
అధికారంలోకి రాగానే బెల్టు షాపులను తొలగిస్తామని పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులను మూసేయాలని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వాటి జోలికి వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ద్వంద్వ నీతి కారణంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది.
♦ గత నెలలో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామాంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఇంట్లో బెల్ట్‌షాపు నిర్వహిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 60 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో బెల్ట్‌షాపు కొనసాగుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
♦ అదే మండలంలోని గొడ్డుమర్రిలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 42 బాటిళ్ల మద్యం లభ్యమైంది. ఈ బెల్ట్‌షాపు కూడా టీడీపీ నేతకు చెందినదే. ఈ మద్యం బాటిళ్లు నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడయింది.
♦ ఈ రెండు ఉదాహరణలు చూస్తే జిల్లాలో బెల్టు షాపులు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం సిండికేట్‌ల వ్యవహారం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. బినామీల పేరుతో దుకాణాలను దక్కించుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగించారు. అప్పట్లో 80 శాతం దుకాణాలు తెల్ల రేషన్ కార్డుదారులైన బినామీల పేరుతో నిర్వహించారు. ఈ క్రమంలో అబ్కారీశాఖ పాత విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రస్తుతం లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 246 మద్యం దుకాణాలు ఉండగా.. వీటిలో చాలా దుకాణాల పరిధిలో బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మే వరకు బెల్ట్‌షాపుల నిర్వాహకులు దుకాణాల నుంచి మద్యం కేసులను తీసుకెళ్లి విక్రయించేవారు. అయితే ఆన్‌లైన్‌బిల్లింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
గతంలో ఆర్గనైజర్(గదిలో విక్రయాలు) బెల్ట్ దుకాణాలు కనిపించేవి. ఇప్పుడు మొబైల్(ఊర్లో తిరుగుతూ అమ్మడం) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆర్గనైజర్ దుకాణాలు కూడా చాలా గ్రామాల్లో కొనసాగుతున్నాయి. వీరు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి కొనుగోలు చేస్తారు. ఒక దుకాణంలో గరిష్టంగా ఆరు బాటిళ్లు విక్రయించొచ్చు. అంతకంటే ఎక్కువ విక్రయిస్తే మద్యం దుకాణం ఆధ్వర్యంలోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నట్లు. దీంతో బాటిళ్ల ఆన్‌లైన్ బిల్లింగ్‌లో ఆరు బాటిళ్లకు మించకుండా బిల్లు చేస్తున్నారు. రోజూ వచ్చే వారు, ఒక బాటిల్‌కు వచ్చే వారి పేరుతో బిల్లులు ఇస్తున్నారు. గొడ్డుమర్రిలో అధికారుల దాడుల్లో దొరికిన 42 బాటిళ్లు ఏ దుకాణంలో కొనుగోలు చేశారని ఆరా తీస్తే పులివెందులలోని నాలుగు దుకాణాల్లో కొనుగోలు చేసినట్లు తేలింది. తిమ్మంపల్లిలోని 60 బాటిళ్లు కూడా పలు షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడయింది.
అంటే బెల్ట్‌షాపు నిర్వాహకులు పట్టణాల్లో ఐదారు దుకాణాలు తిరిగి బాటిళ్లు కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలా తీసుకెళ్లిన బాటిళ్లను ఇంట్లో పెట్టుకుని కొందరు బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇంకొందరు జేబులో పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.25 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ తరహా బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు అధికారులకు తెలిసినా లక్ష్యాన్ని అధిగమించేందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీకి 60 శాతం ఆదాయం వస్తుంటే, 40 శాతం ‘బెల్ట్’ ద్వారానే సమకూరుతోంది.
ఆర్డర్ సరే.. ఆచరణ కరువు
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం పీఠమెక్కాక రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చారు. తీ నేపథ్యంలో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ‘బెల్ట్ రాగాన్ని’ అందుకున్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. నిజానికి బెల్ట్‌షాపుల నిర్వహణకు ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో అనుమతుల్లేవు. అయినప్పటికీ ఓ జీఓను కూడా జారీ చేశారు. దీంతో బాబు మాటపైన నిలబడ్డారని అంతా భావించారు.
ఇంతలోనే తనదైన శైలిలో ‘బెల్ట్’ జోలికి వెళ్లొద్దని.. ‘బెల్ట్’ తీస్తే సర్కారు ఖజానాకు గండిపడుతుందని మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎంత మద్యం తాగిస్తే.. అంత ఆదాయం వస్తుందని కూడా బాబు సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు ‘బెల్ట్’ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. పైగా కొత్త నిబంధనల మేరకు లాటరీలో ఎవరి పేరుతో షాపు వస్తుందో వారే నడపాలి. అయితే లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి నుంచి తిరిగి ‘ఎక్సెస్ రేటు’తో ఖద్దరు నేతలు దుకాణాల్లో పాగా వేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment