బీసీ సంక్షేమాధికారి నాగరాణి బదిలీ
Published Wed, Jan 8 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధికారిణి ఆర్.వి.నాగరాణి బదిలీ అయ్యారు. ఆమెను వైఎస్‌ఆర్(కడప)జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పలు క్యాడర్లలో పని చేసిన నాగరాణి 2011 జూలై 25న జిల్లా బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఈమె పైనా, ఆ శాఖపైనా వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. తన చాంబర్‌కు ఏసీ పెట్టించుకోవడం, పిల్లల బట్టలు కుట్టే ఏజెన్సీలతో వివాదాలు, సిబ్బంది బదిలీలు, ఇంక్రిమెంట్లు తదితర అంశాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. లోకాయుక్తలోనూ కేసులు విచారణలో ఉన్నాయి. ఈనెల 23న మళ్లీ లోకాయుక్త విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసుల విచారణకు వీలుగా ముందుగా ఆమెను బదిలీ చేయాలని లోకాయుక్త ఆదేశించడంతో బదిలీ తప్పనిసరి అయ్యింది, ఇదిలా ఉండగా బదిలీని నిలుపుదల చేసుకొనేందుకు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రిని, ఆయన బంధువును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అయితే నాగరాణిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Advertisement