Kidnapping drama
-
అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ
రొంపిచర్ల(గుంటూరు జిల్లా): తుంగపాడు బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన యువతి అదృశ్యం కథ సుఖాంతమైంది. యువతి పరారైందన్న భయంలో యువకుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలతో పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు యువతి సురక్షితంగా ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈపూరు మండలం ఇనిమెళ్లకు చెందిన యువకుడు, రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యువతి ఐదేళ్లుగా ప్రేమించకుంటున్నారు. ఇద్దరూ కలిసి బైక్‌పై వస్తుండగా తుంగపాడు బస్టాండ్ సమీపంలోని సుబాబుల్ తోటల వద్ద యువతి బైక్ దిగి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో యువతి సుబాబుల్ తోటల్లోకి పరారైంది. యువకుడు ఎంతసేపు వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భయపడి ఏం చేయాలో పాలుపోని యువకుడు యువతిని కొందరు కిడ్నాప్ చేసి సుబాబుల్ తోటల్లోకి లాక్కెళ్లారని బాటసారులకు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, రూరల్‌సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ సురేష్‌బాబులు తమ సిబ్బందితో ఘటనా చేరకుని సుబాబుల్ తోటను జల్లెడ పట్టారు. ఓ దశలో యువకుడు యువతిని హత్య చేశానని చెప్పడంతో మృతదేహం ఆచూకీ కోసం రాత్రంతా వెతికారు. ఎంతకీ లభించకపోవడం, యువకుడు పదేపదే పొంతన లేని మాటలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ఆరా తీస్తే యువకుడు అసలు విషయం బయటపెట్టాడు. ఎట్టకేలకు తన కోసం సుబాబుల్ తోటలో వెతుకుతున్న విషయం తెలుసుకున్న ఆ యువతి నేరుగా డీఎస్పీకి ఫోన్ చేసి తాను సురక్షితంగా ఉన్నానని, తన కోసం వెతకవద్దని, తానే పోలీస్‌స్టేషన్‌కు వస్తానని సమాచారం ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన యువతి రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. తర్వాత యువతి, యువకులు తామిద్దరం వివాహం చేసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఇద్దరి కుటుంబ పెద్దలతో పోలీసులు మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు -
ఇదేందయ్యా ఇదీ.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా!.. సినిమా స్టైల్లో..
అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): టైం ఎంత అయిందో మర్చిపోయారు. ఆటలో మునిగిపోయారు. ఉదయం వెళ్లిన చిన్నారులు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. డైరెక్ట్‌గా ఇంటికి వెళితే తల్లిదండ్రులు కొడతారని భయపడ్డారు. పోలీసుల ద్వారా ఇంటికి చేరితే ఏమీ అనరని ప్లాన్ చేసుకున్నారు. అంతే డయల్ యువర్ 100కు ఫోన్ చేసి తామంతా కిడ్నాప్ అయ్యామని చెప్పారు. దీనికి సబంధించి గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 69వ వార్డు రెడ్డితుంగ్లాంకు చెందిన 11 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు ఆదివారం ఆడుకోవడానికి చుక్కవానిపాలెం వద్ద గల ఒక చెరువు వద్దకు వెళ్లారు. సాయంత్ర సమయం దాటి చీకటి పడుతుందడటంతో తల్లిదండ్రులు కొడతారని భావించారు. దీంతో వీరి వద్ద నున్న ఫోన్‌తో డయల్ 100కు ఫోన్ చేసి తాము కిడ్నాప్ అయ్యామని తెలిపారు. ఎక్కడున్నారని పోలీసులు అడగగా.. చుక్కవానిపాలెం సువర్ణ శ్రీనివాసం అపార్ట్మెంట్స్ పక్కనున్న ఎంవీపీ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ వెనుక ఉన్నామని తెలిపారు. దీంతో గాజువాక ఎస్ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను కనుగొని వారిని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిడ్నాప్ కాదని, పిల్లలు భయపడి ఇలా చేశారని పోలీసులు వెల్లడించారు. చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి -
‘దృశ్యం’ సినిమాను తలపించిన ప్రీప్లాన్డ్ కిడ్నాప్ డ్రామా..
కడియం(తూర్పుగోదావరి): దృశ్యం సినిమా మాదిరిగా ‘కడియంలో కిడ్నాప్ కలకలం’ ముందస్తు ప్లాన్‌గా తేలింది. కడియంలోని ఓ ప్రైవేటు స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గుర్తు తెలియని యువకులు ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారంటూ సోమవారం కలకలం రేగిన విషయం విదితమే. అయితే ఈ కిడ్నాప్ కథ మొత్తం పథకం రచన చేసింది కడియం గ్రామానికి చెందిన జి.సాయి దుర్గాప్రసాద్ అనే యువకుడేనని పోలీసులు తేల్చారు. అపహరణకు గురైన బాలికకు దుర్గాప్రసాద్ వరుసకు సోదరుడు. తనపై ఉన్న పోక్సో కేసుకు ప్రతీకారంగానే అతడు ఈ కథంతా నడిపిన విషయం బట్టబయలైంది. చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి ఈ వివరాలను కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ డి.రాంబాబు మంగళవారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఒక బాలికను ట్రాప్ చేయడంతో జి.సాయి దుర్గాప్రసాద్‌పై గతంలో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఈ కేసు పెట్టడానికి కారకుడని ఒక యువకుడిపై దుర్గాప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఆ యువకుడిని ఎలాగైనా ఇటువంటి కేసులోనే ఇరికించాలని మరికొందరితో కలిసి పథక రచన చేశాడు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ నాటకానికి తెర తీశారు. అపహరణకు గురైనట్టు చెబుతున్న బాలిక కూడా ఇందుకు సహకరించడంతో అందరూ నిజమేనని నమ్మారు. అలాగే ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు.. బాలికను తమ ఎదురుగానే కిడ్నాప్ చేశారంటూ కొందరు మైనర్లు కూడా గట్టిగా చెప్పడంతో అటు గ్రామస్తులు, ఇటు పోలీసులు కూడా నమ్మారు. దీంతో బాలికను తీసుకువెళుతున్న ఆటోను, అందులోని యువకులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో అందరూ పరుగులు పెట్టారు. అయితే తాను ఊహించిన దానికి భిన్నంగా అందరూ అప్రమత్తం కావడంతో ఈ నాటకానికి ముగింపు పలకాలని దుర్గాప్రసాద్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద ఆటోలో నుంచి బాలికను దింపేశాడు. కిడ్నాప్‌నకు ప్రయత్నించిన వారు పరారయ్యారని, అడ్డుకోబోయిన తనను గాయపరిచారని నమ్మించాడు. అయితే ఆ గాయాన్ని కూడా అతడే చేసుకున్నాడని తేలింది. దుర్గాప్రసాద్, బాలిక చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవడంతో ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై షేక్ అమీనాబేగం వారిని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి వారి నుంచి పోలీసులు నిజాన్ని రాబట్టారు. కిడ్నాప్ మొత్తం కట్టుకథేనని తేల్చారు. ఆటోలో రావడం, బలవంతంగా తీసుకుపోవడం కూడా ఉత్తదేనని, సదరు బాలికను దుర్గాప్రసాదే మోటార్ సైకిల్‌పై తీసుకువెళ్లాడని నిర్ధారించారు. అయితే ఆటోను వెంబడిస్తున్నానంటూ పోలీసులను తప్పుదారి పట్టించినట్టు పోలీసు విచారణలో దుర్గాప్రసాద్ బయట పెట్టాడు. ఈ మొత్తం డ్రామాకు దుర్గాప్రసాదే కారణమని, అతడికి బాలికతో పాటు, మరికొందరు మైనర్లు సహకరించారని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ నాటకంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులను మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలోనే వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. ఇంత మందిని హడలెత్తించింది ఒక యువకుడు, కొందరు మైనర్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. -
అర్ధరాత్రి అడవిలో అరుపులు వినబడేసరికి..
సాక్షి, బెంగళూరు: సరిగా చదువుకోవడం లేదని తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఓ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపురలో జరిగింది. టెన్త్ బాలిక తల్లి ఇటీవల ఉపాధ్యాయురాలికి ఫోన్ చేసి తన కుమార్తె హోం వర్క్ చేస్తోందా అని విచారించింది. ఈ మధ్య హోం వర్క్ సరిగా చేయడం లేదని టీచర్ బదులిచ్చింది. ఇది తెలిసి విద్యార్థిని శుక్రవారం సాయంత్రం స్కూల్ బస్సు దిగిన వెంటనే ఇంటికి వెళ్లకుండా దగ్గరలోనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బైక్ వెళుతున్న శబ్ధం విని గట్టిగా కేకలు వేయసాగింది. అప్పటికే తన కుమార్తె కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతుకులాట ప్రారంభించారు. ఆ బైక్‌పై వెళుతున్న వ్యక్తి తల్లిదండ్రులకు ఎవరో అడవిలో అరుస్తున్న గొంతు వినపడిందని చెప్పడంతో అంతా వెళ్లి చూడగా కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న విద్యార్థిని కనిపించింది. ప్రశ్నించగా ఎవరో తనను కిడ్నాప్ చేశారని తెలిపింది. తల్లిదండ్రులు నిజమే అనుకున్నా, అనుమానంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా తానే ఈ నాటకమాడినట్లు గుట్టువిప్పింది. ఇంకోసారి ఇలా చేయవద్దని మందలించి పంపేశారు. చదవండి: పోలీసులు.. ఓ తాళిబొట్టు: అసలు ఏం జరిగిందంటే? భార్యను భయపెట్టాలని.. ఆసుపత్రి పాలై.. -
కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ ఆడిన కిడ్నాప్ నాటకానికి పోలీసులు శుక్రవారం తెర దించారు. వారి కథనం ప్రకారం.. తనను ఎవరో బెదిరించారని, ఈ అవమానం భరించలేకపోతున్నానని భార్య కౌసల్యకు చెప్పిన ప్రసాద్ తన బైక్, సెల్‌ఫోన్ ఇంటి వద్ద విడిచిపెట్టి రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లిపోయాడు. దీనిపై కౌసల్య ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్, అతడి స్నేహితుడు పినిపే సందీప్ కాకినాడ సమీపంలోని రాయుడుపాకలు వద్ద ఉన్నట్టు కనుగొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) అక్కడికి వెళ్లి ఇద్దరినీ పట్టుకుని, విచారించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడించారు. కొంతమంది ఇచ్చిన ఆదేశాలతో తాను కావాలనే పక్కా వ్యూహంతో కిడ్నాప్ డ్రామా ఆడానని ప్రసాద్ తెలిపాడు. కులాల మధ్య చిచ్చు పెట్టి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈవిధంగా చేసినట్టు తెలిపాడు. దీనిపై లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుల వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన మరికొంతమందిని తమ దర్యాప్తులో కనుగొన్నామని, మరిన్ని సాక్ష్యాధారాలతో వారిని అరెస్టు చేయనున్నామని చెప్పారు.(చదవండి: ఏకగ్రీవాలపై ఇదేం పంచాయితీ?) -
తనకు తానే కి డ్నాపయ్యాడు..
కలకలం రేపిన అనంతపురం జిల్లా ధర్మవరం మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలివీ.. పట్టణానికి చెందిన రామాంజనేయులును గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసి బంధించారు. అతడు బందీగా ఉన్న ఫొటో ఫోన్లో వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు అందింది. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు...అది కట్టుకథగా తేల్చారు. చివరికి రామాంజనేయులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. భార్య తండ్రి నుంచి నుంచి డబ్బులు వసూలు చేయటానికే ఈ మేరకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. మంగళవారం సాయంత్రం జరిగే సమావేశంలో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
పెద్ద చదువు.. చీప్ ట్రిక్!
సాక్షి ప్రతినిధి, కడప: అత్యున్నత చదువు సమాజాన్ని ఉద్ధరించేందుకు ఉపయోగపడాలని, స్వకార్యానికి వ్యవస్థను అడ్డగోలుగా వాడుకోడవం సరికాదని రిమ్స్ హౌస్ సర్జన్ కె సుస్మిత కిడ్నాప్ డ్రామాపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాన్ని చక్కబెట్టుకునే క్రమంలో కె.సుస్మిత.. తన సహచరులు కొందరితో కలిసి కిడ్నాప్ డ్రామాను బాగా రక్తి కట్టించింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి రిమ్స్ హౌస్ సర్జన్ సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే విషయం జిల్లాలో సంచలనం రేపింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, రిమ్స్ సమీపంలో ఆటోడ్రైవర్.. స్టాఫ్‌నర్సుపై ఆఘాయిత్యానికి పాల్పడటం తదితర ఘటనల నేపథ్యంలో సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే వార్త విని ప్రజలు, విద్యార్థులు, రిమ్స్ యంత్రాంగం ఒక్కమారుగా తీవ్ర వేదనకు గురయ్యింది. ఉత్తమ వైద్య విద్యార్థినిగా కళ్లెదుట తిరుగాడిన సుస్మితపై దుండగలు ఏ ఆఘాయిత్యానికి పాల్పడతారో నని ప్రాంతాలకు అతీతంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. రిమ్స్ విద్యార్థులంతా ఖాజీపేట, మైదుకూరు, పోరుమామిళ్ల పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోకి గాలింపు కోసం వెళ్లారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజూమున 4 గంటల వరకు నిద్రాహారాలు మాని వెతికారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రిమ్స్ వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లో వాకబు చేస్తూ ఉండిపోయారు. మహిళా మెడికోల తల్లిదండ్రులు ఫోన్లలో పలు జాగ్రత్తలు చెప్పారు. మీడియా ప్రతినిధులు సైతం గంట గంటకు వాకబు చేశారు. కుటుంబ సభ్యులను దారిలోకి తెచ్చుకునేందుకే.... తుదకు రిమ్స్ హౌస్‌సర్జన్ కిడ్నాప్ వ్యవహారమంతా కట్టుకథే అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హౌస్సర్జన్లు సుస్మిత, సాధనారెడ్డిలు శుక్రవారం రాత్రి 7 గంటలకు హాస్టల్ నుంచి ఔటింగ్ అనుమతి తీసుకుని ఆటోలో కడపకు వచ్చారు. సుస్మితను బ్యూటీపార్లర్ వద్ద వదిలి తాను వైవిస్ట్రీట్లో షాపింగ్‌కు వెళ్లానని, గుర్తు తెలియని వ్యక్తులు సుస్మితను ఆటోలో తీసుకెళ్లినట్లు, తాను ఫోన్ చేసిన సందర్భంలో భయపడుతూ చెప్పిందని, దీంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు సాధనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆగమేఘాలపై ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. వారికి తోడుగా రిమ్స్ వైద్య విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున మైదుకూరు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే సుస్మిత తన వ్యక్తిగత వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడంలో భాగంగా కుటుంబ సభ్యులను దారిలోకి తెచ్చుకోవడానికి ఈ నాటకానికి తెరలేపినట్లు రూఢీ అవుతోంది. కిడ్నాఫ్ డ్రామా తెరపైకి తెచ్చి, మైదుకూరు సమీపంలో సెల్‌ఫోన్ ఆఫ్ చేసి తాఫీగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. శనివారం ఉదయానికి సుస్మిత హైదరాబాద్‌లో సేఫ్‌గా ఉందని తెలుసుకున్న ప్రజానీకం ఓవైపు ఊపిరి పీల్చుకుంటూనే, ఇలా చేసి ఉండాల్సింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ యుగమిది.. తాము మేజర్లమని, తన స్నేహితునితో వివాహం చేయించండని ఏ పెద్ద మనిషినో, పోలీసుస్టేషన్నో ఆశ్రయించి ఉంటే ఇంత మంది ఇలా ఆందోళనపడాల్సి వచ్చేది కాదు. అరకొర చదువుకున్న వారు సైతం ఆ దిశగా వెళ్లి ఒక్కటవుతుండగా, ఉన్నత చదువు చదువుతూ ఇలా చేయడం భావ్యం కాదనే వాదన వినిపిస్తోంది. శ్రీకృష్ణుడు,రుక్మిణి కళ్యాణం నాటి నుంచే ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఏనాడో వచ్చిన బాలరాజు సినిమాలో అక్కినేని ప్రేమ పెళ్లి చోటుచేసుకుంది. అలాంటిది శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సుస్మిత తన ఇబ్బందిని ఓపెన్‌గా చెప్పుకుని ఉండింటే ఫేస్బుక్, వాట్సాఫ్ ద్వారా ప్రపంచం మద్దతు పలికేది. ఏం చేయాలో దిక్కుతోచని మానసిక స్థితిలో సుస్మిత ఇలా చేయాల్సి వచ్చిందా.. లేక మరేదైనా కారణం ఉందా.. ఇలా చేస్తేనే ఫలితం ఉంటుందని ఎవరైనా తప్పుదోవ పట్టిచ్చారా.. అనే వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. కాగా, సుస్మిత, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితుడు ఉదయ్‌ని కడప ఒకటవ పట్టణ సీఐ రమేష్ హైదరాబాద్ నుంచి శనివారం రాత్రి కడపకు తీసుకువచ్చారు. -
ఇంటర్ కుర్రాడి కిడ్నాప్ డ్రామా..!
ఖమ్మం క్రైం: ఓ కాలేజీ కుర్రాడు వేసిన ‘కిడ్నాప్ డ్రామా’... ఒకవైపు అతడి తల్లిదండ్రులను, మరోవైపు కళాశాల సిబ్బందిని, ఇంకోవైపు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసలేం జరిగిందంటే... ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం గ్రామానికి ఆ కుర్రాడి పేరు మధు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు రోజులాగానే మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత.. ‘‘అమ్మా, నాన్నా.. ఆరుగురు వ్యక్తులు వచ్చి నన్ను కళాశాల ముందు కిడ్నాప్ చేసి ఇన్నోవా వాహనంలో తీసుకెళుతున్నారు. నన్ను రక్షించండి. లేదంటే వాళ్లు నన్ను చంపేస్తారు’’ అంటూ, తన సెల్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడుతూ చెప్పాడు. ఆ తల్లిదండ్రులు తీవ్ర భయూందోళనతో రోదిస్తూ ఉరుకులు పరుగులతో కళాశాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో చెప్పారు. వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. ఆ కుర్రాడి తల్లిదండ్రులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఇంతలోనే మధు సెల్ నుంచి తల్లికి ఫోన్ వచ్చింది. ‘‘అమ్మా.. నన్ను కొడుతున్నారు... లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే పోలీసులు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ ఫోన్ కాల్సన్నీ నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి సెల్ టవర్ నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ఆ సెల్ పరిధిలోని ప్రాంతాల్లో టూటౌన్ సీఐ సారంగపాణి ఆధ్యర్యంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది కలిసి వెతుకుతున్నారు. ఈ లోపు మధు ఫోన్ నుంచే మరో ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లండి’’ అని, బెదిరింపు ధోరణిలో చెప్పాడు అవతలి వ్యక్తి. ఈ ఫోన్ కూడా ఇదే సెల్ టవర్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు నిర్థారించుకున్నారు. ఆ ‘కిడ్నాపర్లు’ ఇక్కడో ఎక్కడో ఉంటారనుకుని పోలీసులు తేల్చుకున్నారు. వెతకగా.. వెతకగా... బ్రిడ్జి దగ్గరలోని ముళ్ల పొదల్లో ఆ సెల్ ఫోన్ ఉన్నట్టుగా గమనించి, నెమ్మదిగా అక్కడకు వెళ్లారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. మరింతగా దగ్గరగా వెళ్లి చూశారు. ఏముంది...? ‘కిడ్నాపైన’ కుర్రాడు మధు అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు..! పోలీసులను చూడగానే అతడు కొన్ని క్షణాలపాటు అవాక్కయ్యూడు. ఆ వెంటనే ఏడుస్తూ.. ‘‘నన్ను కిడ్నాప్ చేసినవారు ఇప్పుడే వెళ్లారు’’ అని చెప్పాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుళ్లి విచారించారు. అంతా ఉత్తిదే.. డ్రామా ఆడా.. ‘‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అంతా ఉత్తిదే. నేనే కిడ్నాప్ డ్రామా ఆడా’’ అని, ఆ కుర్రాడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ‘‘నాకు ఎంపీసీ గ్రూప్ ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను’’ అని చెప్పాడు. కిడ్నాపర్ మాదిరిగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కూడా తానేనని, గొంతు మార్చి మాట్లాడానని చెప్పాడు. ఈ కుర్రాడు గతంలో కూడా ఇలాగే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులు చెప్పారు. అతడిని పోలీసులు గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే దండిస్తామని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని గంటలపాటు కలవరపాటుకు గురిచేసిన ఈ వ్యవహారం ఇలా సుఖాంతమవడంతో అందరూ హారుుగా ఊపిరి పీల్చుకున్నారు.