అప్పట్నుంచీ అబ్బాయిలతో స్నేహమంటే ఆలోచిస్తున్నా!
అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా ఉండకూడదా? ఒకప్పుడైతే ఇదో పెద్ద వింత. కానీ, ఇప్పుడు ఆడా, మగా స్నేహితులుగా ఉంటే పెద్దగా తప్పుపట్టడంలేదు. కానీ, ఆ స్నేహితుడు హఠాత్తుగా ‘ఐ లవ్ యు’ చెప్పాడనుకోండి.. అప్పుడు అమ్మాయి ఇరుకుల్లో పడిపోతుంది. గతంలో ప్రియాంకా చోప్రాకి అలానే జరిగిందట. ఇటీవల ఓ సందర్భంలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ - ‘‘ఇది నేను సినిమాల్లోకి రాకముందు జరిగిన సంఘటన. నేనూ, ఒక అబ్బాయి చాలా స్నేహంగా ఉండేవాళ్లం.
తనలో నేను మంచి స్నేహితుణ్ణి చూసుకుంటే, తను మాత్రం నన్నో ప్రేయసిగా చూశాడు. కానీ, ఆ విషయాన్ని నేను గ్రహించలేదు. ఓ రోజు తన ప్రేమను నా దగ్గర వ్యక్తపరిస్తే, నేను షాకయ్యాను. అలాంటి సంఘటనలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. నేను చాలా బాధపడ్డాను. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతున్నాననే బాధ అది. అతనితో జీవితాంతం స్నేహంగా ఉండాలనుకున్నాను. కానీ, ఎప్పుడైతే అతని ప్రేమను తిరస్కరించానో నాకు దూరమయ్యాడు. అప్పట్నుంచీ అబ్బాయిలతో స్నేహం అంటే ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుంటున్నాను’’ అని చెప్పారు.