అవినీతి పోలీసుల చేతివాటం..!
సాక్షి, గుంటూరు: కంచే చేను మేసిన చందంగా రక్షణగా నిలవాల్సిన పోలీసులే బాధితుల సొమ్ము నొక్కేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా దొంగలతో దోస్తీ చేస్తున్నారు. దొంగలు దోచుకుపోయారంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న పౌరులకు రిక్త హస్తం చూపుతున్నారు. అవినీతి పోలీసు అధికారుల బండారాలు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, బంగారం రికవరీ కేసులో పోలీసులే రూ. 50 వేలు లంచం తీసుకుని నిందితుడిని వదిలేసిన సంఘటన బయట పడింది.
పాత గుంటూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన బొర్రా వీరేశ్వరరావు అనే పత్తి కంపెనీ కూలీ ఇంట్లో 2013 మార్చిలో దొంగతనం జరిగింది. సుమారు 70 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు లబోదిబోమంటూ పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నంబరు 67/2014తో కేసు నమోదు చేశారు.
ఇది జరిగిన పది రోజుల వ్యవధిలో పెదకాకాని పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా పాతగుంటూరులో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో దొంగను అప్పగించడంతో పాతగుంటూరు పోలీసులు విచారణ చేపట్టారు. అంబేద్కర్‌నగర్‌లో దొంగిలించిన బంగారాన్ని గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించినట్టు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాసరావు పరారయ్యాడు. దీంతో పోలీసులు దొంగను మాత్రమే కోర్టులో హాజరుపర్చారు.
ఆ తరువాత రెండు నెలలకు శ్రీనివాసరావును పట్టుకున్న పోలీసులు బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు లంచం తీసుకుని వదిలేశారు. ఈ కేసులో బాధితుడు బొర్రా వీరేశ్వరరావు రెండు రోజుల క్రితం అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌ను కలవడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు శ్రీనివాసరావును కలవడంతో తన వద్ద రూ. 50 వేలు కాజేసి తిరిగి బంగారం అడగడమేంటని, ఇలాగైతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ ఓ సీఐ పంచాయితీ పెట్టి బాధితుని బంగారం వెనక్కు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఎస్పీ రాజేష్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇలాంటి సంఘటనలు తన దృష్టికి వచ్చాయని విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మొన్న ఎస్‌ఐ, నిన్న డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నేడు మరో సీఐ..
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని నొక్కేసిన సంఘటనలు వరుసగా మూడు వెలుగులోకి వచ్చాయి. మొన్న గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసులు ఓ దొంగను పట్టుకుని విచారించగా తన వద్ద ఓ ఎస్‌ఐ 200 గ్రాముల బంగారం రికవరీ చేసి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారని చెప్పాడు. విచారించగా అది నిజమని తేలింది. ఆ ఎస్‌ఐ అర్బన్ పరిధిలో ఉండటంతో అవాక్కైన సీసీఎస్ పోలీసులు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు.
మరో సంఘటనలో.. ఓ కేసులో దొంగను పట్టుకుని డీఎస్పీ, ఇద్దరు సీఐలు విచారించగా 250 గ్రాముల బంగారం రికవరీ అయింది. అయితే వీరు ముగ్గురూ కూడబలుక్కుని ఆ బంగారాన్ని నొక్కేశారు. ఇటీవల కాకినాడ సీసీఎస్ పోలీసులకు దొరికిన ఆ దొంగ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అదికాస్తా అర్బన్ ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీనిపైన ఆయన విచారణకు ఆదేశించారు.
తాజాగా పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ చేయకుండా రూ. 50 వేలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమిటంటే ఈ మూడు సంఘటనలూ పాతగుంటూరు పోలీస్టేషన్‌తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం.