ఒకే వేదికపైకి టీడీపీ, కాంగ్రెస్
జెండాలకతీతంగా ‘ప్రాణహిత’ కోసం పోరాడాలని నిర్ణయం
- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బహిరంగసభలో నేతల పిలుపు
- ‘ప్రాణహిత’ డిజైన్ మార్పుపై ముగిసిన టీడీపీ పాదయాత్ర
- మద్దతు తెలిపి సభలో పాల్గొన్న మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్
చేవెళ్ల: జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ఒక్క వేదికపై పోరాడాలని.. ‘ప్రాణహిత-చేవెళ్ల’ నీళ్లు రంగారెడ్డి జిల్లాకు వచ్చేదాకా సమష్టిగా ఉద్యమించాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ శనివారం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొని.. తమ మద్దతు ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా చేవెళ్లలో ‘ప్రాణహిత-చేవెళ్ల’ పైలాన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మెడలు వంచైనా ఈ ప్రాజెక్టును సాధించి తీరుతామన్నారు. కాసుల కక్కుర్తితోనే కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరునూరైనా ప్రాణహిత- చేవెళ్ల డిజైన్‌ను మారుస్తామని సీఎం కేసీఆర్ ఓవైపు ప్రకటిస్తుంటే, మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం డిజైన్‌ను మార్చడం లేదని చెబుతున్నారని... ఇందులో ఏది నిజమో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో పేదరికం, వెనుకబాటుతనాన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని... ఇప్పుడు ఆ ప్రాజెక్టు డిజైన్ మారిస్తే జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేదిగా ఉందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఆరోపించారు.
కేసీఆర్ పిచ్చి తుగ్లక్: ఎర్రబెల్లి
కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కేసీఆర్ దిగొచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్‌ను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులతోనే టీఆర్ఎస్ నిండిపోయిందని, మంత్రులు చేతగాని దద్దమ్మలని విమర్శించారు. ‘రూ.6వేల కోట్ల పనులు జరిగిన తరువాత బుద్ధున్నోడు ఎవరైనా ప్రాజెక్టు డిజైన్‌ను మారుస్తాడా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేస్తే.. కేసీఆర్ డిజైన్ మార్చి అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.