ పురుగులు పట్టిన, కుళ్లిన గుడ్లు వడ్డించగా.. ఇప్పుడు బియ్యంలోనూ నాణ్యత లోపిస్తోంది. ప్రతి నెల మిగులు బియ్యం, పురుగుల బియ్యం, ధాన్యం గింజల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అక్టోబర్‌కు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఇదే తరహా బియ్యాన్ని అందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో వంట నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క మధ్యాహ్న భోజనంలో నాణ్యత నానాటికీ లోపిస్తుండటంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థులు అనాసక్తి
ప్రభుత్వ పాఠశాలలో ఎండీఎంకు సంబం« దించి విద్యార్థుల్లో ఆసక్తి రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పాఠశాలలకు అందిస్తున్న గుడ్లలో నాణ్యత లేకపోవడంతో పాటు పురుగులు పట్టిన వాటిని కూడా సరఫరా చేస్తున్నారు. వీటికి తోడు ప్రస్తుతం బియ్యంలో కూడా నాణ్యత లోపించడంతో పాఠశాలల్లో సగం మంది ఎండీఎం భోజనాలపై అనాసక్తి చూపుతున్నారు. చాలా మంది విద్యార్థులు పురుగులు, ధాన్యం ఉన్న భోజనం చేయలేక ఇంటిముఖం పడుతున్నారు.
జిల్లాలో 2.20 లక్షల మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 3165 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,356 ప్రభుత్వ ప్రాథమిక, 430 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు, 379 జెడ్పీ హైస్కూల్‌లు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయిలో 1,15, 267 మంది, ఉన్నత స్థాయిలో 1,05,118 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థికి రోజుకు వంద గ్రాముల బియ్యం, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థికి రోజుకు 150 గ్రాముల బియ్యాన్ని వండిపెట్టి భోజనం వడ్డించాలి. జిల్లాలో రోజుకు 2.79 టన్నుల బియ్యం వీరి నిమిత్తం వెచ్చిస్తున్నారు. అయితే చాలా మంది ఈ ఎండీఎంపై అనాసక్తిని చూపుతున్నారు. దీంతో చాలా పాఠశాలల్లో ఈ భోజనానికి సంబంధించిన బియ్యం మిగిలిపోతున్నాయి.
నాణ్యత లేకుంటే మార్చవచ్చు
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి సరఫరా అవుతున్న బియ్యంలో నాణ్యత లేకుంటే వాటిని తిరిగి ఆయా పాఠశాలల పరిధిలోని రేషన్ డిపోలకు, డీలర్లకు, తహసీల్దార్ కార్యాలయాలకు తిరిగి ఇచ్చేయవచ్చు. నాణ్యతతో కూడిన బియ్యాన్ని మాత్రమే ఎండీఎంలో వండాలి. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పర్యవేక్షణ చేయాలి. గుడ్లు బాగోలేని అంశంపై దృష్టిసారించాం. నాణ్యత ప్రమాణాలు పాటించాలని పంపిణీదారులకు సూచించాం.
– ఐ. వెంకటరావు, డిప్యూటీ ఈఓ, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment