'బ్యాంకర్లు రుణమాఫీకి అంగీకరించటం లేదు'
హైదరాబాద్ : రైతు రుణమాఫీపై ఉమ్మడి రాష్ట్రంలో హామీ ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర విబజన తర్వాత ఆ హామీ నుంచి వెనక్కి తగ్గలేకపోయామన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశం పెట్టామని పత్తిపాటి పేర్కొన్నారు.
అప్పటికి, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితిలో చాలా తేడా ఉందని ఆయన అన్నారు. రుణమాఫీకి బ్యాంకర్లు అంగీకరించటం లేదని పత్తిపాటి తెలిపారు. 26వ తేదీన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాతే స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. కాగా ఆర్‌బీఐ అభ్యంతరాల నేపథ్యంలో కోటయ్య కమిటి తుది నివేదిక ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే.
వ్యవసాయ రుణ మాఫీకి సహకరించాలని చంద్రబాబు ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. దీనిపట్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే చంద్రబాబు లేఖ రాయడానికి ముందే ఆర్‌బీఐ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రుణ మాఫీపై లేఖలు రాసిన విషయం తెలిసిందే.