వికారాబాద్, న్యూస్‌లైన్ : ఆడపిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధి నారాయణపూర్ గ్రామంలో సుమారు రూ.70లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పోషణ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం అందజేస్తోందని చెప్పారు. సమాజంలో ఆడపిల్లలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు.
ఇందులో భాగంగానే నారాయణపూర్ గ్రామంలో దాదాపు రూ.70లక్షల విలువ చేసే అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలకు రూ.16 లక్షలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15లక్షలు, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2లక్షలు, అలాగే నారాయణపూర్ - కట్టమైసమ్మ గుడి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.35లక్షలను బీఆర్‌జీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం అందజేసే రుణాలతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద నిలబడాలని మంత్రి సూచించారు. ప్రతి మండలానికి ఒక గ్యాస్ ఏజెన్సీ ఇప్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నారాయణపూర్ సర్పంచ్ నర్సింహులు, శివరెడ్డిపేట్ సొసైటీ చైర్మన్ కిషన్‌నాయక్, వికారాబాద్, ధారూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, పౌర సంబంధాల అధికారి హర్షభార్గవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వినయ్‌కుమార్ పాల్గొన్నారు.