బ్రెజిల్‌లో 16 ఏళ్ల బాలికపై జరిగిన అత్యంత అమానవీయమైన అత్యాచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం నాడు రియోలో జరిగిన ప్రదర్శనలో నినదిస్తున్న ఓ యువతి
నిర్భయ-2
బాయ్స్ మంచివాళ్లే. ఫ్రెండ్సూ మంచివాళ్లే. బాయ్‌ఫ్రెండ్స్‌తోనే.. అమ్మాయిలకు టార్చర్. ఆడ-మగ మధ్య స్నేహంలో తప్పు లేదు. ఒక ఏజ్‌లో.. అదీ ఈ న్యూ ఏజ్‌లో.. ఆడ మగతోనూ, మగ ఆడతోనూ స్నేహం చెయ్యకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు! కానీ, ఫర్ ది సేక్ ఆఫ్ గాళ్స్.. దేవుడు చెయ్యలేని ఒక పనిని అమ్మాయి చెయ్చొచ్చు! ఆడ-మగ మధ్య స్నేహంలో.. స్నేహాన్ని మాత్రమే పెరగనిచ్చి, ఆడ, మగల్ని ఎక్కడున్నారో అక్కడే.. హద్దుల్లో ఉంచేయొచ్చు.
హద్దుల్లో ఉంచే శక్తి, హద్దుల్లో ఉండే శక్తీ.. రెండూ అమ్మాయిలకు ఉన్నాయి. మగపిల్లలు ట్రై చేస్తూనే ఉంటారు... ఆడ-మగ స్నేహంలో.. స్నేహాన్ని ఎక్కడిదక్కడే ఉండనిచ్చి, ఆడ-మగలను మాత్రం పెరగనివ్వడానికి!! దాన్ని పెరగనివ్వకండి. స్నేహం ‘బ్రేకప్’ అయినా పర్వాలేదు. స్నేహం కానిది ‘బిల్డప్’ కాకూడదు.
Friend అనే మాటకు డిక్షనరీలో మంచి అర్థం ఉంది. A person whom you know well and whom you like a lot. నీకు బాగా తెలిసినవాడు, నువ్వు బాగా ఇష్టపడేవాడు ఫ్రెండ్. Boyfriend కి వేరే అర్థం ఉంది.A man with whom a person is having romantic or sexual relationship. క్లియర్.
ఫ్రెండ్ హృదయం. బాయ్‌ఫ్రెండ్ దేహం. ఫ్రెండ్ జాగ్రత్త చెప్తాడు. బాయ్‌ఫ్రెండ్ ధైర్యం చెప్తాడు. ఫ్రెండ్.. ‘అమ్మ, నాన్న, ఒక ఫ్రెండ్’లా ఉంటాడు. బాయ్‌ఫ్రెండ్.. ‘నువ్వు, నేను, మధ్యలోకి ఇంకెవరూ వద్దు’ అంటాడు. ఫ్రెండ్ చీకటి పడుతోంది అంటాడు. బాయ్‌ఫ్రెండ్ చీకటి పడనిద్దాం అంటాడు. ఫ్రెండ్ మా ఇంటికి వెళ్దాం అంటాడు. బాయ్‌ఫ్రెండ్ నా రూమ్‌కి వెళ్దాం అంటాడు.
ఇదిగో.. ఈ సంగతి తెలీకే 16 ఏళ్ల బ్రెజిల్ అమ్మాయి తన ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లింది. వాడు అక్కడ బాయ్‌ఫ్రెండ్ అయిపోయాడు. 33 మంది, ఆమెపై 36 గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ప్రపంచం ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతోంది.
ఇదిగో.. ఈ సంగతి తెలీకే 18 ఏళ్ల మన ‘నిర్భయ’ తన ఫ్రెండ్‌తో కలిసి రాత్రి పూట బస్‌లో వెళ్లింది. అతను అక్కడ ఆమెను రక్షించుకోలేని బాయ్‌ఫ్రెండ్ అయిపోయాడు. తర్వాత జరిగిందేమిటో ఎన్ని తరాలు గడిస్తే మర్చిపోగలం?
ఇదిగో.. ఈ సంగతి తెలీకే 23 ఏళ్ల యువతి కరీంనగర్‌లో ఫ్రెండ్‌ని నమ్మి వేరే ఊరు వెళ్లింది. వాడక్కడ బాయ్‌ఫ్రెండ్ అయిపోయాడు. ఆమె నలుగురి చేతిలో పడింది.
ఇదిగో... ఈ సంగతి తెలీకే.. ఫ్రెండ్‌తో సెల్ఫీ దిగి, ఫ్రెండ్‌తో సొంత విషయాలన్నీ చెప్పుకుని, ఫ్రెండ్‌తో ఒంటరిగా వెళ్లి.. ఆ ఫ్రెండులోని బాయ్‌ఫ్రెండ్ అపరిచితుడిలా పైకి లేచి, చేసిన ద్రోహానికి బలైపోయిన అమ్మాయిల సంఖ్యే ఎక్కువ... నేషనల్, ఇంటర్నేషనల్ క్రైమ్ డేటాలో. ఆ డేటాలో లేటెస్ట్ ఎంట్రీ... బ్రెజిల్ నిర్భయ.
గాళ్స్.. మీ ఫ్రెండ్‌కి ఇవ్వాళే చెప్పేయండి. తనని మీరు ఫ్రెండ్‌గా మాత్రమే ఇష్టపడుతున్నారనీ. బాయ్‌ఫ్రెండ్ వేషాలు వేస్తే కుదరదనీ!
-మాధవ్ శింగరాజు