హస్తినలో కుస్తీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోరాటాల పురిటిగడ్డ మెతుకుసీమ నేతలంతా తెలంగాణ కోసం హస్తినలో కుస్తీ పడుతున్నారు. సీమాంధ్ర నేతల దీక్షలు, లాబీయింగ్‌ల నేపథ్యంలో జిల్లా నేతలు కూడా ఢిల్లీకి మకాం మార్చారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట వారసత్వంతో మెదక్ జిల్లా ఆడబిడ్డలు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి తెలంగాణ కోసం మరోసారి తమ పోరాట పటిమను ప్రదర్శించారు. ఏకంగా ముఖ్యమంత్రి బస్సుకు అడ్డుపడి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జై తెలంగాణ నినాదాలతో ఢిల్లీ వీధులను హోరెత్తించారు.
జిల్లా నేతలంతా ఢిల్లీలోనే
సాధారణ ఎన్నికలు సమీపించడంతో పాటు తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరిన ప్రస్తుత సమయంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నేతలంతా గట్టిపట్టుమీదనే ఉన్నారు. తెలంగాణ బిల్లును గట్టెక్కించి... తాము కూడా ఒడ్డున పడాలనే ప్రయత్నంలో మెతుకుసీమ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, ఎంపీలు సురేష్ షెట్కార్, విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో గట్టెక్కించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఎవరి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా నేతలు బుధవారం ఏకంగా సీఎంనే అడ్డుకుని నిరసన తెలిపారు.
హోరెత్తిన తెలంగాణ నినాదాలు
ఢిల్లీలో ఇటు సీమాంధ్ర నేతలకు, అటు తెలంగాణ నేతలకు కామన్ షెల్టర్ గామా రిన ఏపీ భవన్‌లో తెలంగాణ నినాదం మార్మోగింది. బుధవారం ఇక్కడే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ భవన్ నుంచి బస్సులో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన సమయంలో జిల్లా మహిళా మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి మెరుపు వేగంతో ముఖ్యమంత్రి బస్సును అడ్డుకున్నారు. బస్సుకు అడ్డంగా పడుకున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నావంటూ కిరణ్‌ను నిలదీశారు. తెలంగాణను అనుకూలంగా నినాదాలు చేశారు.
వారిద్దరినీ మిగిలిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు అనుసరించారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు తేరుకొని వారిని నిలవరించే లోపే మంత్రులు సీఎంకు తెలపాల్సిన నిరసన తెలిపారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు మంత్రులను బలవంతంగా ఈడ్చివేశారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళా మంత్రులు స్వల్పంగా గాయపడ్డట్టు తెలిసింది.