అమ్మో.. దొంగలు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగల కన్ను ఆ ఇంటిపై పడుతోంది. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న నగదు, విలువైన చీరెలను దోచుకెళ్లారు.
బాధితురాలి కథనం మేరకు శారదా ప్రేమవాణి మోడంపల్లెలోని డీబీసీఎస్ మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఇంట్లో ఆమె తల్లితో కలిసి ఉంటున్నారు. వారం రోజుల క్రితం తల్లీ కూతుళ్లిద్దరూ ప్రకాశ్ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శారదా ప్రేమవాణికి డీఈఓ కార్యాలయంలో పని ఉండటంతో రెండు మూడు రోజుల నుంచి ఆమె కడపకు వెళ్తున్నారు. అందువల్ల తల్లి ఒంటరిగా ఉండలేదనే ఉద్దేశంతో వారి బంధువుల ఇంటి వద్ద ఉంచారు.
ఈ క్రమంలో మంగళవారం శారదాప్రేమవాణి మోడంపల్లెలోని తన ఇంటికి వచ్చి కొంచెంసేపు ఉండి ప్రకాష్‌నగర్‌కు వెళ్లారు. అయితే బుధవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి రాగా తాళాలు పగులకొట్టి ఉండటం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి అందులో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో పరిశీలించగా విలువైన 20 చీరెలతోపాటు కొంత నగదు, వెండి వస్తువులు,సెల్‌ఫోన్ చోరీకీ గురిఅయినట్లు గుర్తించారు.
పట్టణంలో గ్యాంగ్ సంచరిస్తోందా..
పట్టణంలో ఇటీవల జరిగిన చోరీలన్నీ ఒకే విధానంలో జరిగాయి. ఐదు రోజుల క్రితం జరిగిన చోరీ సంఘటనలో నాలుగు ఇళ్లలోనూ ఆయా కుటుంబ సభ్యులు లేరు. దీన్ని బట్టి దొంగలు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారనే వివరాలను పూర్తిగా సేకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ రోజు రాత్రికి ఇంటి యజమానులు రారని నిర్ధారించుకున్నాకే దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో దొంగల గ్యాంగ్ పట్టణంలో సంచరిస్తుందనే అనుమానం కలుగుతోంది. వారం రోజుల్లోనే ఒకే పోలీస్టేషన్ పరిధిలో చోరీలు జరగడం పోలీసుల పనితీరును తెలియజేస్తోంది. చోరీలు జరిగాక రికవరీలు చేయడం కంటే చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవడం అవసరమని ప్రజలు అంటున్నారు.