మచిలీపట్నం : బందరు పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా కేంద్రాలను మునిసిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఈ మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. దేశంలోనే రెండో పురపాలక సంఘంగా మచిలీపట్నానికి పేరుంది. 1866వ సంవత్సరంలోనే ఈ పురపాలక సంఘం ఏర్పడింది. అప్పట్లో విజయవాడ గ్రామపంచాయతీగా ఉండేది. అప్పట్లో బ్రిటీష్ పాలకులు మచిలీపట్నం నుంచే పరిపాలన కొనసాగించే వారని చరిత్ర చెబుతోంది. ఫ్రెంచ్, డచ్, బ్రిటీష్ పాలకులు ఇక్కడి నుంచే పరిపాలనను కొనసాగించారు. తాజాగా రాష్ట్రంలో మచిలీపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం మునిసిపాల్టీలను కార్పొరేషన్లుగా మార్చడానికి పురపాలకశాఖ కసరత్తు ప్రారంభించింది.
కార్పొరేషన్‌గా మారితే కేంద్ర ప్రభుత్వ నిధులు
మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా మారిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,70,008 మంది జనాభా ఉన్నారు. కార్పొరేషన్‌గా మార్చాలంటే అర్బన్‌ప్లానింగ్, టౌన్‌ప్లానింగ్, భూమి, భవనాల నిర్మాణాలపై నియంత్రణ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. రోడ్లు, వంతెనలు, నీటి సరఫరా, పారిశ్రామికాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.
విభాగం ద్వారా చేసే అన్ని కార్యకలాపాలు, అగ్నిమాపక కేంద్రాలు, మొక్కల పెంపకం, కనీస వైద్యసదుపాయాలు, వీధిలైట్లు, బస్‌స్టాప్, పార్కులు, ఆటస్థలాలు, పార్కింగ్ సదుపాయం, శ్మశానవాటికలు, మురికివాడల అభివృద్ధి, విద్యుత్ సదుపాయం, అద్దె భవనాల లభ్యత, విద్య, వైద్య, సాంస్కృతిక తదితర సదుపాయాలు తప్పనిసరనే నిబంధన ఉంది. ప్రస్తుతం బందరు పురపాలక సంఘంలో ఈ వసతులు జనాభాకు సరిపడా ఉన్నాయి. కార్పొరేషన్‌గా మారిస్తే వివిధ వసతులు సమకూరాలి. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పరిసరాల్లో ఉన్న పలు గ్రామాలను విలీనంచేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మునిసిపాల్టీగా ఉన్న మచిలీపట్నం కార్పొరేషన్‌గా మార్చే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పాలకవర్గం మునిసిపాల్టీగానే కొనసాగించాలని తీర్మానం చేసినా ఈ తీర్మానాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌లో చుట్టు పక్కల గ్రామాలను కలపాలంటే అక్కడి పంచాయతీ పాలకవర్గాల నిర్ణయం, రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలు మరో ఏడాదికి జరిగే అవకాశం ఉన్నప్పుడే పంచాయతీలను కార్పొరేషన్‌లో కలిపేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
బందరుకు నగర హోదా!
Published Tue, Sep 22 2015 3:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement