నేను అడవులు, గుట్టల్లో ఉంటా. నగరం చుట్టుపక్కల చిట్టడవి కూడా లేకపాయె. గ్రానైట్, కంకర క్వారీలంటూ గుట్టల్ని గుల్లచేస్తిరి. తలదాచుకుందామంటే చోటు కరువాయె. గూడు కోసం వెతుక్కుంట శుక్రవారం రాత్రి తొమ్మిదికొట్టంగ కరీంనగర్ వచ్చిన. మార్కెట్ యార్డు దగ్గర కొందరు చూసి నన్ను గెదిమిన్రు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి నాకోసం వెతికిన్రు. చీకట్ల వాళ్లకు దొర్కకుంట తప్పించుకున్న. తెల్లారంగ మెల్లగ బయిలెల్లిన. సివిల్ హాస్పిటల్ దగ్గర్నుంచి.. భూంరెడ్డి దవాఖాన దాటి రఘునందన్‌రావు చౌరస్త చేరిన. పక్కనే ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ కనవడ్డది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న. పోతాంటే పోలీస్ హెడ్‌క్వార్టర్ వచ్చింది. సెంట్రీల కళ్లుగప్పి లోపలికి దూరిన. స్విమ్మింగ్‌పూల్ చుట్టూ చక్కర్లుకొట్టిన.
పోలీసుల్ని చూసి భయమైంది. వాళ్లు పట్టుకుందామని ప్రయత్నించినా దొర్కలే. పారిపోదామని గోడదూకిన. అమ్మో..! జిల్లా జైలు.. ఇక చిప్పతిండే గతయితదని అక్కడనుంచి బయటపడ్డ. పక్కనే మా ఆఫీసు (అటవీ కార్యాలయం) కనవడ్డది. మెల్లగ ఓ బిల్డింగులోకి చొచ్చిన. ఏడుకొట్టంగ వాచ్‌మన్ వచ్చిండు. నన్ను చూసి జడుసుకున్నడు. లోపటనే ఉంచి తలుపులు వెట్టిండు. పెద్దసార్ల చెవునేసిండు.
ఎవరెవరో వస్తున్రు... పోతున్రు. నన్ను పట్టుకొని జంగల్‌ల ఇడుస్తురనుంటే.. ఒక్కరూ దగ్గరకచ్చుడు లేదు. నువ్‌పో అంటే.. నువ్‌పో అనుకున్నరు. నన్ను ఎప్పుడైనా చూసిన్రో.. లేదో! నేను కిటికీల నుంచి తొంగిచూసిన. బయట చాలామంది గుమిగూడిన్రు. కొందరు గూనపెంకలు తీసి చూసిన్రు. తాళ్లు జారవిడిసిన్రు. అవి కాలుకు తట్టుకొని జూగుముడి బిగుసుకున్నది. ఇగ దొరికినట్టే అనుకున్న. అరటిపండ్లు వెట్టిన్రు కానీ ఆకలి తీరలేదు. కడుపుంటతోటి తిక్కరేగింది. ఆఫీసుల సామాన్లన్ని తుక్కుతుక్కు చేసిన. నన్ను పట్టుకునుడు ఎవరి తరం కాక వరంగల్‌కు ఫోన్‌కొట్టిన్రు.
రెస్క్యూ టీమును పిలిపించిన్రు. వాళ్ల దగ్గరున్న తుపాకీ చూసి.. గుండ్లు వేల్చి సంపుతరా ఏందని భయపడ్డ. వాళ్లు ముప్పుతిప్పలు పడి మూడు మత్తుసూదులు గుచ్చిన్రు. సోయిదప్పి పడిపోయిన. అప్పటికి పగటీలి రెండయింది. నన్ను బోన్లవెట్టిన్రు. అందరు సెల్‌ఫోన్ల ఫొటోలు తీస్కున్నరు. బోనుతోనే వ్యాన్ల ఎక్కించి కొడిమ్యాల అడవిల విడిచిపెట్టిన్రు. నేనయితే ఎవరికి ఏ కీడు చేయకుండ దొరికిపోయిన. కానీ.. కరీంనగర్ సుట్టుపక్కల మావాళ్లు మస్తుగున్నరు. ఎప్పుడో ఒక్కప్పుడు ఊరుమీద వడతరు. దొరికినోళ్లని దొరికినట్టు కొరికిసంపుతరు. పాణాల మీద ఆశలుంటే.. మా బతుకు మమ్ముల్ని బతుకనివ్వున్రి. అడవుల్ని పెంచుల్ని. గుట్టల్ని కాపాడుండ్రి. ఇదే లాస్ట్ వార్నింగ్! ఉంటా.. బాయ్!!
- న్యూస్‌లైన్, కరీంనగర్ క్రైం
నేను.. గుడ్డెలుగును!
Published Sun, Sep 29 2013 4:59 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement