The robbers
-
బ్యాంకు దోపిడీకి యత్నం
- కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు - స్ట్రాంగ్‌రూం తాళాలు తెరుస్తుండగా మోగిన సైరన్ - సీసీ కెమెరా, డీవీడీ, మోడెమ్తీసుకుని పరార్ పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఓ ముఠా శుక్రవారం అర్ధరాత్రి యత్నించింది. లోనికి ప్రవేశించాక స్ట్రాంగ్‌రూమ్ తాళాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుముందు ఇదే గ్రామంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంటి వద్ద కూడా వీరు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. మొత్తం మీద ఆరితేరిన దొంగలే ఈ దోపిడిలో పాల్గొని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలమాసనపల్లె గ్రామం లో జనావాసాలకు దూరంగా గ్రామీణ బ్యాంకు ఉంది. గతంలో ఎప్పుడూ ఇక్కడ చోరీలు జరిగిన సందర్భాలు లేవు. కానీ బ్యాంకులో సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేశారు. ఈ ధైర్యంతో అక్కడ వాచ్‌మన్‌ను పెట్టడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇదే దొంగలకు అనుకూలంగా మారింది. శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగల ముఠా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు కిటికీని తెరచి అందులోని రెండు ఇనుప గ్రిల్స్‌ను ఆక్సాబ్లేడ్, లేదా ఎలక్ట్రానిక్ కటింగ్ మెషీన్ సాయంతో కట్ చేశారు. కట్ చేస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు నీరు పోస్తూ గ్రిల్స్ తొలగించారు. ఆ కిటికీ గుండా లోనికి ప్రవేశించి తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అయితే సైరన్‌కు సంబంధించిన వైర్లు కనిపించపోవడంతో వాటిని కత్తిరించడం మరిచారు. బ్యాంకులోని అన్ని డ్రాలను ఓపెన్‌చేసి స్ట్రాంగ్‌రూమ్ తాళాలకోసం వెతికారు. ఎక్కడా లేకపోవడంతో స్ట్రాంగ్‌రూమ్ తాళాలను తీసేందుకు స్క్రూడ్రైవర్ ద్వారా ప్రయత్నించారు. దీంతో సైరన్ మోగడం ప్రారంభించింది. వెంటనే దొంగలు కిటికీ గుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న వాహనంలో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేయితిరిగిన ముఠాపనేనా! దోపిడీకి యత్నించిన తీరును బట్టి చూస్తే ఈ ముఠాలో కనీసం నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు బ్యాంకులోకి వెళ్లిన తీరు, లోన సీసీ కెమెరాల వెర్లను తొలగించడం, వీడియో ఫుటేజీ కనిపించకుండా మోడెమ్‌ను తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే ఇది చేయితిరిగిన ముఠా పనేనని తెలుస్తోంది. వీరుముందే ఇక్కడ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. బ్యాంకు వద్దకు వెళ్లకముందే వీరు గ్రామ సమీపంలోని ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇంటి తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ వాచ్‌మన్ ఉండడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అర్థమవుతోంది. బ్యాంకులో అలారం మోగినపుడు సరిగ్గా సమయం 12.48గా నమోదై ఉంది. అంటే వీరు అర్ధరాత్రి 12నుంచే ఈ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో కొలమాసనపల్లె గ్రామం ఉలిక్కిపడింది. సంఘటన స్థలాన్నిసందర్శించిన నిపుణులు.. బ్యాంకు వద్ద అలారం మోగిన కాసేపటికే కొందరు స్థానికులు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరోవైపు పలమనేరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గంగవరం సీఐ రవికుమార్, డీఎస్పీ శంకర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌లు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసుజాగిలాలు బ్యాంకు నుంచి పలమనేరు రోడ్డు మీదుగా గొల్లపల్లె వరకు వెళ్లిఆగాయి. ఇప్పటికే ఈ కేసును ఛేదిం చేందుకు సర్కిల్ ఐడీ పార్టీ రంగంలోకి దిగిం ది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పలమనేరు ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు. -
గోల్డ్ కొట్టేశారు..
ఫంక్షన్‌కు వెళ్లొచ్చేసరికి... జవహర్‌నగర్: ఫంక్షన్‌కు వెళ్లొచ్చేలోగా దొంగలు తాళం పగులగొట్టి ఇల్లు గుల్ల చేశారు. 32 తులాల బంగారు నగలు, యూఎస్ డాలర్లు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. దమ్మాయిగూడ అంజనాద్రీనగర్లో శనివా రం అర్ధరాత్రి ఈ భారీ చోరీ జరిగింది. జవహర్‌నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. అంజనాద్రీనగర్ నివాసి నాగే శ్వరరావు బేగంపేట్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. నాగేశ్వరరావు దంపతులు శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సరూర్‌నగర్‌లో ఉండే స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం విరగ్గొట్టి ఉంది. ఆందోళనకు గురైన వారు లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అందులోని సామగ్రి మంచంపై చిందరవందరగా పడి ఉంది. బీరువాలో దాచిన 32 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదుతో పాటు 1000 యూఎస్ డాలర్లు కనిపించలేదు. నాగేశ్వరారవు సమాచారం మేరకు డీఐ గిరీష్‌రావు, క్రైం ఎస్ఐ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి దమ్మాయిగూడ చౌరస్తా వరకు వె ళ్లి ఆగిపోయింది. కాగా, చోరీ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని వీడియో ఫుటేజీ సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నాగేశ్వరరావు దంపతులు పెళ్లికి వె ళ్లడాన్ని గమనించిన దొంగలు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కిటికీ గ్రిల్ తొలిగించి... గౌతంనగర్: దొంగలు ఓ ఇంట్లో చొరబడి పది తులాల బంగారు ఆభరణాలు, రూ. 12 వేల నగదు దోచుకెళ్లారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. పోలీసులు, బాధితుల ప్రకారం... ప్రైవేట్ ఉద్యోగం చేసే బి.నరేందర్ ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆకుల నర్సింగ్రావునగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున నరేందర్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలుచొరబడి ప్రధాన ద్వారం పక్కన ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదు, రెండు సెల్ఫోన్లను తీసుకుని మరిన్ని వస్తువులను దొంగలించడానికి బీరువాలో వెతుకుతుండగా అలజడి విన్నకుటుంబసభ్యులు కేకలు వేయడంతో దొంగలు అప్పటికే తీసుకున్న సొత్తు తీసుకొని పారిపోయారు. నరేందర్ వెంటనే 100కు సమాచారం అందించగా మల్కాజిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నరేందర్ ఇంటిముందు ఉన్న మరో ఇంట్లో ఒక సెల్‌ఫోన్, టైటాన్ వాచ్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. -
అమ్మో.. దొంగలు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగల కన్ను ఆ ఇంటిపై పడుతోంది. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న నగదు, విలువైన చీరెలను దోచుకెళ్లారు. బాధితురాలి కథనం మేరకు శారదా ప్రేమవాణి మోడంపల్లెలోని డీబీసీఎస్ మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఇంట్లో ఆమె తల్లితో కలిసి ఉంటున్నారు. వారం రోజుల క్రితం తల్లీ కూతుళ్లిద్దరూ ప్రకాశ్ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శారదా ప్రేమవాణికి డీఈఓ కార్యాలయంలో పని ఉండటంతో రెండు మూడు రోజుల నుంచి ఆమె కడపకు వెళ్తున్నారు. అందువల్ల తల్లి ఒంటరిగా ఉండలేదనే ఉద్దేశంతో వారి బంధువుల ఇంటి వద్ద ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం శారదాప్రేమవాణి మోడంపల్లెలోని తన ఇంటికి వచ్చి కొంచెంసేపు ఉండి ప్రకాష్‌నగర్‌కు వెళ్లారు. అయితే బుధవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి రాగా తాళాలు పగులకొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి అందులో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో పరిశీలించగా విలువైన 20 చీరెలతోపాటు కొంత నగదు, వెండి వస్తువులు,సెల్‌ఫోన్ చోరీకీ గురిఅయినట్లు గుర్తించారు. పట్టణంలో గ్యాంగ్ సంచరిస్తోందా.. పట్టణంలో ఇటీవల జరిగిన చోరీలన్నీ ఒకే విధానంలో జరిగాయి. ఐదు రోజుల క్రితం జరిగిన చోరీ సంఘటనలో నాలుగు ఇళ్లలోనూ ఆయా కుటుంబ సభ్యులు లేరు. దీన్ని బట్టి దొంగలు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారనే వివరాలను పూర్తిగా సేకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ రోజు రాత్రికి ఇంటి యజమానులు రారని నిర్ధారించుకున్నాకే దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో దొంగల గ్యాంగ్ పట్టణంలో సంచరిస్తుందనే అనుమానం కలుగుతోంది. వారం రోజుల్లోనే ఒకే పోలీస్టేషన్ పరిధిలో చోరీలు జరగడం పోలీసుల పనితీరును తెలియజేస్తోంది. చోరీలు జరిగాక రికవరీలు చేయడం కంటే చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవడం అవసరమని ప్రజలు అంటున్నారు. -
అవినీతి పోలీసుల చేతివాటం..!
సాక్షి, గుంటూరు: కంచే చేను మేసిన చందంగా రక్షణగా నిలవాల్సిన పోలీసులే బాధితుల సొమ్ము నొక్కేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా దొంగలతో దోస్తీ చేస్తున్నారు. దొంగలు దోచుకుపోయారంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న పౌరులకు రిక్త హస్తం చూపుతున్నారు. అవినీతి పోలీసు అధికారుల బండారాలు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, బంగారం రికవరీ కేసులో పోలీసులే రూ. 50 వేలు లంచం తీసుకుని నిందితుడిని వదిలేసిన సంఘటన బయట పడింది. పాత గుంటూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన బొర్రా వీరేశ్వరరావు అనే పత్తి కంపెనీ కూలీ ఇంట్లో 2013 మార్చిలో దొంగతనం జరిగింది. సుమారు 70 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు లబోదిబోమంటూ పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నంబరు 67/2014తో కేసు నమోదు చేశారు. ఇది జరిగిన పది రోజుల వ్యవధిలో పెదకాకాని పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా పాతగుంటూరులో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో దొంగను అప్పగించడంతో పాతగుంటూరు పోలీసులు విచారణ చేపట్టారు. అంబేద్కర్‌నగర్‌లో దొంగిలించిన బంగారాన్ని గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించినట్టు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాసరావు పరారయ్యాడు. దీంతో పోలీసులు దొంగను మాత్రమే కోర్టులో హాజరుపర్చారు. ఆ తరువాత రెండు నెలలకు శ్రీనివాసరావును పట్టుకున్న పోలీసులు బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ఈ కేసులో బాధితుడు బొర్రా వీరేశ్వరరావు రెండు రోజుల క్రితం అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌ను కలవడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు శ్రీనివాసరావును కలవడంతో తన వద్ద రూ. 50 వేలు కాజేసి తిరిగి బంగారం అడగడమేంటని, ఇలాగైతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ఓ సీఐ పంచాయితీ పెట్టి బాధితుని బంగారం వెనక్కు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎస్పీ రాజేష్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇలాంటి సంఘటనలు తన దృష్టికి వచ్చాయని విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొన్న ఎస్ఐ, నిన్న డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నేడు మరో సీఐ.. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసిన సంఘటనలు వరుసగా మూడు వెలుగులోకి వచ్చాయి. మొన్న గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా తన వద్ద ఓ ఎస్ఐ 200 గ్రాముల బంగారం రికవరీ చేసి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారని చెప్పాడు. విచారించగా అది నిజమని తేలింది. ఆ ఎస్ఐ అర్బన్ పరిధిలో ఉండటంతో అవాక్కైన సీసీఎస్ పోలీసులు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. మరో సంఘటనలో.. ఓ కేసులో దొంగను పట్టుకుని డీఎస్పీ, ఇద్దరు సీఐలు విచారించగా 250 గ్రాముల బంగారం రికవరీ అయింది. అయితే వీరు ముగ్గురూ కూడబలుక్కుని ఆ బంగారాన్ని నొక్కేశారు. ఇటీవల కాకినాడ సీసీఎస్ పోలీసులకు దొరికిన ఆ దొంగ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అదికాస్తా అర్బన్ ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీనిపైన ఆయన విచారణకు ఆదేశించారు. తాజాగా పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమిటంటే ఈ మూడు సంఘటనలూ పాతగుంటూరు పోలీస్టేషన్‌తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం. -
చోరీలతో వర్రీ
పెరుగుతున్న చైన్‌స్నాచింగ్‌లు బైక్‌ల చోరీలూ ఎక్కువే బ్యాంకుల్నీ వదలడం లేదు పోలీసులకే చెమటలు పట్టిస్తున్న దొంగలు 2014 జూలై 22: చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలో వనజ రాత్రి ఏడు గంట లకు ఇంటి వద్ద ఆరుబయట నడుచుకుంటూ వెళుతోంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 104 గ్రాముల బంగారు గొలు సు లాక్కెళ్లారు. ఈ ఒక్క వారంలోనే నగరంలో నలుగురు మహిళల నుంచి 171 గ్రాముల బం గారు ఆభరణాలను తెంపుకెళ్లారు. ఆగస్టు 13: చిత్తూరు చర్చీవీధిలో సురేష్ హీరోహోండా వాహనాన్ని పార్కింగ్ చేసి అంగట్లోకి వెళ్లాడు. 15 నిముషాల తరువాత వచ్చి చూస్తే బైక్ మాయం. దీనిపై స్థానిక సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవంబర్ 15: వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏకంగా 13 కిలోల వెండి వస్తువు లు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు దోపి డీ చేసి పోలీసులకు పెద్ద సవాలు విసిరారు. చిత్తూరు (అర్బన్): ఇలా జిల్లాలో చోరీలు మితిమీరుతున్నా యి. ప్రధానంగా చైన్‌స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువ అవుతున్నాయి. బ్యాంకు దోపిడీలు పోలీసులకు కంటిమీద కునుకు లే కుండా చేస్తున్నాయి. చైన్‌స్నాచింగ్ సమయాల్లో హుఖాలకు హెల్మెట్ వేసుకోవడం, కర్చీఫ్ కట్టుకోవడం పాత పద్ధతి. ఇటీవల జరిగిన చైన్‌స్నాచింగ్ కేసు ల్లో నిందితులు ఓ వృద్ధురాలి మెడలోంచి చైను తెంపకుండా తీరిగ్గా తలపై నుంచి తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోయారు. నిందితులు 30 ఏళ్ల వయస్సు మధ్య ఉంటారని బాధితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. బ్యాంకు దోపిడీ లు సినిమా ఫక్కీకి ఏ మాత్రం తీసిపోవడంలేదు. వరదయ్యపాళెం బ్యాంకు దోపిడీలో ఆవరణలోకి ప్రవేశించగానే దుండగులు సీసీ కెమెరాల వైర్లను కత్తిరించడం, కిటికీలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించేప్పుడు అడ్డుగా తెరను కట్టడం పోలీ సుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దోపిడీ మొ త్తం పూర్తయిన తరువాత ఒక్క చోట కూడా నిం దితుల వేలిముద్రలు దొరకలేదు. పోలీసు జాగిలాలు వాసన పట్టకుండా బ్యాంకు పరిసర ప్రాంతాల్లో మొత్తం కారంపొడి చల్లి మరీ వెళ్లిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వాళ్లే ఈ తరహా దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విలాసాల కోసమేనా? ఇలాంటి కేసుల్లో పోలీసుల చూపు విద్యార్థులపై కూడా పడుతోంది. విలాసాలకు అలవాటు పడి, ఆదాయం లేక ఈ తరహా పనులకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. జల్సాలకు తల్లితండ్రులు నగదు ఇచ్చి అలవా టు చేయడం, ఒకానొకదశలో డబ్బు ఇవ్వకపోతే స్నేహితులతో కలిసి చైన్‌స్నాచింగ్, దౌర్జన్యంగా వాహనాలు, సెల్ఫోన్లు లాక్కునే ముఠాను రెండు రోజుల క్రితం చిత్తూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. దొరకడంతోనే వాళ్లు దొంగల య్యారు. కానీ పోలీసులకు చిక్కకుండా సమాజంలో దొరల్లా దిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. వీరిని పసిగట్టి పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. -
ఫామ్‌హౌస్‌లో దొంగల బీభత్సం..
రాజేంద్రనగర్: ఫామ్‌హౌస్‌లో చొరబడ్డ దొంగలు మూడు గంటలపాటు స్వైరవిహారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గండిపేట్ శ్రీనగర్‌లో అనంతసేనారెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు(60) వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య ధనలక్ష్మి(55)తోపాటు మనువరాలు దీప(7) ఇతనితోపాటు ఉంటున్నారు. గురువారం రాత్రి 10.30కి ఆరుగురు దుండగులు ప్రధాన గేటు దూకి ఫామ్‌హౌస్ లోనికి ప్రవేశించారు. వాచ్‌మన్ గది వద్దకు వచ్చిన వారు హిందీలో వెంకటేశ్వరరావును పిలిచి తలుపు తెరిపించారు. బయటకు రాగానే చితకబాదారు. అలికిడికి మేల్కొన్న ధనలక్ష్మిపైనా దాడిచేశారు. వెంకటేశ్వరరావు తల పగలగా, ధనలక్ష్మి చేతికి గాయమైంది. తర్వాత ఇద్దరినీ చెట్టుకు కట్టేసి డబ్బు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయని హిందీలో బెదిరించారు. తమకు హిందీ రాదని చెప్పగా తెలుగులో మాట్లాడి ఇద్దరినీ చితకబాదసాగారు. దీంతో చిన్నారి దీప తన తాత,నానమ్మలను కొట్టవద్దని డబ్బులున్న బీరువాను చూపించింది. అందులో ఉన్న రూ.40 వేల నగదు తీసుకున్న దొంగల చిన్నారి చెవికమ్మలనూ లాక్కున్నారు. ధనలక్ష్మి మెడలో ఉన్న రోల్డ్‌గోల్డ్ మంగళసూత్రాన్ని తెంచుకున్నా రు. రాత్రి ఒంటి గంట తర్వాత దొంగలు గేట్దూకి పారిపోయారు. వీరు వెళ్లిన వెంటనే దీప ఇరువురి కట్లను విప్పింది. ఇద్దరూ పక్కనే ఉన్న ఫామ్‌హౌస్ వాచ్‌మన్ ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటనా స్థలాన్ని క్రైం డీసీపీ జానకీ షర్మిళ, శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి పరిశీలించారు. బీరువాను తెరిచేందుకు... ఫామ్‌హౌస్‌లోని ఓ గదిలో సేఫ్‌లాకర్ ఉంది. దాన్ని తెరిచేందుకు దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో విఫలయత్నం చేశారు. ఇందులో భారీ మొత్తంలో నగదు ఉంటుందన్న ఆశతో వారు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఇది తెలిసిన వారి పనే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. బాధితులు దొంగల్లో ఒక్కరిని కూడా గుర్తు పట్టకపోవడంతో బట్టి ఫామ్‌హౌస్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరో వీరిని పంపి ఉంటారని భావిస్తున్నారు.