state Division of the bill
-
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు
రాష్ట్రపతికి విన్నవించిన ఉండవల్లి జగన్ దీక్షను అధికార పార్టీ వాడుకోవాలి హోదా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు నివేదికతో కుట్ర మీడియాతో అరుణ్ కుమార్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్రెడ్డి దీక్ష చేసినా, చంద్రబాబు చేసినా అది రాష్ట్రం కోసమే చేస్తున్నందున సఫలం కావాలనే తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన బిల్లుకు సంబంధించి బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. ‘ద క్వశ్ఛన్ ఈజ్ వెదర్ ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్‌సభ ఆన్ 18.02.2014?’ అనే శీర్షికన తాను ప్రచురించిన బుక్‌లెట్‌ను వినతిపత్రానికి జత చేసినట్టు చెప్పారు. లోక్‌సభలో విభజన బిల్లు పాసవకుండానే పాసయినట్టు ప్రకటించారని, ఆధారాలు సహా రాష్ట్రపతికి ఇచ్చానని తెలిపారు. ఎవరు దీక్ష చేసినా సఫలం కావాలి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదాపై చేస్తున్న దీక్ష గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ‘జగన్మోహన్రెడ్డి దీక్షను అధికార పార్టీ తమకు అనుకూలంగా వాడుకోవాలి’ అని ఉండవల్లి అన్నారు. అధికారంలోకి వస్తే బీజేపీ ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తామన్నదని, ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కావడం లేదన్నారు. ‘ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా చేయడం కోసం ఇంకో పెద్ద కుట్ర జరిగింది. వరల్డ్ బ్యాంకు ప్రకటించినట్టుగా.. పరుగెత్తికెళ్లి పెట్టుబడి పెట్టాలంటే ఒకటి గుజరాత్, రెండోది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. రాష్ట్రం వచ్చాక ఒక్క పరిశ్రమన్నా రాలేదు. సీమాంధ్రులకు చెందిన ఒక్క పెద్ద పరిశ్రమ తెలంగాణ నుంచి రావడానికి సిద్ధంగానైనా లేదు. అలాంటప్పుడు ఈ ర్యాంకు ఎలా వచ్చిందని ఆరా తీస్తే.. ఈ సర్వే చేసింది ప్రపంచ బ్యాంకు కాదు. కేపీఎంజీ వాళ్లను నరేంద్ర మోదీ అడిగారట. 98 ప్రశ్నలు రూపొందించి సర్వే చేశారట. వాటికి జవాబు ఇవ్వడంలో నిపుణులం కాబట్టి.. మనం ముందున్నాం. ఇక్కడ మనకు రెండో స్థానం ఎందుకు వచ్చిందంటే.. మోదీ చేయించుకున్నారు కాబట్టి గుజరాత్ ఫస్ట్ వచ్చింది. ఈ ర్యాంకును చూపించి ఆనందపడుతున్నాం. జగన్ దీక్ష చేసినా, చంద్రబాబు దీక్ష చేసినా.. అది రాష్ట్రం కోసమే చేస్తున్నారు కాబట్టి.. సఫలం కావాలనే కోరుకుంటున్నా..’ అని ఉండవల్లి పేర్కొన్నారు. -
‘దేశం’ కోటలకు బీటలు
‘ఫ్యాన్’గాలికి ‘సైకిల్’ కకావికలం ముదురుతున్న వర్గవిభేదాలు తన్నుకుంటున్న తమ్ముళ్లు! ‘కోనేరు’ మెజారిటీపై టీడీపీ నాయకుల పందేలు! బాబుకు నివేదిక ఇచ్చిన నేతలు జిల్లాలో టీడీపీ కోటలకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీలో నెలకొన్న వర్గవిభేదాల కారణంగా ‘సైకిల్’ కదల్లేకపోతోంది. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. ఇదే విషయం తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లోనూ తేలింది. సాక్షి, విజయవాడ : టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని, రెండు ఎంపీ సీట్లను కోల్పోవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలు సైతం ‘ఫ్యాన్’ గాలిలో ఎదురీత తప్పట్లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆ నివేదికను జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు తనను సానుభూతి గట్టెక్కిస్తుందని పెద్దగా ప్రచారం చేయడం లేదని ఆ నేతలు గుర్తించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ గెలుస్తారని, ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే విషయంపై టీడీపీ నేతలే జోరుగా పందేలు కడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీటు కోసం జరిగిన రగడ, ఆ తర్వాత పరిణామాలతో కేశినేని నానికి సొంత పార్టీలోని నేతలే సహకరించడం లేదని స్పష్టంచేశారు. - పెనమలూరులో తన్నులాట పెనమలూరులో వర్గపోరు రోడ్డున పడింది. ద్వితీయశ్రేణి నాయకులు అభ్యర్థుల ముందే తన్నుకుంటున్నారు. బోడే ప్రసాద్‌కు సీటు దక్కడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ తనకు ఇంకెక్కడైనా బాధ్యతలు ఇప్పించాలని చంద్రబాబును కోరారు. హిందూపురంలో పోటీ చేస్తున్న బాలకృష్ణకు సహకరించేందుకు ఆయన వెళ్లిపోయూరు. చలసాని పండు వర్గం కూడా సహాయ నిరాకరణ చేస్తోంది. మరోవైపు ఆదివారం రాత్రి తెలుగు తమ్ముళ్లు కాటూరులో ‘నువ్వెంత.. అంటే నువ్వెంత..’ అంటూ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ ఎదుటే తన్నుకున్నారు. దీంతో ఒక వర్గం పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. - మైలవరంలో ఎదురీత మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరావు పూర్తి వెనకంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ నుంచి రెండోసారి బరిలోకి దిగిన ఆయనకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు చంద్రబాబుకు నివేదికలు వెళ్లాయి. దీంతో ఉమ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపి గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పనులు చేపట్టటంలో విఫలమయ్యారనే అభిప్రాయంతో ఉన్న ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశాల్లో ప్రచారం కోసం ఆరాటపడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలారనే విమర్శలు వినపడుతున్నాయి. - ‘పేట’లోనూ అదే తంతు..! జగ్గయ్యపేట నియోజకవర్గంలో రెండోసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా ఎదురీతలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన కనపడతోంది. సొంత వ్యాపారాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారం వైపు చూపకపోవడంతో ప్రజల్లో తాతయ్యపై వ్యతిరేకత పెరిగింది. - నందిగామలో వెన్నుపోటుకు సిద్ధం! నందిగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కూడా కష్టాల్లో పడినట్లు సమాచారం. అనారోగ్యం కారణం చూపించి తంగిరాలకు సీటు రాకుండా దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తారుు. పైకి కలిసి పనిచేస్తున్నా.. తంగిరాలకు వెన్నుపోటు పొడవడానికి ఉమా వర్గం సిద్ధమైంది. - గన్నవరంలో ఏకమైన వంశీ ప్రత్యర్థులు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వంశీని సొంత పార్టీ నేతలే ఓడించే పనిలో నిమగ్నమయ్యూరు. ఆయన వ్యతిరే కులంతా ఏకమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు వర్గం సహాయ నిరాకరణ చేయడమేకాకుండా ఓడించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. - అవనిగడ్డలో వర్గపోరు అవనిగడ్డ నియోజకవర్గంలో వర్గపోరు వల్ల టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ బాగా వెనకంజలో ఉన్నారు. బుద్ధప్రసాద్ చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. దీంతో పార్టీ శ్రేణులు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ సీటు ఆశించిన కంఠమనేని రవిశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకున్నా అంటీముట్టనట్లు ఉండటమే కాకుండా మండలి ఓటమికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క కాంగ్రెస్ నేతలు మండలి వెంటరాకపోవడం.. మరోపక్క టీడీపీ నేతలు సహకరించకపోవడంతో మండలి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - బందరులో కొరవడిన సమన్వయం మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు, కొల్లు రవీంద్రకు మధ్య సమన్వయం కొరవడింది. దీంతో ఇరువురు నేతల మధ్య ద్వితీయ శ్రేణి నాయకులు నలిగిపోతున్నారు. -
విభజన బిల్లు ఆపకుంటే కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్లే
పుంగనూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆపకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన పుంగనూ రు మండలంలోని ఒంటిమిట్ట గ్రామం లో గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనతో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటాయని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన చెందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లు పెడితే రాజీ నామా చేస్తానని గొప్పలు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పదవి కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్‌రెడ్డికి చంద్రబాబు ప్రత్యక్షంగా మద్దత్తు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకాల రాయుడులిద్దరూ తెలుగు ప్రజలను మోసగిస్తూ పబ్బం కడుపుతున్నారని, వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్మోహన్రెడ్డి పోరా టం చేస్తున్నారని తెలిపారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు అమ లు కావాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడ్డి యాదవ్, అమరనాథరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మదనపల్లె బాబ్జాన్, అక్కిసా ని భాస్కర్‌రెడ్డి, నాగరాజరెడ్డి, సుబ్బ మ్మ, హేమావతి, షకీలా తదితరులు పాల్గొన్నారు. -
బాలరాజు తెలంగాణం
అసెంబ్లీలో విభజనవాదం వినిపించిన మంత్రి రగిలిపోతున్న సమైక్యవాదులు తగినపాఠం చెబుతామంటూ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పాడేరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజుపై నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బాల రాజు తెలం‘గాణం’ వినిపించారు. తాను విభజనకు అనుకూలమని పాతపల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం జిల్లావాసుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. సమైక్య ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో నియోజక వర్గ ప్రజల అభీష్టం పేరిట బాలరాజు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బాలరాజుకు టీఆర్ఎస్ శాసనసభ్యులు మద్దతు పలకడం విశాఖ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల కంటే పదవికే బాలరాజు అధిక ప్రాధాన్యతనిచ్చి మాట్లాడారంటూ నగరంలోని ఎంపీపీ డబుల్ రోడ్ జంక్షన్లో సమైక్యవాదులు బుధవారం రాత్రి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గతంలో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో పార్టీని ధిక్కరించి రెండు పర్యాయాలు రెబల్‌గా బరిలోకి దిగి క్రమశిక్షణ చర్యలకు గురైన ఈ గిరిజనమంత్రి తాజాగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమనడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఇక్కడి సమైక్యవాదులు దుయ్యపడుతున్నారు. బాలరాజు తన ప్రత్యేక తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్రా విద్యార్ధి జేఏసీ హెచ్చరించింది. ఐఏ ఎస్ పదవిని వదులుకొని ఇటీవల పార్టీలో చేరిన కొప్పుల రాజు సూచనల మేరకే బాల రాజు తెలంగాణకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాటి సంఘటన బలం చేకూర్చింది. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బాలరాజు ఆ ప్రాంతానికి వలసపోవడం మంచిదని, ఆయన క్షమాపణ చెప్పి సమైక్యం అనకుంటే రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని సమైక్యాంధ్రా రాజకీయ ఐకాస నేత జేటీ రామారావు ఒక ప్రకటనలో హెచ్చరించారు.