వారంలోగా రైతుల ఖాతాల వివరాలివ్వండి | Bankers request to the Chief Chandrababu | Sakshi
Sakshi News home page

వారంలోగా రైతుల ఖాతాల వివరాలివ్వండి

Published Tue, Sep 16 2014 12:40 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

వారంలోగా రైతుల ఖాతాల వివరాలివ్వండి - Sakshi

వారంలోగా రైతుల ఖాతాల వివరాలివ్వండి

బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు వినతి
ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్ లేకపోతే మాఫీ వర్తించదు
సహకార సంఘాలు చేతితో ఎక్సెల్ షీటులో నమోదు
ముగిసిన ఆన్‌లైన్ సమాచారం గడువు
 నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

 
హైదరాబాద్: వారంలోగా రైతుల ఖాతాల సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా ఏపీసీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. వాస్తవానికి గత నెల 28వతేదీతోనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌కు రైతుల ఖాతాల సమాచారం ఇవ్వడానికి గడువు పూర్తి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ మార్గదర్శకాల్లో ఈ నెల 1వ తేదీన మార్పులు చేయడంతో మరో పక్షం రోజుల్లో సమాచారం ఇవ్వడానికి గడువిచ్చింది.అది కూడా సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అందులో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఒక రైతుకు సంబంధించిన రుణ ఖాతా సమాచారమైనా అందలేదని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌కు 38 లక్షలఖాతాల వివరాలు వచ్చాయి. అందులో ఇంకా 17 కాలాలను పూరించాలి. వాటిని బ్యాంకులు బ్రాంచీల వారీగా సమాచారాన్ని సేకరించి పూర్తిచేయాలి.

ఇప్పటి వరకు అది కాలేదు. రైతుల నుంచి ఆధార్, రేషన్ కార్డులను, సర్వే నంబర్లను సేకరించి నమూనా పత్రాన్ని నింపాలి. ఇందుకోసం మరో వారం గడువు ఇస్తున్నామని, అప్పటికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. ఆధార్, రేషన్ కార్డుల వివరాలు తప్పనిసరని లేకుంటే రుణ మాఫీ వర్తించదని ఆయన స్పష్టం చేశారు. సహకార బ్యాంకుల రుణ ఖాతాల వివరాలు కంప్యూటరీకరణ లేనందున ఆ వివరాలను ఎక్సెల్ సీటులో నమోదు చేస్తున్నారు. ఎక్సెల్ షీటులో నమోదు చేస్తున్నవి సక్రమంగా ఉన్నాయో లేదో ఎక్కడా చెక్ ఉండదని, వాటిని మళ్లీ పరిశీలించాల్సి ఉందని అధికారులు వివరించారు.  కొంత మంది రైతుల దగ్గర రేషన్, ఆధార్ కార్డులు లేవని అధికారులు పేర్కొనగా.. అవి ఉంటేనే మాఫీ అని చెప్పాలని, అవి తెచ్చిన వారి వివరాలే మాఫీ జాబితాలో పేర్కొనాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ నెలాఖరుకు కొన్ని రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతాయని, దీంతో బ్యాంకులు చాలా నష్టపోవాల్సి వస్తుందని, వీలైనంత త్వరగా మాఫీని తేల్చాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోరింది. దీనిపై సీఎం స్పందిస్తూ.. బ్యాంకర్లు వివరాలను త్వరగా ఇస్తే ఎంతో కొంత మేర రుణ మాఫీకి నిధులివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.రుణ ఖాతాల వివరాలకు చెందిన సమాచార సేకరణపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement