ఖమ్మం క్రైం: ఓ కాలేజీ కుర్రాడు వేసిన ‘కిడ్నాప్ డ్రామా’... ఒకవైపు అతడి తల్లిదండ్రులను, మరోవైపు కళాశాల సిబ్బందిని, ఇంకోవైపు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
అసలేం జరిగిందంటే...
ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం గ్రామానికి ఆ కుర్రాడి పేరు మధు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు రోజులాగానే మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాడు.
కొద్దిసేపటి తరువాత.. ‘‘అమ్మా, నాన్నా.. ఆరుగురు వ్యక్తులు వచ్చి నన్ను కళాశాల ముందు కిడ్నాప్ చేసి ఇన్నోవా వాహనంలో తీసుకెళుతున్నారు. నన్ను రక్షించండి. లేదంటే వాళ్లు నన్ను చంపేస్తారు’’ అంటూ, తన సెల్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడుతూ చెప్పాడు. ఆ తల్లిదండ్రులు తీవ్ర భయూందోళనతో రోదిస్తూ ఉరుకులు పరుగులతో కళాశాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో చెప్పారు. వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. ఆ కుర్రాడి తల్లిదండ్రులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఇంతలోనే మధు సెల్ నుంచి తల్లికి ఫోన్ వచ్చింది.
‘‘అమ్మా.. నన్ను కొడుతున్నారు... లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే పోలీసులు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ ఫోన్ కాల్సన్నీ నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి సెల్ టవర్ నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ఆ సెల్ పరిధిలోని ప్రాంతాల్లో టూటౌన్ సీఐ సారంగపాణి ఆధ్యర్యంలో ఎస్‌ఐ సురేష్, సిబ్బంది కలిసి వెతుకుతున్నారు. ఈ లోపు మధు ఫోన్ నుంచే మరో ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లండి’’ అని, బెదిరింపు ధోరణిలో చెప్పాడు అవతలి వ్యక్తి. ఈ ఫోన్ కూడా ఇదే సెల్ టవర్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు నిర్థారించుకున్నారు.
ఆ ‘కిడ్నాపర్లు’ ఇక్కడో ఎక్కడో ఉంటారనుకుని పోలీసులు తేల్చుకున్నారు. వెతకగా.. వెతకగా... బ్రిడ్జి దగ్గరలోని ముళ్ల పొదల్లో ఆ సెల్ ఫోన్ ఉన్నట్టుగా గమనించి, నెమ్మదిగా అక్కడకు వెళ్లారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. మరింతగా దగ్గరగా వెళ్లి చూశారు. ఏముంది...? ‘కిడ్నాపైన’ కుర్రాడు మధు అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు..! పోలీసులను చూడగానే అతడు కొన్ని క్షణాలపాటు అవాక్కయ్యూడు. ఆ వెంటనే ఏడుస్తూ.. ‘‘నన్ను కిడ్నాప్ చేసినవారు ఇప్పుడే వెళ్లారు’’ అని చెప్పాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుళ్లి విచారించారు.
అంతా ఉత్తిదే.. డ్రామా ఆడా..
‘‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అంతా ఉత్తిదే. నేనే కిడ్నాప్ డ్రామా ఆడా’’ అని, ఆ కుర్రాడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ‘‘నాకు ఎంపీసీ గ్రూప్ ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను’’ అని చెప్పాడు. కిడ్నాపర్ మాదిరిగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కూడా తానేనని, గొంతు మార్చి మాట్లాడానని చెప్పాడు. ఈ కుర్రాడు గతంలో కూడా ఇలాగే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులు చెప్పారు. అతడిని పోలీసులు గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే దండిస్తామని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని గంటలపాటు కలవరపాటుకు గురిచేసిన ఈ వ్యవహారం ఇలా సుఖాంతమవడంతో అందరూ హారుుగా ఊపిరి పీల్చుకున్నారు.