ప్రతీకాత్మక చిత్రం
కడియం(తూర్పుగోదావరి): దృశ్యం సినిమా మాదిరిగా ‘కడియంలో కిడ్నాప్ కలకలం’ ముందస్తు ప్లాన్‌గా తేలింది. కడియంలోని ఓ ప్రైవేటు స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గుర్తు తెలియని యువకులు ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారంటూ సోమవారం కలకలం రేగిన విషయం విదితమే. అయితే ఈ కిడ్నాప్ కథ మొత్తం పథకం రచన చేసింది కడియం గ్రామానికి చెందిన జి.సాయి దుర్గాప్రసాద్ అనే యువకుడేనని పోలీసులు తేల్చారు. అపహరణకు గురైన బాలికకు దుర్గాప్రసాద్ వరుసకు సోదరుడు. తనపై ఉన్న పోక్సో కేసుకు ప్రతీకారంగానే అతడు ఈ కథంతా నడిపిన విషయం బట్టబయలైంది.
చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి
ఈ వివరాలను కడియం పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.రాంబాబు మంగళవారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఒక బాలికను ట్రాప్ చేయడంతో జి.సాయి దుర్గాప్రసాద్‌పై గతంలో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఈ కేసు పెట్టడానికి కారకుడని ఒక యువకుడిపై దుర్గాప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఆ యువకుడిని ఎలాగైనా ఇటువంటి కేసులోనే ఇరికించాలని మరికొందరితో కలిసి పథక రచన చేశాడు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ నాటకానికి తెర తీశారు. అపహరణకు గురైనట్టు చెబుతున్న బాలిక కూడా ఇందుకు సహకరించడంతో అందరూ నిజమేనని నమ్మారు.
అలాగే ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు.. బాలికను తమ ఎదురుగానే కిడ్నాప్ చేశారంటూ కొందరు మైనర్లు కూడా గట్టిగా చెప్పడంతో అటు గ్రామస్తులు, ఇటు పోలీసులు కూడా నమ్మారు. దీంతో బాలికను తీసుకువెళుతున్న ఆటోను, అందులోని యువకులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో అందరూ పరుగులు పెట్టారు. అయితే తాను ఊహించిన దానికి భిన్నంగా అందరూ అప్రమత్తం కావడంతో ఈ నాటకానికి ముగింపు పలకాలని దుర్గాప్రసాద్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద ఆటోలో నుంచి బాలికను దింపేశాడు. కిడ్నాప్‌నకు ప్రయత్నించిన వారు పరారయ్యారని, అడ్డుకోబోయిన తనను గాయపరిచారని నమ్మించాడు. అయితే ఆ గాయాన్ని కూడా అతడే చేసుకున్నాడని తేలింది.
దుర్గాప్రసాద్, బాలిక చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవడంతో ఇన్‌స్పెక్టర్ రాంబాబు, ఎస్సై షేక్ అమీనాబేగం వారిని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి వారి నుంచి పోలీసులు నిజాన్ని రాబట్టారు. కిడ్నాప్ మొత్తం కట్టుకథేనని తేల్చారు. ఆటోలో రావడం, బలవంతంగా తీసుకుపోవడం కూడా ఉత్తదేనని, సదరు బాలికను దుర్గాప్రసాదే మోటార్ సైకిల్‌పై తీసుకువెళ్లాడని నిర్ధారించారు.
అయితే ఆటోను వెంబడిస్తున్నానంటూ పోలీసులను తప్పుదారి పట్టించినట్టు పోలీసు విచారణలో దుర్గాప్రసాద్ బయట పెట్టాడు. ఈ మొత్తం డ్రామాకు దుర్గాప్రసాదే కారణమని, అతడికి బాలికతో పాటు, మరికొందరు మైనర్లు సహకరించారని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ నాటకంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులను మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలోనే వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. ఇంత మందిని హడలెత్తించింది ఒక యువకుడు, కొందరు మైనర్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment