బ్యాంకు దోపిడీకి యత్నం | Bank heist attempt | Sakshi
Sakshi News home page

బ్యాంకు దోపిడీకి యత్నం

Published Sun, May 10 2015 4:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

Bank heist attempt

- కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు
- స్ట్రాంగ్‌రూం తాళాలు తెరుస్తుండగా మోగిన సైరన్
- సీసీ కెమెరా, డీవీడీ, మోడెమ్‌తీసుకుని పరార్
పలమనేరు:
మండలంలోని కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఓ ముఠా శుక్రవారం అర్ధరాత్రి యత్నించింది. లోనికి ప్రవేశించాక స్ట్రాంగ్‌రూమ్ తాళాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుముందు ఇదే గ్రామంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంటి వద్ద కూడా వీరు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. మొత్తం మీద ఆరితేరిన దొంగలే ఈ దోపిడిలో పాల్గొని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలమాసనపల్లె గ్రామం లో జనావాసాలకు దూరంగా గ్రామీణ బ్యాంకు ఉంది. గతంలో ఎప్పుడూ ఇక్కడ చోరీలు జరిగిన సందర్భాలు లేవు. కానీ బ్యాంకులో

సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేశారు. ఈ ధైర్యంతో అక్కడ వాచ్‌మన్‌ను పెట్టడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇదే దొంగలకు అనుకూలంగా మారింది. శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగల ముఠా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు కిటికీని తెరచి అందులోని రెండు ఇనుప గ్రిల్స్‌ను ఆక్సాబ్లేడ్, లేదా ఎలక్ట్రానిక్ కటింగ్ మెషీన్ సాయంతో కట్ చేశారు. కట్ చేస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు నీరు పోస్తూ గ్రిల్స్ తొలగించారు. ఆ కిటికీ గుండా లోనికి ప్రవేశించి తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అయితే సైరన్‌కు సంబంధించిన వైర్లు కనిపించపోవడంతో వాటిని కత్తిరించడం మరిచారు. బ్యాంకులోని అన్ని డ్రాలను ఓపెన్‌చేసి స్ట్రాంగ్‌రూమ్ తాళాలకోసం వెతికారు. ఎక్కడా లేకపోవడంతో స్ట్రాంగ్‌రూమ్ తాళాలను తీసేందుకు స్క్రూడ్రైవర్ ద్వారా ప్రయత్నించారు. దీంతో సైరన్ మోగడం ప్రారంభించింది. వెంటనే దొంగలు కిటికీ గుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న వాహనంలో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చేయితిరిగిన ముఠాపనేనా!
దోపిడీకి యత్నించిన తీరును బట్టి చూస్తే ఈ ముఠాలో కనీసం నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు బ్యాంకులోకి వెళ్లిన తీరు, లోన సీసీ కెమెరాల వెర్లను తొలగించడం, వీడియో ఫుటేజీ కనిపించకుండా మోడెమ్‌ను తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే ఇది చేయితిరిగిన ముఠా పనేనని తెలుస్తోంది. వీరుముందే ఇక్కడ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. బ్యాంకు వద్దకు వెళ్లకముందే వీరు గ్రామ సమీపంలోని ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇంటి తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ వాచ్‌మన్ ఉండడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అర్థమవుతోంది. బ్యాంకులో అలారం మోగినపుడు సరిగ్గా సమయం 12.48గా నమోదై ఉంది. అంటే వీరు అర్ధరాత్రి 12నుంచే ఈ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో కొలమాసనపల్లె గ్రామం ఉలిక్కిపడింది.

సంఘటన స్థలాన్నిసందర్శించిన నిపుణులు..
బ్యాంకు వద్ద అలారం మోగిన కాసేపటికే కొందరు స్థానికులు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరోవైపు పలమనేరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గంగవరం సీఐ రవికుమార్, డీఎస్పీ శంకర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌లు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసుజాగిలాలు బ్యాంకు నుంచి పలమనేరు రోడ్డు మీదుగా గొల్లపల్లె వరకు వెళ్లిఆగాయి. ఇప్పటికే ఈ కేసును ఛేదిం చేందుకు సర్కిల్ ఐడీ పార్టీ రంగంలోకి దిగిం ది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పలమనేరు ఇన్‌చార్జ్  సీఐ రవికుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement