బ్యాంకింగ్ ఉద్యోగమే లక్ష్యం
బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం శిక్షణ
డిగ్రీ అర్హతతో చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం
ఏటా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం కళాశాలల నుంచి పోటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా ఉద్యోగాల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అయితే ఒక్క బ్యాంకింగ్ రంగంలో మాత్రమే పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. పలు బ్యాంకులు తమ శాఖలను విస్తరించడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. దీంతో యువత ఆ ఉద్యోగాల సాధన కోసం శిక్షణ పొందుతోంది. గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లల్లో నిరంతర సాధన చేస్తూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది.
మచిలీపట్నం (ఈడేపల్లి) : బ్యాంకు ఉద్యోగాలంటే గతంలో నిరుద్యోగులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కారణం ఉద్యోగాలపై అవగాహన లేమి, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే బ్యాంకింగ్ రంగంలో ఖాళీలు తక్కువ ఉండడమే. ఇటీవల కాలంలో బ్యాం కుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టు సిబ్బంది, నిపుణులైన యువత కావాలి. ఖాళీలు, వేతనాలు ఎక్కువగా ఉండడంతో నిరుద్యోగులతో పాటు చిరుద్యోగులు కూడా ఈ కొలువులకు సై అంటున్నారు. బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా ఇతర అన్ని ప్రభుత్వరంగ సంస్థల బ్యాంకులు ఉద్యోగాల భర్తీకోసం అధిక సంఖ్యలో ప్రకటనలు వెలువరిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పరీక్షలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పరీక్షల్లో వేల సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. బ్యాంకు ఉద్యోగాలకు డిగ్రీలో 60శాతం మార్కుల వచ్చిన వారే అర్హులు. ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంకు, అనుబంధ సంస్థలు ఒకే విధమైన పరీక్షలు నిర్వహిస్తే, మరో 19 రకాల బ్యాం కులకు అవసరమయ్యేలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్(ఐబీపీఎస్) బ్యాంకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ప్రశ్న పత్రాలు ఇలా...
ఎస్‌బీఐ పరీక్షలో వివిధ విభాగాలుగా 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏ విభాగంలో తక్కువ మార్కులు వచ్చినా పరీక్షలో ఉత్తీర్ణులు కానట్టే. జనరల్ నాలెడ్జ్‌లో సమకాలీన అంశాలతో పాటు అన్నిరంగాల్లో పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిషులో గ్రామర్‌పై అవగాహన ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్‌లో బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎడిటింగ్, విండోస్, లాంగ్వేజెస్ తెలిసి ఉంటే చాలు. బిజినెస్ పత్రికలు, బిజినెస్ చానళ్లు వీక్షించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసుకుంటే షేర్ మార్కెట్లపై పట్టు వస్తుంది. ప్రణాళిక ప్రకారం చదివితే పరీక్ష ఎంత కఠినంగా ఉన్నా విజయం సాధించడం తేలికేనని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)గా నియమితులైన సమీర్ పేర్కొన్నారు.
నిరంతర సాధనే విజయానికి సోపానం
నిరంతర సాధనతో బ్యాంకింగ్ పరీక్షల్లో విజయం సాధించడం సులువేనని మచిలీపట్నానికి చెందిన కోచింగ్‌సెంటర్ నిర్వాహకుడు ఎం.ఎస్.నాయుడు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సూచనలు ఇవీ.. ప్రశ్నలకు జాగ్రత్తగా, నేర్పుతో, సమయం వృథా చేయకుండా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. తెలియని వాటిని వదిలేయడం మేలు. రీజ నింగ్‌లో 30 మార్కుల వరకు డెషిషన్ మేకింగ్‌పై ప్రశ్నలు వస్తాయి. ఐబీపీఎస్ పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రశ్నలు అడుగుతుంటారు.నమూనా ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవ్వాలి. ఆన్‌లైన్ పరీక్షలు ప్రాక్టీసు చేయాలి. పట్టుదలతో చదివితే గెలుపు సాధ్యం. ప్రతి బిట్టూ ఉద్యోగ సాధనలో కీలకం అనే విషయం మర్చిపోకూడదు. రీజనింగ్‌పై ఎక్కువ పట్టు సాధించాలి.
ఉజ్జ్వల భవిష్యత్తుకు మార్గం
బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. ఇవి పూర్తిగా అభ్యర్థి సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. క్లర్క్ ఉద్యోగంతో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టిన వారు కూడా చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఉజ్జ్వల భవిష్యత్తుకు బ్యాంకు ఉద్యోగాలు మంచి మార్గం. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యువత సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా పొందుతారు.
-పి.వి.శేఖర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఏజీఎం
పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తూనే
పోస్టల్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నా. డిగ్రీతో బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలుసుకున్నా. దీంతో రెండేళ్లుగా ఉద్యోగాల కోసం సాధన చేస్తున్నా. పోస్టాఫీస్ నుంచి ఇంటికి రాగానే రోజూ నాలుగు గంటలకు తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా సిలబస్‌ను అధ్యయనం చేస్తున్నా. ఇప్పటి వరకు పదికి పైగా బ్యాంకింగ్ పరీక్షలు రాశా. ఇంటర్వ్యూలో మిస్ అవుతూ వచ్చాను. ఈ సారి తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
- కె.వెంకటే శ్వరరావు, పిట్టల్లంక(కోడూరు)
బ్యాంకింగ్‌లో ఎన్నో అవ కాశాలు
బీటెక్ పూర్తిచేశా. సాఫ్ట్‌వేర్ రంగం కంటే బ్యాంకింగ్‌లోనే యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రహించా. ఆరు నెలల నుంచి కోచింగ్ సెంటర్‌లో సాధన చేస్తున్నా. రోజూ కోచింగ్‌లో నేర్చుకున్న అంశాలను రెండు గంటల పాటు పునఃశ్చరణ చేస్తూ వస్తున్నా. ప్రణాళికతో అధ్యయనం చేస్తే ఉద్యోగం పొందండం అంత కష్టమేమీ కాదు. సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయడం ముఖ్యం.
- ఎస్.దివ్య, బీటెక్