ఇందూరు, న్యూస్‌లైన్:
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు సంబంధిం చిన ఎలాంటి బిల్లైనా ఇక ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరగనున్నాయి. సాంఘిక,గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మాదిరిగానే వెనుకబడిన తరగతుల(బీసీ) సంక్షేమ వసతి గృహాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ-హాస్టళ్ల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి నెలా వసతి గృహాల వార్డెన్లు సంబంధింత అధికారులకు ఆన్‌లైన్‌లో బిల్లులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో బిల్లులను ముందుగానే చేసుకుని పెట్టుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ అన్ని జిల్లాల బీసీ సంక్షేమాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు జిల్లాలోని సూమారు 44 వసతి గృహాల వార్డెన్‌లతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాష్ట్ర అధికారుల అదేశాల మేరకు వచ్చే నెలనుంచి వసతి గృహాల బిల్లులు హాజరు శాతం ఆధారంగా చెల్లించడం నున్నట్లు, ఇందుకు వార్డెన్‌లు ఈ నెల 26 లోగా బిల్లులు ఆన్‌లైన్ చేయాలని నిబంధనలు పెట్టారు. ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లింపు జరుగుతున్నందునా ఇక అక్రమాలు జరిగే అవకాశాలుండవని సంక్షేమాధికారులు భావిస్తున్నారు.
చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు...
బీసీ సంక్షేమ వసతి గృహాల అన్ని బిల్లులు ఆన్‌లైన్‌లోనే చెల్లించనున్న నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వారంలో జిల్లాలోని అందరు బీసీ వార్డెన్‌లకు ఈ-హాస్టల్ సాప్ట్‌వేర్‌పై ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. అయితే ఆన్‌లైన్ వ్యవస్థ అంటే ఏంటో తెలియని వార్డెన్‌లు కొందరు ఉన్నారు. శిక్షణలో అందరితో పాటు వారు కూడా కూర్చోని చెప్పినట్లు తలూపారు. కానీ శిక్షణ తీసుకుని 40రోజులు గడుస్తున్న సూమారు 15 నుంచి 20మంది వార్డెన్‌లకు బిల్లులు ఆన్‌లైన్ చేయడం రాకపోవడం విడ్డూరం. ప్రస్థుతం ఈ నెల 26లోగా బిల్లులు ఆన్‌లైన్ చేయాల్సి ఉన్నందునా ఏం చేయాలో వారికి పాలు పోవడంలేదు. ఈవిషయం తెలుసుకున్న జిల్లా బీసీ సంక్షేమాధికారులు వారికి హెచ్చరికలు జారీ చేశారు.
ఆన్‌లైన్ చేయని వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నోటీసులు లేదా చార్జీ మెమోలు ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ చేయరాని వార్డెన్‌ల పరిస్థితి ఏటు తోచని విధంగా తయారైన నేపథ్యంలో బిల్లులు ఆన్‌లైన్ చేయడానికి వారు ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌లను పెట్టుకున్నట్లు సమాచారం అందింది.
ఈ-హాస్టల్ అంటే...?
ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-హాస్టల్ వ్యవస్థను ప్రవేశ పెట్టిం ది. ఈ వెబ్‌సైట్ ఇతరులకు ఎవరికి ఓపెన్ కాకుండా ముందు జాగ్రత్తగా సాంఘీక,గిరిజన,బీసీ శాఖల వారిగా వేరు వేరు పాస్‌వర్డ్‌లను ఇచ్చింది. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలంటే శాఖల వారిగా ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. వసతి గృహాల వివరాలు అన్ని ఇందులోనే నమోదు చేస్తారు. ఫర్నిచర్, విద్యార్థులకు అందజేసిన దుస్తుల వివరాలు, వారి హాజరు శాతం, వారికి అందించే భోజనం, పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి బిల్లులను నెలవారిగా అందులో ఎంట్రీ చేస్తే బిల్లులను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. చివరికి వార్డెన్,వర్కర్‌ల వేతనాలు కూడా ఆన్‌లైన్ నుంచే ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఒకవేళ వార్డెన్‌లు బిల్లులు ఆన్‌లైన్ చేయకపోతే బిల్లులు మంజూరు కావు. నిర్లక్ష్యం చేసిన వార్డెన్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఆన్‌లైన్ చేయని వారిపై చర్యలు..
నవంబర్ నుంచి బీసీ వసతి గృహాల బిల్లులన్నీ ఆన్‌లైన్ నుంచే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈనెల 26లోగా బిల్లులు ఆన్‌లైన్ చేయాలని అందరూ వార్డెన్‌లకు ఆదేశాలు జారీ చేశాం. ఆన్‌లైన్ చేయని వారిపై చర్యలు తీసుకుంటాం.
- విమలాదేవి,జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి
‘బీసీ’ బిల్లులూ ఇక ఆన్‌లైన్‌లోనే..
Published Fri, Oct 25 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement