ఎండ వల్ల ఆదివారం మధ్యాహ్నం ఇదీ కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్లో పరిస్థితి
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: మార్చిలోనే మాడుపగిలేలా ఎండలు అదరగొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులూ వీస్తున్నాయి. రెండు మూడు రోజులుగా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వడదెబ్బ లక్షణాలు..
శరీర ఉష్ణోగ్రత 105.1 ఎఫ్ కంటే ఎక్కువ ఉండడం. నీరసంగా ఉంటూ తడబడడం. చర్మం పొడిబారడం. మూత్రం ముదురు పసుపురంగులో ఉండి, విసర్జించే సమయంలో మంట. సొమ్మసిల్లి పోవడం
వడదెబ్బకు కారణాలు
నీరు తక్కువగా తాగడం. మత్తు పానీయాలు ఎక్కువగా తాగడం. ఎండలో ఎక్కువగా తిరగడం. వృద్ధుల్లో వయస్సుకు సంబంధించిన శారీరక మార్పులు.
ఇలా నివారించొచ్చు..
ఎండలో ఎక్కువ తిరగకుండా ఉండడం. నీటితో పాటు ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం (దీని వలన శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు). మత్తుపానీయాలకు దూరంగా ఉండడం. (మద్యం తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది). వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం. గొడుగు వాడడం, దూదితో నేసిన తెలుపు వస్త్రాలను ధరించడం. తలకు టోపీ లేదా రుమాలు అడ్డుపెట్టుకోవడం.
ఇదీ చికిత్స..
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి తడిగుడ్డతో పలుమార్లు తుడవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తాగించాలి. వీలైనంత త్వరగా హాస్పిటల్‌లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలి. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఐవీ డ్రిప్ పెట్టాలి. రోగి బీపీ పల్స్‌లను గమనిస్తూ ఉండాలి.
ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులూ అందుబాటులో ఉంచాం..
ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. 36 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అన్ని కేంద్రాల్లో ఆరు లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వడదెబ్బ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులనూ అందుబాటులో ఉంచాం. ప్రతి ఆరోగ్యకార్యకర్త, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాం.సాధారణంగా నీరు కాకుండా ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగడం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మరం వంటివి తాగితే శరీరంలోకి ఎక్కువ ప్రోటీన్లు చేరతాయి. కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రంగురంగుల గొడుగులు (నలుపు మినహా) వాడాలి.– డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment