రుణం చె ల్లించకుంటే ఫ్లాట్ల స్వాధీనం | bank notes to rajiv swagruha flat owners | Sakshi
Sakshi News home page

రుణం చె ల్లించకుంటే ఫ్లాట్ల స్వాధీనం

Published Sat, Jan 11 2014 12:00 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

bank notes to rajiv swagruha flat owners

ఆలంపల్లి, న్యూస్‌లైన్: రాజీవ్ గృహకల్ప కింద మంజూరైన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలు చెల్లించకుంటే ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని తాండూరు, వికారాబాద్ రాజీవ్ గృహకల్ప సముదాయాల లైజన్ అధికారి మల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఆంధ్రాబ్యాంక్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2007లో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి, పేద ప్రజలకు 1458 ఫ్లాట్లను కేటాయించిందని అన్నారు. వీటిని లబ్ధిదారులు సొంతం చేసుకునేందుకు వీలుగా వికారాబాద్‌లోని ఐదు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసిందన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు 190 ఫ్లాట్లకు, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ 387, ఆంధ్రా బ్యాంకు 389, కెనరా బ్యాంకు 216, ఎస్‌బీహెచ్ 276 ఫ్లాట్ల లబ్ధిదారులకు రుణాలు ఇచ్చాయని వివరించారు. అయితే లబ్ధిదారులు అప్పటినుంచి బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.15కోట్ల వరకు రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు కట్టకుంటే ఇళ్లు రద్దు చేస్తామని పలుమార్లు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోయిందన్నారు.
 
 ఈ పరిస్థితుల్లో 185 జీఓ ప్రకారం రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా నివాసం ఉండని, వేరొకరికి అద్దెకు ఇచ్చిన వారి ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం హౌసింగ్ జిల్లా పీడీ, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత బ్యాంకు మేనేజర్‌తో కమిటీ వేశామన్నారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలించి రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా ఉండని, ఇళ్లకు తాళాలు వేసిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తుందని వివరించారు. నోటీసులు ఇచ్చిన 15 రోజుల్లో రుణాలను చెల్లించకపోతే గృహాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో లబ్ధిదారుల నుంచి ఇతరులు ఫ్లాట్లు కొంటే చెల్లదని, పూర్తిహక్కు గృహనిర్మాణ శాఖదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణారావు, కెనరా బ్యాంకు మేనేజర్ సుబ్బారావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు రాజారావు, రవీందర్, నరోత్తంరెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 వన్‌టైమ్ సెటిల్‌మెంట్...
 రాజీవ్‌గృహకల్పలో గృహాలకు సంబంధించి రుణాలను పొంది వాయిదాలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇచ్చిన రుణంలో 60శాతం చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఆరు సంవత్సరాలకు సంబంధించి 84 వాయిదాలు నిర్ణయించామని, ఇప్పటివరకు 34 నెలలు గడిచాయని అన్నారు. వాయిదాలు చెల్లించని వారు రూ.34 వేలు చెల్లిస్తే వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement