చిలకలపూడి(మచిలీపట్నం) : తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. హైదరాబాదు నుంచి సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో తుపాను ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తుపాను విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ మధ్య కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా జిల్లాని సముద్రతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
సముద్రతీర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునారావాస కేంద్రాల్లో నిరాశ్రయులకు ఆహారం, నీరు, తదితర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో చనిపోయిన బందరు వాసుల మృతదేహాలను, గాయపడిన వారిని వెంటనే తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్న అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు, ప్రత్యేకాధికారులు డి.మధుసూదనరావు, వి.రమేష్‌బాబు, టి.కల్యాణం, సూపరింటెండెంట్ రాధిక పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారుల నియామకం
జిల్లాలోని తుపాను ప్రభావితి మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకంలో గురువారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. మచిలీపట్నం మండలానికి గ్రౌండ్ వాటర్ డెప్యూటీ డెరైక్టర్ వరప్రసాదరావు, నాగాయలంక మండలానికి మైనింగ్ శాఖ ఏడీ బి.రామచంద్రరావు, కోడూరు మండలానికి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, కృత్తివెన్ను మండలానికి డ్వామా ఏపీడీ జె. సురేష్, బంటుమిల్లి మండలానికి బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎం.చినబాబు, అవనిగడ్డ మండలానికి జిల్లా సహకార శాఖ అధికారి వి.రమేష్‌బాబు, మోపిదేవి మండలానికి ఆత్మ ప్రాజెక్టు డెరైక్టర్ వై.ఆనందకుమారిలను నియమించారు. టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో జిల్లా పరిషత్ సీఈవో డి.సుదర్శనం, మత్స్య శాఖ డీడీ టి.కళ్యాణం, డ్వామా పీడీ మాధవీలత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వి.నరసింహులు, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు, జిల్లా ఇన్‌చార్జ్ పంచాయతీ అధికారి వరప్రసాద్‌లను నియమించారు.
అల్లకల్లోలంగా మారిన సముద్ర తీరం
కోడూరు : ‘హుదూద్’ తుపాను ప్రభావంతో కోడూరు మండలం పాలకాయతిప్ప సమీపాన సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలల ఉధృతి పెరిగి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుపాను మరింత బలపడుతుం దని అధికార యంత్రాంగం ఆదేశాల జారీతో తీరప్రాంత జనాలు వణుకుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి
Published Fri, Oct 10 2014 2:20 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement