ఒంగోలు టూటౌన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసులు 216–17 ఆర్ధిక సంవత్సరంలో శివ కేశవ సగర ఉప్పుర సొసైటీ కింద జేసీబీ యూనిట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. రూ.13 లక్షల సబ్సిడీ కాగా రూ.13 బ్యాంకు రుణం కింద మంజూరైంది. బ్యాంకులో నగదు జమైనట్లు అతని సెల్‌కు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు పోతే డబ్బులు రాలేదని అధికారులు తిప్పిపంపుతున్నారు. ఇలా ఒకటిన్నర సంవత్సరంగా బ్యాంకు చుట్టూ, బీసీ కార్పొరేషన్ చుట్టూ రుణం కోసం తిరుగుతూనే ఉన్నాడు. శ్రీనివాసులు లాంటి వారు ఎంతో మంది రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
జిల్లాలో రజక ఫెడరేషన్లు 24 ఉండగా వాటిలో సుమారుగా 10 ఫెడరేషన్లకు రుణాలు మంజూరయ్యాయి. ఈ గ్రూపులలో దాదాపు 150 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరు కూడా 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే రుణాలకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణం అందని పరిస్థితి ఉంది. జిల్లాలో బీసీ ఫెడరేషన్లకు రుణాలు అందని ద్రాక్షగా మారింది. రెండేళ్లుగా చాలా మంది లబ్ధిదారులకు రుణాలు అందక అటు బ్యాంకుల చుట్టూ, ఇటు బీసీ కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితి నెలకొంది. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో కొతపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసరావు మరో 12 మంది సభ్యులతో కలిసి శివ కేశవ సగర ఉప్పర సొసైటీ (ఫెడరేషన్) ఏర్పాటు చేసి, బీసీ కార్పొరేషన్ ద్వారా జేసీబీ యూనిట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాడు.
యూనిట్ మొత్తం విలువ రూ.26 లక్షలు. దీనిలో రూ.13 లక్షలు సబ్సిడీ కాగా, రూ.13 లక్షలు బ్యాంకు రుణంగా మంజూరైంది. రుణం మంజూరుకు బ్యాంకులో రూ.30 లక్షల విలువైన ప్రాపర్టీని హామీగా చూపించారు. ఈ రుణం మంజూరుకు సంబంధించి 2017 డిసెంబర్ 30న చెక్ మంజూరైంది. చెక్ మంజూరు అయినట్లు ఆన్‌లైన్ మెసెజ్ కూడా లబ్ధిదారుని సెల్‌కు వచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయినట్లు చెక్ నెంబర్‌తో సహా ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. బ్యాంకుకు పోయి అధికారులను అడిగితే డబ్బులు జమకాలేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుడు అయోమయానికి గురయ్యారు. చేసేదేం లేక శివ కేశవ సగర ఉప్పర సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ అయిన ఎస్.ఏడుకొండలు దృష్టికి తీసుకెళ్లాడు. వస్తాయి అని చెబుతున్నారే కానీ ఇంతవరకు రుణం అందలేదని బాధితుడు శ్రీనివాసులు ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రుణం కోసం తిరగడానికి వివిధ ఖర్చుల నిమిత్తం దాదాపు లక్ష వరకు సొంత ఖర్చులు అయినట్లు తెలిపాడు. ఇతనే కాకుండా ఇంకొంత మంది లబ్ధిదారులు ఇలానే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని బీసీ సంఘం నాయకుడు బంకా చిరంజీవి తెలిపారు.
రజక ఫెడరేషన్ రుణాలదీ అదే పరిస్థితి
అదే విధంగా రజక ఫెడరేషన్లకు సంబంధించిన రుణాలు ఇంత వరకు లబ్ధిదారులకు అందలేదని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండయ్య తెలిపారు. జిల్లాలో మొత్తం 24 రజక ఫెడరేషన్లు ఉంటే వాటిలో దాదాపు 10 ఫెడరేషన్ల వరకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. కానీ ఏ ఒక్క ఫెడరేషన్‌కు డబ్బులు చేతికందలేదని తెలిపారు. ఆన్‌లైన్‌లో రుణాలు మంజూరైనట్లు చూపిస్తూ ప్రభుత్వమే మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ్‌కాలనీ, విజయ నగర్ కాలనీ, ఎన్‌జీవో కాలనీల్లోని గ్రూపులకు మంజూరు రుణాలు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపారు.
గత ఏడాది నాగులుప్పలపాడు మండలం కార్యాలయం నుంచి మంజూరైన నగదు వివరాలను స్థానిక బ్యాంకులకు ఆన్‌లైన్ ద్వారా పంపించనందున దాదాపు రూ.80 లక్షల రుణాలు లబ్ధిదారులకు అందకుండానే మురిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల వల్ల ఉప్పుగుండూరు, మద్దిరాలపాడు, అమ్మనబ్రోలు గ్రామాలకు చెందిన రజక సంఘాల లబ్ధిదారులు దాదాపు 40 మంది తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫెడరేషన్ల రుణాల మంజూరులో గందరగోళంపై ఇటీవల మీకోసం కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అధికారులకు ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి బీసీ కార్పొరేషన్ ఈడీకే పంపించడం వలన అది బుట్టదాఖలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు బ్యాంకులో పెండింగ్ పడటానికి కారణం ప్రభుత్వమేనని మండిపడ్డారు. సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా, రుణాలు మంజూరైనట్లు ఆన్‌లైన్‌లో పురోగతి చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ల రుణాలు లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment