పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు | BC introduced a resolution Reap - Assembly approved | Sakshi
Sakshi News home page

పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు

Published Sun, Sep 7 2014 1:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు - Sakshi

పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు

బీసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం - అసెంబ్లీ ఆమోదం
 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ (వెనుకబడిన తరగతుల) ఉద్యోగుల కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. మరీ వెనకబడిన కులాల(ఎంబీసీల)కు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పిస్తామని, పరోక్ష ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తామని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు బీసీలకు రాయితీలు కల్పిస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో బీసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. ఎంబీసీలకు రిజర్వేషన్ల శాతం పెరిగే విధంగా కేటగిరీల్లో మార్పులు చేస్తామని, వాల్మీకి లాంటి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షలు, గాయపడితే రూ. లక్ష సహాయం అందిస్తామని ప్రకటించారు. చేతివృత్తుల వారికి ఇంటితో పాటు వర్క్‌షెడ్‌ను నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పా రు. వారికి ఆరోగ్యబీమా కల్పించడంతో పాటు వృద్ధాప్య పింఛను రూ. 1,000 ఇస్తామన్నారు. బీసీలు తీసుకున్న రుణాలు, చేనేత రుణాలూ మాఫీ చేస్తానన్నారు. జరీపై వ్యాట్ రద్దు చేస్తామని, మూతపడిన చేనేత సంఘాలను తెరిపిస్తామని, వాటి బకాయిలు రద్దు చేస్తామని చెప్పా రు. చీర, ధోవతి పథకానికి సబ్సిడీ పునరుద్ధరిస్తామన్నారు. చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులకు ఉచితంగా బియ్యం ఇస్తామని, వేటకు వెళ్లి చనిపోతే రెండేళ్ల తర్వాత రూ. 5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. గొర్రెలకు మొబైల్ క్లినిక్‌ల ద్వారా మందులు పంపిణీ చేస్తామని, అన్ని జిల్లాల్లో జీవాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

గందరగోళంలోనే బిల్లుకు ఆమోదం

అయితే.. ఈ తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వకుండానే.. మూజువాణి ఓటుతో అసెంబ్లీలో ఆమోదించారు. తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అవకాశం ఇవ్వకుండా తీర్మానం ఆమోదించటం పట్ల విపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతుండగానే.. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా శాసనసభ ఏ చర్చా లేకుండానే ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలని మంత్రి యనమల ప్రతిపాదిం చారు. ఆ వెంటనే మూజువాణి ఓటులో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించడం జరిగిపోయింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.

కొత్త పన్నులుండవు: మండలిలో యనమల

ప్రజల మీద కొత్త పన్నుల భారం వేయబోమని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వసూలు చేస్తున్నామని.. ఈ వ్యాట్‌ను పెంచడానికి అవకాశం లేదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శనివారం శాసనమండలిలో నామమాత్రంగా జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ.. పన్నుల సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తీసుకురావడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ చక్రపాణి ప్రకటించారు.    
 
చర్చలో సభ్యులు ఏమన్నారంటే..
 
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి వాల్మీకులు శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ లు. కానీ రాయలసీమలో బీసీలు. కాపులను బీసీల్లో చేర్చడానికి రూ. 40కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. వాల్మీకులకు కనీసం ఒక్కపైసా అయినా ఖర్చు పెట్టిందా? వాల్మీకులను ఎస్టీ ల్లో చేర్చడానికి వెంటనే చర్యలు చేపట్టాలి.
 
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జయరాం    
 
బీసీలకోసం పాటు పడిందిఎన్‌టీఆర్, వైఎస్‌లే

బీసీలపై ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు వారి కోసం ఎన్‌టీఆర్ ప్రారంభించిన రూ. 2 కిలో బియ్యం ధరను రూ.5.25 చేసింది మరిచారా?. ఎన్‌టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధించగా, దాన్ని రద్దుచేసిన ఘనత బాబుదే. బీసీలందరికీ ఇళ్లు ఇచ్చి గూడు కల్పించింది వైఎస్‌దే. ఆరోగ్యశ్రీతో బీసీలకు కార్పొరేట్  వైద్యాన్ని ఉచితంగా అందించిన నాయకుడు వైఎస్.
 
- వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు
 
రాజ్యాధికారం ఎన్‌టీఆర్ భిక్ష

ఎన్‌టీఆర్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారం దక్కేది కాదు. ఎన్‌టీఆర్ ప్రారంభించిన టీడీపీ వల్లే బీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బీసీల జన గణన ఇప్పటి వరకు చేపట్టకపోవడానికి కాంగ్రెస్ కుట్రే కారణం.
 
- చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు
 
 
 తీర్మానం ఇదీ..

‘‘బీసీలకు చట్టసభల్లో (శాసనసభ, పార్లమెం టులో) 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మొత్తం బడ్జెట్‌లో 25 శాతం నిధులతో బీసీ సబ్‌ప్లాన్ తీసుకురావాలి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలి. బీసీ జనగణన చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు న్యాయం గా రావాల్సిన రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement