ఎగ్జిట్, ఒపినీయన్ పోల్స్ పై నిషేధం: భన్వర్ లాల్
హైదరాబాద్: ఓటర్ స్లిప్ లేకున్నా సరైన గుర్తింపు కార్డ్ ఉంటే చాలు ఓటు వేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎగ్జిట్ , ఓపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాం అని భన్వర్‌లాల్ అన్నారు. స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కంపెనీలు, వ్యాపారసంస్థలు పోలింగ్ రోజును భత్యంతో కూడిన సెలవుదినాన్ని ప్రకటించాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రంలోని 2వ దశ పోలింగ్‌లో అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు...కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు.
మిగతా 165 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు. ఓటరు లిస్ట్‌లో పేరుంటే 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకటి చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు. ఫిర్యాదులేమనై ఉంటే 1950కి ఫోన్ చేయాలని.. ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్నని ఆయన తెలిపారు.
ఏపీలలో 25 ఎంపీ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 మంది బరిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు మొత్తం 40,708 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం ఓటర్లు 3,67,62,975 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని భన్వర్ లాల్ తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని.. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ తెలిపారు.