పిఠాపురం రైల్వే స్టేషన్లో వడదెబ్బకు గురై మృతి చెందిన యాచకుడు
ప్రచండ భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లారాలుతున్నారు. రోజురోజూకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్డుపైకి వచ్చేందుకే నానాపాట్లు పడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో రోడ్లు అగ్నిమండలంగా మారుతున్నాయి. గత మూడురోజులుగా మండుతున్న ఎండలు, వీస్తున్న వడగాడ్పులకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు.
పిఠాపురం: ప్రచండ భానుడి ప్రతాపానికి ఇద్దరు యాచకులు మృత్యువాత పడ్డారు. రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో పిఠాపురంలో పలువురు యాచకులు స్థానిక రైల్వే స్టేషన్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బతో ఇద్దరు యాచకులు రైల్వే స్టేషన్లో మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో యాచకుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రాజవొమ్మంగిలో వ్యక్తి మృతి
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలోని జడ్డంగి గ్రామానికి చెందిన గిరిజనుడు ముంగారి గురుమూర్తి వడదెబ్బకు గురై సోమవారం ఇంటి వద్ద మరణించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గురుమూర్తి సోమవారం ఉదయం యథావిధిగా పొలానికి వెళ్లి జీడిమామిడి పిక్కలు సేకరించాడు. ఇంటికి వచ్చిన ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలి మరణించనట్టు భార్య నాగరత్నం తెలిపింది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్, పోలీసులు తదితర అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
తోటలో కాపలాకి వెళ్లి అస్వస్థత
మధురపూడి (రాజానగరం): మండుతున్న ఎండలతో పాటు, వడగాడ్పులు వీయడంతో కోరుకొండ మండలం మధురపూడికి చెందిన మేడిశెట్టి ఏడుకొండలు (53) సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. తోటల్లో కాపలా ఉంటున్న ఇతడు ఎండలు, వడగాడ్పుల కారణంగా శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. వాంతుల వల్ల మరింత నీరసించి పోయాడు. ఆదివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం మృతిచెందాడు. స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు దీనిని ధ్రువీకరించారు. స్థానిక నాయకులు పరిశీలించారు.
కూలి పనులకు వెళ్లి..
గ్రామీణ ప్రాంతంలోని రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం రోజువారీ వ్యవసాయ çపనుల నిమిత్తం తోటలు, పొలాల్లోకి వెళ్లాల్సిన వారు వడదెబ్బకు గురై నీరసిస్తున్నారు. పెరుగుతున్న ఎండలు, వడగాడ్పులకు వీరంతా భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment