ఆత్మాభిమానం చంపుకోలేక.. | Bank Employee Family Committed Suicide In Rajamahendravaram | Sakshi
Sakshi News home page

ఆత్మాభిమానం చంపుకోలేక..

Published Sun, Dec 9 2018 7:48 AM | Last Updated on Sun, Dec 9 2018 7:48 AM

Bank Employee Family Committed Suicide In Rajamahendravaram - Sakshi

ఆనందబాబు, అరుణ మృతదేహాలు

అమ్మ.. నాన్న.. వారి ఆశల సౌధమైన కుమారుడు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఆమె గృహిణి. కుమారుడిని ఇంజినీరింగ్‌ చదివించారు. స్నేహితులతో కలసి సౌరవిద్యుత్‌ కార్ల యూనిట్‌ పెట్టాలనుకున్న అతడి ఆలోచనకు సరే అన్నారు. స్నేహితులను సమకూర్చుకుని మౌలిక వసతులకోసం కొందరు బయటి వ్యక్తుల సాయం ఆశించి రూ.లక్షల సొమ్ములు ఇచ్చి మోసపోయారు. డబ్బడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి. చస్తే చావండి అన్నారు. అంతే.. ఆ మధ్య తరగతి కుటుంబానికి ఆత్మాభిమానం దెబ్బతింది. ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. శుక్రవారం రాత్రి గోదావరిలో దూకి తనువు చాలించారు.

రాజమహేంద్రవరం రూరల్‌: పెట్టుబడి పెట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన విషయాన్ని, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను కనీసం అన్నదమ్ములకు చెప్పినా.. సహోద్యోగులకు చెప్పినా.. చిన్న సలహాతో తీరిపోయేది. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు కుటుంబం ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారో.. ఏమో తమ బాధను మనసులోనే దాచేసుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబసభ్యులను, బ్యాంకు ఉద్యోగులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. వివరాలలోకి వెళితే రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు(46), అతని భార్య కొల్లి అరుణ (40), కుమారుడు లక్ష్మీచంద్‌ సాయిచరణ్‌లు గురువారం రాత్రి 8.10 గంటల సమయంలో ఇంటినుంచి మోటార్‌బైక్‌పై కొవ్వూరు వెళ్లారు. అక్కడ అనన్య థియేటర్‌లో రోబో 2.0 సినిమా చూసి రాజమహేంద్రవరం బయలుదేరారు. 

రోడ్డు కం రైలు బ్రిడ్జిపై 135వ నెంబరు పోల్‌ వద్ద మోటార్‌ బైక్, సెల్‌ఫోన్, చెప్పులు విడిచి గోదావరిలోకి దూకి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయిచరణ్‌ చెప్పులు, సెల్‌ఫోన్‌ మాత్రం అక్కడ లభించలేదు. ఆనందబాబు సోదరుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్‌ నాగబాబులు జాలర్లతో కలిసి విస్తృతంగా గాలించారు. ఉదయం10 గంటల సమయంలో ఆనందబాబు మృతదేహం దూకిన పిల్లర్‌ వద్దే పైకి తేలిందని, అరుణ మృతదేహం వాడపల్లి ఇసుకర్యాంపు వద్ద నీటిలో తేలింది. కుమారుడు సాయిచరణ్‌ చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు దూకాడా లేదా అన్న కోణంలో కుటుంబసభ్యలు, పోలీçసులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినా శనివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. ఆనందబాబు, అరుణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రభుత్వాస్పత్రిలో విషాదఛాయలు..
ఆనందబాబు, అరుణల మృతదేహాలు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకోవడంతో ఆయన సోదరులు మధుబాబుతో పాటు, బెహ్రైన్‌లో ఉంటున్న అన్నయ్య వీరవెంకటసత్యనారాయణ, అరుణ తల్లిదండ్రులు ఆకాశపు వీరభద్రరావు, పాపాజీలతో పాటు ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం మాకు ఒక్కమాట చెప్పి ఉంటే ఈబాధ ఉండేది కాదని తామంతా చూసుకునేవారమని, ఎవరికీ చెప్పకుండా తన మనస్సులోనే పెట్టుకుని మా అందరికీ దూరమయ్యారన్నారు. అలాగే బ్యాంకు ఉద్యోగులు సైతం అక్కడకు చేరుకుని బ్యాంకు యూనియన్‌లో కీలకమైన పాత్ర పోషించిన ఆనందబాబు కనీసం ఒక్కమాట చెప్పి ఉంటే ఇంతకష్టం వచ్చేది కాదని అన్నారు. తులీప్‌ అపార్టుమెంటు వాసులు సైతం అందరితోను కలివిడిగా ఉండే ఆనందబాబు, అరుణ దంపతులు ఈ విధంగా చేస్తారని అనుకోలేదన్నారు. 

ఆ నలుగురే కారణమా?
సంస్థ నెలకొల్పడానికి సాయం చేస్తామని వంచన
డబ్బు తీసుకుని ముఖం చాటేసిన వైనం
 సాయిచరణ్‌ సూసైడ్‌ నోట్‌లో వివరాలు వెల్లడి

రాజమహేంద్రవరం రూరల్‌: నలుగురు వ్యక్తులు యువమేధావికి ఆశలు కల్పించడంతో పాటు, దఫదఫాలుగా సుమారు రూ.23.75 లక్షలు తీసుకుని ఇప్పుడు తమకు ఎటువంటి సంబంధం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తేచావండి అని అనడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజమహేంద్రవరం కెనరాబ్యాంకు క్యాష్‌ అసిస్టెంట్‌ ఆనందబాబు, అతని భార్య అరుణ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం, వారి కుమారుడు లక్ష్మీచంద్‌సాయిచరణ్‌ ఆచూకీ లభించకపోవడం అందరినీ తీవ్రంగా  కలిచివేస్తోంది. ఆనంద్‌బాబు కుమారుడు రాసిన సూసైడ్‌నోట్‌లో విషయాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ మూడో సంవత్సరం చదువుతున్న చంద్‌సాయిచరణ్‌ తన సీనియర్లు రాజీవ్, మోహన్, సురేష్, హరికమల్, అఖిల్‌తో కలసి సోలార్‌కార్ల తయారీ ప్రాజెక్టును డిజైన్‌ చేశాడు. దీంతో ఏడాదిన్నర క్రితం ఆల్ట్రాస్‌ మోటార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను స్థాపించి దానికి సీఈవో, ఫౌండర్‌గా చరణ్‌ ఉన్నాడు. కళాశాల యాజమాన్యం అనుమతి తీసుకుని ఏడాదిగా ప్రాజెక్టు విషయంపై తిరుగుతున్నాడు. 

అయితే సోలార్‌ టెక్నాలజీతో తయారుచేసిన ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో ఎవరైనా పెట్టుబడిదారుడ్ని పట్టుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్రోకర్లు కె.సత్యనారాయణ, బి.అప్పల కనక శ్రీనివాస్‌ ఎలియాస్‌ స్వామిలను వీరు ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు భూమి అవసరమని అలాగే పెట్టుబడి కూడా కావాల్సి ఉంటుందని సదరు బ్రోకర్లకు చరణ్, అతని స్నేహితులు చెప్పినట్లు సమాచారం. దీంతో తాము అంతా చూసుకుంటామని భరోసా ఇచ్చిన బ్రోకర్లు.. విశాఖపట్నానికి చెందిన స్థల యజమాని దొర, గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్‌ శ్రీనివాసరెడ్డిలను రంగంలోకి దింపినట్లు సమాచారం.

 మొత్తం ఈ నలుగురు కలసి చరణ్‌ బృందం నుంచి ఖర్చులు నిమిత్తం రూ.23.75 లక్షలను తీసుకున్నట్లు సూసైడ్‌నోట్‌ ద్వారా అర్థమవుతోంది. పరిశ్రమకు సంబంధించిన 20 ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా డబ్బు సమకూరుస్తామని చెప్పి చరణ్‌ బృందం నుంచి ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్కులు ఉద్యోగాల నిమిత్తం తీసుకున్నట్లుగా చూపిస్తూ చెక్కులు రిటర్న్‌ అయినట్లు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.23.75 లక్షలు చరణ్, అతడి స్నేహితులు సత్యనారాయణ ద్వారా స్వామి, దొర, ఫైనాన్షియర్‌ శ్రీనివాసరెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు నలుగురు మోసం చేయడంతో చరణ్‌ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకపోయింది.

 మిగిలిన వారి నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో ఆనందరావు, అరుణ, చరణ్‌లు మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. స్థలం యజమాని దొర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఫైనాన్షియర్‌ శ్రీనివాసరెడ్డి, బ్రోకర్లు సత్యనారాయణ, బీఏకే శ్రీనివాస్‌లను ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్‌ చేయించమన్నా, అగ్రిమెంటు చేయమన్నా, కనీసం డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నా వారు వాయిదాలు వేస్తూ రావడంతో చరణ్‌ కుటుంబం విసిగి వేసారిపోయింది. వారికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అంటూ సమాధానాలు రావడంతో ఆకుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆనందబాబు సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలోనే బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్‌ నాగబాబు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement