దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై దృష్టి పెట్టింది.
"మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే జనరల్ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ఇటీవల ఎంట్రీ లెవల్‌తోపాటు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ అర్హుల నియామకాలను ప్రకటించాం" అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వార్తా సంస్థ పీటీఐకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
"మా టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు మొదలైన ప్రత్యేక ఉద్యోగాలపై ఉంది. టెక్నాలజీ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. కాబట్టి, మొత్తంగా ప్రస్తుత సంవత్సరంలో 8,000 నుంచి 10,000 మంది అవసరం మాకుంది. ప్రత్యేక విభాగంతోపాటు సాధారణ విభాగంలోనూ ఉద్యోగుల చేరిక ఉంటుంది" అని పేర్కొన్నారు.
ఎస్‌బీఐలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296. ఇందులో 1,10,116 మంది ఆఫీసర్లు. ఇక బ్యాంక్ నెట్‌వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్‌బీఐ యోచిస్తోందని శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. ఇవి కాకుండా 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కరస్పాండెంట్ కేంద్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment