బాలరాజు తెలంగాణం
- అసెంబ్లీలో విభజనవాదం వినిపించిన మంత్రి
- రగిలిపోతున్న సమైక్యవాదులు
- తగినపాఠం చెబుతామంటూ హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పాడేరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజుపై నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బాల రాజు తెలం‘గాణం’ వినిపించారు. తాను విభజనకు అనుకూలమని పాతపల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం జిల్లావాసుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది.
సమైక్య ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో నియోజక వర్గ ప్రజల అభీష్టం పేరిట బాలరాజు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బాలరాజుకు టీఆర్‌ఎస్ శాసనసభ్యులు మద్దతు పలకడం విశాఖ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల కంటే పదవికే బాలరాజు అధిక ప్రాధాన్యతనిచ్చి మాట్లాడారంటూ నగరంలోని ఎంపీపీ డబుల్ రోడ్ జంక్షన్‌లో సమైక్యవాదులు బుధవారం రాత్రి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
గతంలో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో పార్టీని ధిక్కరించి రెండు పర్యాయాలు రెబల్‌గా బరిలోకి దిగి క్రమశిక్షణ చర్యలకు గురైన ఈ గిరిజనమంత్రి తాజాగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమనడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఇక్కడి సమైక్యవాదులు దుయ్యపడుతున్నారు. బాలరాజు తన ప్రత్యేక తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్రా విద్యార్ధి జేఏసీ హెచ్చరించింది.
ఐఏ ఎస్ పదవిని వదులుకొని ఇటీవల పార్టీలో చేరిన కొప్పుల రాజు సూచనల మేరకే బాల రాజు తెలంగాణకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాటి సంఘటన బలం చేకూర్చింది. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బాలరాజు ఆ ప్రాంతానికి వలసపోవడం మంచిదని, ఆయన క్షమాపణ చెప్పి సమైక్యం అనకుంటే రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని సమైక్యాంధ్రా రాజకీయ ఐకాస నేత జేటీ రామారావు ఒక ప్రకటనలో హెచ్చరించారు.