తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌ను సత్కరిస్తున్న ఆర్ కృష్ణయ్య, బీసీ నేతలు
సాక్షి, అమరావతి : దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ గుర్తించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను గుర్తించి వారికి పెద్దపీట వేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే పార్లమెంట్‌లో పెట్టిందని తెలిపారు. అందుకు తన బృందంతో కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపి సత్కరించామన్నారు. దేశంలో 36 రాజకీయ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీ చేయని ధైర్యం వైఎస్సార్‌సీపీ చేసిందన్నారు.
టీడీపీ బీసీల పార్టీ అని ప్రగల్భాలు పలకటమే తప్ప, వారికి ఆ పార్టీ చేసిన మేలు ఏమిలేదని ఆయన విమర్శించారు. బీసీలను చంద్రబాబు తన అవసరాలకు మాత్రమే వాడుకున్నారని చెప్పారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ బిల్లుపెట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చరిత్రకెక్కిందని ఆయనన్నారు. రాష్ట్ర తాజా బడ్జెట్‌లో బీసీలకు ఆయన రూ.15 వేల కోట్లపైగా కేటాయించారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని.. ఇప్పటివరకు గరిష్టంగా రూ.5 వేల కోట్లు మించలేదని తెలిపారు. అలాగే, బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు.. కేబినెట్‌లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారని హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment