బడుగులపై లాజిస్టిక్ !
లాజిస్టిక్ పార్కు ట్రెంచ్ పనులు
అడ్డుకునేందుకు యత్నించిన పేదలు
ఆందోళనకారులపై లాఠీచార్జి
200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉపాధి కోసం...భవిష్యత్‌పై భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్న బడుగులపై లాఠీ విరిగింది... కడుపు మంటతో ఆందోళనకు దిగిన అభాగ్యులపై పోలీ సులు తమ ప్రతాపం చూపించారు... తమకు న్యాయం చేయాలని వల్లూరులో ఆందోళనకు దిగిన భూమిలేని నిరుపేదలపై ఒక్కసారిగావిరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేశారు... దొరికినవారిని దొరికినట్టు దౌర్జనంగా వ్యాను లో ఎక్కించి అక్కడినుంచి తరలిం చారు. ఇద్దరు మహిళలు స్ఫృహతప్పి పడిపోగా, మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో వల్లూరులో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి.
అనకాపల్లి:అనకాపల్లి మండలంలోని వల్లూరు రెవెన్యూ పరిధిలో 286 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ ద్వారా రంగం సిద్ధమైంది ఢీ-పట్టా, 4(సీ), ఆక్రమిత భూములుగా విభజించి మూడు కేటగిరీలలో నష్టపరిహారాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం నష్టపరిహారం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యే దశలో ఉండగా, ఏ భూమి లేని రెండువందల మంది తమను కూడా ఆదుకోవాలని కోరుతూ పోరాటం ప్రారంభించారు. కొప్పాక హైవేపై దీక్షలు, తహశీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రాలను సమర్పించినా ఫలితంలేకపోయింది. దీంతో పదిరోజుల క్రితం తహశీల్దార్‌ను ముట్టడించారు. నాలుగు రోజుల క్రితం ఎరుకువానిపాలెం రహదారిలో తహశీల్దార్‌ను అడ్డుకొని న్యాయం చేయమని వేడుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం సోమవారం ఆర్డీవో సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ఎటువంటి నష్టపరిహారం రాదని ప్రకటించారు. అయినా ఆశ వీడని 200 మంది వల్లూరు లాజిస్టిక్ పార్కు బాధితులు... మంగళవారం చేపట్టిన ట్రెంచ్ పనుల్ని అడ్డుకోబోయారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు రూరల్ సీఐ నేతృత్వంలోని 150 మంది పోలీసులు ఆందోళన కారులపై విరుచుకుపడ్డారు.
మహిళలున్నారని కూడా చూడకుండా విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేశారు. ఆయా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దొరికినవారిని దొరికినట్టు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో ఎక్కించి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో పాల్గొన్న వల్లూరు, గొర్లెవానిపాలెం, రాజుపాలెం, ఎరుకువానిపాలెం వాసులను అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
గ్రామీణపోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గైపూరి పైడితల్లమ్మ , కసిరెడ్డి సన్యాసమ్మలు స్ఫృహతప్పి పడిపోవడంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురై ఎమ్మెల్యే పీలా గోవింద, తహశీల్దార్ భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలుచేశారు. సృ్పహతప్పి పడిపోయిన మహిళల్ని వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.