గ్రీష్మ తాపాన్ని గేలి చేసే ‘గ్రీన్‌హట్’
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ఎండలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గాలి సూర్యుడు నిశ్వాసలా వేడెక్కుతోంది. తరువుల నీడ తల్లుల చల్లని స్పర్శలా అనిపిస్తోంది. అలాంటిది సూర్యకిరణాన్ని కనీసంగానైనా చొరబడనివ్వనంత దట్టంగా లతలు అల్లుకున్న పొదరిల్లు ఇంకెంత హాయిగా ఉంటుంది! వినూత్నంగా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే కడియం ప్రాంత నర్సరీ రైతులు వేసవి తీవ్రత కాచుకునేందుకు కూడా కొత్త కవచాలను కనిపెడుతుంటారు.
వేసవిలో ఎండలను తట్టుకోలేని సున్నితమైన మొక్కలను కాపాడుకునేందుకు వాటికి నీడను ఇచ్చేందుకు అవిసె, మొక్కజొన్న వంటి మొక్కలను ఇప్పటికే వేసారు. నర్సరీల్లో విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిని షెడ్‌ల మీదికి క్రీపర్‌జాతి మొక్కల లతలను పాకించి, దట్టమైన, పచ్చని పైకప్పులా అల్లుకునేలా చేస్తున్నారు.
కడియం మండలం బుర్రిలంకలోని శ్రీ శేషాద్రి నర్సరీలోని షెడ్డు.. పైన మొత్తం క్రీపర్ జాతి మొక్క అల్లుకోవడంతో చల్లని పొదరిల్లులా మారింది. ఎండ మండే వేళ ఈ షెడ్లో చేరితే.. భూమితల్లి పచ్చని చీరకొంగు కప్పిన అనుభూతి కలుగుతుంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఈ పచ్చని పర్ణశాల ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment