‘దేశం’ కోటలకు బీటలు
- ‘ఫ్యాన్’గాలికి ‘సైకిల్’ కకావికలం
- ముదురుతున్న వర్గవిభేదాలు
- తన్నుకుంటున్న తమ్ముళ్లు!
- ‘కోనేరు’ మెజారిటీపై టీడీపీ నాయకుల పందేలు!
- బాబుకు నివేదిక ఇచ్చిన నేతలు
జిల్లాలో టీడీపీ కోటలకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీలో నెలకొన్న వర్గవిభేదాల కారణంగా ‘సైకిల్’ కదల్లేకపోతోంది. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. ఇదే విషయం తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లోనూ తేలింది.
సాక్షి, విజయవాడ : టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని, రెండు ఎంపీ సీట్లను కోల్పోవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలు సైతం ‘ఫ్యాన్’ గాలిలో ఎదురీత తప్పట్లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆ నివేదికను జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు సమర్పించినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్‌లో గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు తనను సానుభూతి గట్టెక్కిస్తుందని పెద్దగా ప్రచారం చేయడం లేదని ఆ నేతలు గుర్తించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ గెలుస్తారని, ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే విషయంపై టీడీపీ నేతలే జోరుగా పందేలు కడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీటు కోసం జరిగిన రగడ, ఆ తర్వాత పరిణామాలతో కేశినేని నానికి సొంత పార్టీలోని నేతలే సహకరించడం లేదని స్పష్టంచేశారు.
- పెనమలూరులో తన్నులాట
పెనమలూరులో వర్గపోరు రోడ్డున పడింది. ద్వితీయశ్రేణి నాయకులు అభ్యర్థుల ముందే తన్నుకుంటున్నారు. బోడే ప్రసాద్‌కు సీటు దక్కడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ తనకు ఇంకెక్కడైనా బాధ్యతలు ఇప్పించాలని చంద్రబాబును కోరారు. హిందూపురంలో పోటీ చేస్తున్న బాలకృష్ణకు సహకరించేందుకు ఆయన వెళ్లిపోయూరు. చలసాని పండు వర్గం కూడా సహాయ నిరాకరణ చేస్తోంది. మరోవైపు ఆదివారం రాత్రి తెలుగు తమ్ముళ్లు కాటూరులో ‘నువ్వెంత.. అంటే నువ్వెంత..’ అంటూ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ ఎదుటే తన్నుకున్నారు. దీంతో ఒక వర్గం పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
- మైలవరంలో ఎదురీత
మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరావు పూర్తి వెనకంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ నుంచి రెండోసారి బరిలోకి దిగిన ఆయనకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు చంద్రబాబుకు నివేదికలు వెళ్లాయి. దీంతో ఉమ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపి గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పనులు చేపట్టటంలో విఫలమయ్యారనే అభిప్రాయంతో ఉన్న ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశాల్లో ప్రచారం కోసం ఆరాటపడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలారనే విమర్శలు వినపడుతున్నాయి.
- ‘పేట’లోనూ అదే తంతు..!
జగ్గయ్యపేట నియోజకవర్గంలో రెండోసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా ఎదురీతలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన కనపడతోంది. సొంత వ్యాపారాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారం వైపు చూపకపోవడంతో ప్రజల్లో తాతయ్యపై వ్యతిరేకత పెరిగింది.
- నందిగామలో వెన్నుపోటుకు సిద్ధం!
నందిగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కూడా కష్టాల్లో పడినట్లు సమాచారం. అనారోగ్యం కారణం చూపించి తంగిరాలకు సీటు రాకుండా దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తారుు. పైకి కలిసి పనిచేస్తున్నా.. తంగిరాలకు వెన్నుపోటు పొడవడానికి ఉమా వర్గం సిద్ధమైంది.
- గన్నవరంలో ఏకమైన వంశీ ప్రత్యర్థులు
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వంశీని సొంత పార్టీ నేతలే ఓడించే పనిలో నిమగ్నమయ్యూరు. ఆయన వ్యతిరే కులంతా ఏకమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు వర్గం సహాయ నిరాకరణ చేయడమేకాకుండా ఓడించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది.
- అవనిగడ్డలో వర్గపోరు
అవనిగడ్డ నియోజకవర్గంలో వర్గపోరు వల్ల టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ బాగా వెనకంజలో ఉన్నారు. బుద్ధప్రసాద్ చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. దీంతో పార్టీ శ్రేణులు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ సీటు ఆశించిన కంఠమనేని రవిశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకున్నా అంటీముట్టనట్లు ఉండటమే కాకుండా మండలి ఓటమికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క కాంగ్రెస్ నేతలు మండలి వెంటరాకపోవడం.. మరోపక్క టీడీపీ నేతలు సహకరించకపోవడంతో మండలి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
- బందరులో కొరవడిన సమన్వయం
మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు, కొల్లు రవీంద్రకు మధ్య సమన్వయం కొరవడింది. దీంతో ఇరువురు నేతల మధ్య ద్వితీయ శ్రేణి నాయకులు నలిగిపోతున్నారు.