
గౌతమీ పుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ
క్రిష్ దర్శకత్వంలో అమరావతిపై చరిత్రాత్మక సినిమా
హైదరాబాద్: అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా ఒక చారిత్రక సినిమా త్వరలోనే తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి కథ, కథనం తదితర అంశాలపై ప్రాథమిక కసరత్తు పూర్తయి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శాతవాహన చక్రవర్తుల్లో ప్రసిద్ధిగాంచిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరిట ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణ కొంతమంది ఎమ్మెల్యేలు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సందర్భంలో సినిమాల ప్రస్తావనకు వచ్చినపుడు ఈ అంశాలను వివరించారు. దీంతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కథ సిద్ధమైందని తెలిపారు.
‘రైతు’ కథాంశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు. అమావాస్య అనంతరం మంచి ముహూర్తం చూసుకొని వీటిలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని బాలకృష్ణ వివరించారు. ఈ రెండింటిలో ఏ చిత్రం ముందుగా ప్రారంభించాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.
వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ అరంగేట్రం...
తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగం అరంగేట్రానికి ఇంకా సమయం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడగ్గా ఇంకా నిర్ణయించలేదన్నారు. మోక్షజ్ఞతో కలిసి ఈ సినిమా చేయాలన్నది తన అభిప్రాయమన్నారు. జాతకరీత్యా మోక్షజ్ఞకు వచ్చే ఏడాది నుంచి బాగుందని అప్పుడే తన సినీ అరంగేట్రంపై నిర్ణయం ఉంటుందన్నారు.