ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇంతవరకూ ఈ పథకం పై తనకే అవగాహన లేదని ఇటీవల ఓ ఎంపీడీఓ స్వయంగా అన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని అమలు చేశారు. 2005 మే నెలలో బాలికా సంరక్షణపథకం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీని స్థానంలో ఈ ఏడాది మే 1 నుంచి బంగారు తల్లి పథకాన్ని అమలు చేశారు. కొన్ని విమర్శల నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఈ పథకంకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
దీంతో పథకం అమలులో జాప్యం జరిగింది తొలుత చాలా మందికి ఈ పథకంపై అవగాహన కొరవడటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా దీనిపై పడింది. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బాండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులు గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. అయితే దరఖాస్తు పత్రంలో గ్రామ సంఘం ప్రతినిధితోపాటు ఏఎన్‌ఎం, వైద్యాధికారులు సంతకాలు చేయాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదలు సైతం ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది పనితీరుపై వారు పెదవి విరుస్తున్నారు.
‘మీరు మా వద్ద టీకాలు వేయించుకోలేదని.. మీ సమాచారం మా వద్ద లేదని తాము సంతకాలు చేయలేమని’ చాలా చోట్ల ఏఎన్‌ఎంలు, డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదుచేయించుకున్నవారికి ఏఎన్‌ఎంలు క్రమం తప్పకుండా టీకాలు వేసి గర్భవతులపేర్లను నమోదు చేసుకుంటారు. ప్రైవేటు వైద్యుల వద్ద చూపించుకోవడంతో వారెవరో తమకు తెలియదని సంతకాలు చేయడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. మండల సమాఖ్య అధికారులకు శనివారం జిల్లా స్థాయిలో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల చేతనైనా సరే సంతకాలు చేయించాలని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే దరఖాస్తులో రేషన్ కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయాల్సి ఉంది.
చాలా మందికి పెళ్లి అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డుకు దరఖాస్తుచేసినా మళ్లీ వచ్చే రచ్చబండలో కానీ ఇవ్వడం లేదు. 2011 నవంబర్‌లో రచ్చబండ జరగగా మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే బంగారుతల్లి పథకంకు సంబంధించిన సమాచారంపై అవగాహన లేక చాలా మంది అరకొరగా దరఖాస్తులను భర్తీ చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు వీటిని తిప్పిపంపుతున్నారు.
అన్ని వివరాలను పూర్తి చేస్తేనే మీకు అర్హత లభిస్తుందంటున్నారు. పథకం ఒక ఆడపిల్లకే వర్తిస్తుందా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టినా వర్తిస్తుందా, కవలలు పుడితే పరిస్థితి ఏమిటి వంటి విషయాలపై ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. ఆపరేషన్ చేయించుకున్నవారికే పథకం వర్తిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పుట్టిన ఆడపిల్ల చదువుకోకపోతే ఈ పథకం వర్తించదు. అంగన్‌వాడీ కేంద్రం మొదలు ఇంటర్మీడియట్ వరకు చదివి పాస్ అయితే రూ.55వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష కలిపి మొత్తం రూ.1.55లక్షలు 21 ఏళ్లు వచ్చేనాటికి అందజేస్తారు. నగదు బదిలీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 155321తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా అధికారులు పూర్తి స్థాయిలో ఈ పథకంపై ప్రచారం చేయాల్సి ఉంది.
బంగారు తల్లికి బాలారిష్టాలు
Published Tue, Nov 19 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement