తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ‘‘బ్యాంకులే రూ.పది నాణేలు ఇచ్చాయి. మరలా వాటిని తిరిగి బ్యాంకులో వేద్దామంటే తీసుకోవడం లేదు. పసుపు కుంకుమ పేరిట ఇచ్చిన సొమ్ముల్లో భాగంగానే అవి బ్యాంకు అధికారులు ఇచ్చారు. వాటిని బయట మారుద్దామంటే ఎవ్వరూ తీసుకోవడం లేదు. పోనీ బ్యాంకులకు వెళితే వారు కూడా వద్దంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు’’ ఇదీ ప్రస్తుతం పలు డ్వాక్రా సంఘాల మహిళల ఆవేదన. ఎందుకో ఏమో తెలీదు.. కొన్ని నెలలుగా రూ.10 నాణెం మారడం లేదు. నేడు మార్కెట్లో ఆ నాణేనికి విలువ లేకుండా పోయింది. బ్యాంక్‌లు గానీ, చివరకు ఆర్‌బీఐ గాని రూ.పది నాణేలు మారవని అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా ప్రతి వ్యాపారి రూ.పది నాణేన్ని తిరస్కరిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిలకు కొద్ది రోజుల ముందు పసుపు–కుంకుమ పథకం పేరుతో మూడు విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళకు రూ.పది వేలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.పది నాణేలను పెద్ద మొత్తంలో ఈ పథకంలో బ్యాంక్‌లు డ్వాక్రా మహిళలకు అంటగట్టాయి. బ్యాంక్‌లు ఇచ్చిన రూ.పది వేల సొమ్ముల్లో రూ.వెయ్యి పదిరూపాయల నాణేలను అంటగట్టడంతో వాటిని మార్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. చివరకు వ్యాపారులు, వివిధ రకాల దుకాణదారులే కాదు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో కూడా కండెక్టర్ రూ.పది నాణేన్ని తీసుకోకపోవడంతో ఈ నాణేలు ఇంక మారవన్న నిర్ణయానికి వచ్చేసి తమ వద్దే వాటిని అలా నిరుపయోగంగా ఉంచుకున్నారు.
సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ డ్వాక్రా మహిళ బుధవారం ఉదయం అంబాజీపేటలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. అంబాజీపేటలోని ఓ బేకరి దుకాణంలో కొన్ని పదార్థాలు కొనుగోలు చేసి నోట్లతో పాటు ఓ రూ.పది నాణెం కూడా ఇచ్చింది. దుకాణదారుడు ఆ నాణేన్ని తిరస్కరించి ఇది మారడంలేదు. రూ.పది నోటు ఇవ్వమని చెప్పాడు. ఆ మహిళ చాలా అసహనంగా ‘చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులండి బాబు... ఆర్టీసీ బస్సులో కండెక్టర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీరు తీసుకోవడం లేదు. గత నెల రోజులుగా ఈ నాణేలను మార్కెట్లో ఏమైనా కొన్నప్పుడు ఇవ్వడం, వారు మారదనడం మాకు మామాలైపోయింది’ చెప్పడం గమనార్హం. ఈ పథకం కింద బ్యాంక్‌లు పరోక్షంగా బాబు ప్రభుత్వం అంటగట్టిన రూ.పది నాణేలను మార్చడం డ్వాక్రా మహిళలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇదే విషయాన్ని చాలా మంది మహిళలు సంబంధిత బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ‘అవి ఎందుకు మారవు’ అని అంటున్నారే తప్ప, ‘తిరిగి మీ బ్యాంక్‌లోనే ఈ నాణేలను జమ వేసుకోండి’ అని మహిళలు అంటుంటే‘ మేము జమ చేసుకోబోమ’ని బదులిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అంతటా పలు మండలాల్లో డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న రూ.పది నాణేల సమస్యను ఓట్ల లెక్కింపు హడావుడిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.వెయ్యి అంటే జిల్లాలో లక్షల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ఈ నాణేల వల్ల నష్టం కూడా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. బ్యాంక్‌లు ఇచ్చిన మారని ఈ నాణేలను తిరిగి బ్యాంక్‌ల్లో జమ చేసే అవకాశాన్ని కల్పించాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment